‘వారి సర్టిఫికెట్ అవసరం లేదు’
మైసూరు: భ్రష్టు పట్టిన కాంగ్రెస్ పార్టీకి చికిత్స చేయాల్సిన అవసముందని వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ఆదివారం నగర శివార్లలోని మండకళ్లి విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, పని తీరుపై మాజీల సర్టిఫికెట్ తమకు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేయడంతో నంజనగూడు నియోజకవర్గంలో జరుగనున్న ఉప ఎన్నికలను తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామన్న వార్తలను ఆయన ఖండించారు. ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కొత్తేమి కాదని, నంజనగూడు ఎన్నికను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తెలిపారు. నంజనగూడు విధానసభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని ఖరారు చేయలేదని సిద్ధరామయ్య తెలిపారు. శ్రీనివాస్ ప్రసాద్ తనపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు తాను స్పందించనని, ఇపుడు ఆయన తమ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవడంతో ఆ