nallavagu project
-
ముహూర్తం కుదిరింది
కల్హేర్(నారాయణఖేడ్) : జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగుకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రాజెక్టు కాల్వల ఆధునికీకరణ పనులు ప్రారంభించేందుకు అధికారులు ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం పనులు ప్రారంభించనున్నారు. సీఏం కేసీఆర్ పనులను ప్రారంభించాల్సి ఉండగా అప్పట్లో భారీ వర్షాలతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. నల్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని గత అసెంబ్లీ సమావేశల్లో స్థానిక ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించి నల్లవాగు ప్రాజెక్టు రూపురేఖలు మారుస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు అప్పట్లో అధికారులు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ క్రమంలో ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం ప్రభుత్వం రూ.24.14 కోట్లు కేటాయించింది. దీంతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే సీజన్‌నాటికి మహర్దశ.. నల్లవాగు ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆధునికీకరణ పనులు చేపడితే వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి మహర్ధశ పట్టనుంది. దెబ్బ తిన్న కాల్వల రూపురేఖలు మారనున్నాయి. కాల్వల మధ్యలో తూ ములు, షట్టర్లు, సైఫాన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు పరిధిలోని నిర్ధారిత ఆయకట్టు 6,030 ఎకరాలకు పూర్తిగా సాగు నీరందిం చేందుకు ప్రభుత్వం రూ.24.14 కోట్లు కేటాయించడంతో ఆధునికీకరణ పనులు పూర్తై ఆయ కట్టు రైతుల కష్టాలు తీరనున్నాయి. వెంటనే పనులు ప్రారంభం.. నల్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టేం దుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేశాం. వచ్చే ఖరీఫ్‌లో జూన్ మాసం చివరి వరకు పనులు పూర్తిచేస్తాం. కాల్వల ఆధునికీకరణ, తూములు, షట్టర్లు, గైడ్‌వాల్స్, ఇతర ప్రధాన పనులు చేపడతాం. చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించే దిశగా పనులు చేస్తాం. కుడి, ఎడమ కాల్వల పరిధిలోని 2,500 ఎకరాలకు అదనంగా సాగు నీరందుతుంది. – రాములుగౌడ్, ఈఈ నీటి పారుదల శాఖ -
జలకళ సంతరించుకున్న నల్లవాగు ప్రాజెక్టు
కార్యరూపం దాల్చని వృథా నీటి మళ్లింపు పనులు శిథిలమైన కాల్వలు, తూములు సాగుపై రైతుల్లో మోదం.. ఖేదం కల్హేర్: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు కింది ఆయకట్టు రైతుల్లో ‘ఖరీఫ్’ ఆశలు మొలకెత్తాయి. నల్లవాగు ఎగువ భాగంలోని కర్ణాటక రాష్ట్రం, కంగ్టి మండలంలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటోంది. ఈక్రమంలో ఆలస్యంగా వర్షాలు పడడంతో ఖరీఫ్ సాగు కోసం రైతుల పరిస్థితి సందిగ్ధంలో ఉంది. మెజారిటీ శాతం రైతులు వరి సాగు కోసం సన్నద్ధంగా కాగా.. మరికొందరు ఇప్పటికే సోయాబీన్, పెసర తదితర పంటలు వేశారు. ప్రాజెక్టు కింద చాలామంది రైతులు సాగుకు దూరంగా ఉన్నారు. ఆలస్యమైన వర్షాలు ఆలస్యంగా పడిన వర్షాల వల్ల ప్రాజెక్టు నిండుతుండటంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. వరి సాగు చేయదలచినవారు సందిగ్ధంలో ఉన్నారు. పెసర పంట చేతకొచ్చాక వరి వేస్తామని కొందరు చెబుతున్నారు. మరో పక్క నల్లవాగు ప్రాజెక్టు కాల్వల దుస్థితి అధ్వానంగా మారింది. ఖరీఫ్‌లో ఆయకట్టు భూములకు సక్రమంగా నీరు సరఫరా జరిగేందుకు దెబ్బతిన్న కాల్వల మరమ్మతులు ముందస్తుగా చేయాల్సి ఉంది. ఇప్పటికే గండ్లు, బుంగలు పడి ప్రాజెక్టు కాల్వలు దెబ్బతిన్నాయి. తూములు, సైఫాన్లు, షట్టర్లు పాడయ్యాయి. ప్రాజెక్టు కింది భాగంలో ఎమర్జెన్సీ కెనాల్ పూర్తిగా ధ్వంసమైంది. దివంగత సీఎం వైఎస్ ఆధ్వర్యంలో... నల్లవాగు కాల్వలను ఆధునీకరణకు 2009–10లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.14.19 కోట్లు మంజూరు చేశారు. పనుల్లో నాణ్యత లోపంతో సిమెంట్ కట్టడాలు బీటలువారాయి. కాల్వల మధ్య పిచ్చి మొక్కలు మొలిచాయి. దీంతో చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈనేపథ్యంలో ఆయకట్టు కింది రైతులు బోర్లు తవ్వుకుంటున్నారు. నల్లవాగు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు ముందు కాల్వలను బాగు చేయాలని వారంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవలే రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించి నల్లవాగు ప్రాజెక్టు రూపురేఖలు మారుస్తామని ప్రకటించారు. దీంతో ఆయకట్టు కింది రైతుల్లో ఆశలు చిగురించాయి. ఖరీఫ్ సాగు కోసం కాల్వలను తక్షణమే బాగుచేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు. పెరుగుతున్న నీటిమట్టం నల్లవాగు ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,493 ఫీట్లు. పూర్తి నీటి నిల్వ 776.13 ఎంసీఎఫ్‌టీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 1,488 ఫీట్లు ఉంది. సోమవారం కురిసిన వర్షంతో ఒక అడుగు నీరు చేరింది. నీటి నిల్వ 471.547 ఎంసీఎఫ్‌టీలు ఉందని ప్రాజెక్టు ఏఈ సూర్యకాంత్ తెలిపారు. 453 క్యూసెక్ల వరద నీరు వచ్చిందని, మరో 5 అడుగులు చేరితే ప్రాజెక్టు నిండి అలుగుపై పొంగే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తిగా నిండితే పోచాపూర్, బీబీపేట, మార్డి, ఖానాపూర్(కె) చెరువులు నిండుతాయి. వాగులు ప్రవహించడంతో బోరుబావుల్లో భూగర్భజలాలు పెరుగుతాయి. తాగు, సాగు నీటి కష్టాలు దూరమవుతాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండాలని బీబీపేట, పోచాపూర్ గ్రామాల రైతులు నల్లవాగు వద్ద కట్ట మైసమ్మకు ప్రత్యేకంగా పూజలు చేశారు. 5 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు కలే్హర్ మండలంలోని సుల్తానాబాద్ వద్ద 1967లో రూ.98 లక్షలతో నల్లవాగు ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడి, నీటి పారుదలశాఖ మంత్రి శీలం సిద్దారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. కుడి కాల్వ పరిధిలో సుల్తానాబాద్, గోసాయిపల్లి, పోచాపూర్, బీబీపేట, మార్డి, ఖానాపూర్(కె), కృష్ణాపూర్, ఇందిరానగర్, కలే్హర్ వరకు 4,100 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఎడమ కాల్వ పరిధిలో బోక్కస్‌గాం, అంతర్గాం, నిజామాబాద్ జిల్లా మార్దండ, తిమ్మనగర్ గ్రామాల్లో 1,230 ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వల ఆధునీకరణ జరగడంతో ఇక కష్టాలు తీరినట్టే అని భావించిన ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆధునికీకరణ చేసి రెండేళ్లు గడిచాయో లేదో పాత పరిస్థితి తలెత్తింది. చివరి ఆయకట్టు పరిధిలోని మార్డి, ఇందిరానగర్, కల్హేర్ గ్రామల్లోS రైతుల కష్టాలు యథావిధిగానే ఉన్నాయి. పేరుకున్న పూడిక నల్లవాగు ప్రాజెక్టులో ఏటా పూడిక పేరుకుపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో నీటినిల్వ తగ్గుతోంది. పూడిక ఎంత మేరకు ఉందో గుర్తించేందుకు అధికారులు 5 ఏళ్ల క్రితం హైడ్రాలాజికల్ సర్వే జరిపినా పురోగతి లేదు. నల్లవాగు ప్రాజెక్టు నిండిన ప్రతిసారి అలుగుపై నుంచి నీరు పొర్లుతోంది. వృథానీటికి అడ్డుకట్ట వేసేందుకు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో సర్వే నిర్వహించారు. నల్లవాగు నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులో మళ్లించాలని అప్పట్లో అధికారులు ప్రభుత్వానికి రూ.98 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. వైఎస్ఆర్ ఆకస్మిక మరణంతో ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. వృథా నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మళ్లిస్తే కలే్హర్ మండలంలోని చెరువులు, కుంటలు నిండి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోని అన్నదాతలకు లాభం చేకూరుతుంది. -
విహంగ వీక్షణం
♦ నల్లవాగు, గట్టులింగంపల్లి పరిసరాలపై మంత్రి హరీశ్‌రావు ఏరియల్ వ్యూ ♦ తాగు,సాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులతో చర్చలు నారాయణఖేడ్/కల్హేర్/మనూరు: గట్టులింగంపల్లి, నల్లవాగు ప్రాజెక్టులను రాష్ర్ట భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మంగళవారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ఉదయం 10 గంటల కు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుం చి నారాయణఖేడ్ వచ్చారు. తొలుత సింగూరు ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం మనూరు మండలంలోని గట్టులింగంపల్లి చెరువును, కల్హేర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టును హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. సింగూరు ప్రాజెక్టులోకి గోదావరి నీళ్ల మళ్లింపు, గట్టులింగంపల్లి ప్రాజెక్టులోకి సింగూరు నీరు మళ్లించే విషయమై సాధ్యాసాధ్యాలను అంచనా వేశారు. నల్లవాగు నీటిని సాగు, తాగునీటి అవసరాలకు సరఫరా చేసే విషయమై ఈ సర్వే చేపట్టారు. నల్లవాగు ప్రాజెక్టు పరిసరాలను ఆయన సుల్తానాబాద్, గోసాయిపల్లి, అంతర్గాం, కంగ్టి మండలం నాగన్‌పల్లి, పోట్పల్లి, నిజామాబాద్ జిల్లా తిమ్మనగర్ వరకు పర్యటించి విహంగ వీక్షణం చేశారు. సమస్య పరిష్కారానికి మంత్రి అధికారుల సలహా సూచనలు స్వీకరించారు. అనంతరం మంత్రి గంగాపూ ర్లో మిషన్ కాకతీయ 2వ ఫేజ్ పనులను ప్రారంభించారు. సాయంత్రం 4కి తిరిగి హెలికాప్టర్ ద్వారా మంత్రి వరంగల్ జిల్లా జనగామకు వెళ్లారు. చర్చనీయాంశమైన ‘సాక్షి’ కథనాలు గట్టులింగంపల్లి చెరువు గురించి మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమై న ‘గట్టు కదిలిక’, మంత్రి ఏరియల్ సర్వే కు రానున్నారనే విషయాలను మండల ప్రజలు ఆసక్తిగా చదివారు. ఈ చెరువు ప్రాజెక్టు రూపుదాలిస్తే మనూరు మండలానికి మంచి రోజులు వస్తాయని ప్రజ లు చర్చించుకోవడం కనిపించింది. మం త్రి పర్యటను ఆసక్తిగా తిలకించారు. ‘ఖేడ్’ దుఃఖం తీరుస్తా.. నీటి సమస్యను పరిష్కరిస్తా.. జిల్లాకు రూ.10 కోట్లు వస్తే.. ఖేడ్కే రూ.1.80 కోట్లు చిమ్నీమాయి కొడుకు పెళ్లికి వెళ్దాం మంత్రి హరీశ్‌రావు నారాయణఖేడ్: ‘నారాయణఖేడ్ ని యోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి, హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా.. ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేను.. నా శక్తినంతా ఉపయోగించి ఖేడ్ నియోజకవర్గ ప్రజల దుఃఖం దూరం చేస్తా.. ఖేడ్‌ను దత్తత తీసుకుంటానని చెప్పాను.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా..’ అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఉద్వేగంతో అన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా భూపాల్‌రెడ్డి ఎన్నికైన సందర్భంగా స్థానిక రహమాన్ ఫంక్షన్‌హాలులో మంగళవారం అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రేమాభిమానాలతో పనిచేసి ప్రజల ఆదరాభిమానాలను పొందుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారను. నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్యను తీర్చాల్సి ఉందన్నారు. నీళ్ల కోసం గోస పడుతున్న సర్దార్ తండాలోని చిమ్నీమాయి వంటి వారి సమస్యలను పరిష్కరిద్దామని, చిమ్నీమాయి కొడుకు పెళ్లికి కూడా వెళ్దామని మంత్రి అన్నారు. నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెడతానని మంత్రి అన్నారు. జిల్లాకు తాగునీటి కోసం రూ.10.80 కోట్లు రాగా తన సిద్దిపేకు కేవలం రూ.50 లక్షలు మాత్రమే తీసుకొని నారాయణఖేడ్‌కు రూ.1.80 కోట్లు ఇచ్చినట్లు తెలి పారు. ప్రాంతంలో గురుకులాలను ఏర్పాటుచేసి ఈ ప్రాంత విద్యార్థులు ఇక్కడే ఉండి చదువుకునేలా చూస్తానని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఖేడ్‌లో కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ షురూ ఈ చిత్రంలో కనిపిస్తున్నది నారాయణఖేడ్‌లోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం. బెడ్రూం, డైనింగ్ హాల్ ఇతర ఆధునిక సాంకేతిక హంగులతో దీన్ని రూపొందించారు. మంగళవారం మంత్రి హరీశ్‌రావు దీన్ని ప్రారంభించారు. ప్రతి 15 రోజులకోసారి జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ ఈ క్యాంపు ఆఫీస్‌లోనే బస చేస్తారు. రోజంతా ఇక్కడే గడిపి ఖేడ్ అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. మరోపక్క మంత్రి హరీశ్‌రావు సైతం వీలైతే 15 రోజులకు లేదా నెలకోసారి వస్తానని ప్రకటించారు. ఏళ్లకేళ్లుగా అభివృద్ధి జాడలేక నెర్రెలు బాసిన నారాయణఖేడ్ ఇప్పుడిప్పుడే కొత్తరూపు దాల్చుతోంది. నీళ్లు.. బళ్లు.. రోడ్లు.. భవనాలు ఇలా ప్రతి పనికి లెక్కగట్టి అధికారులు నిధులిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి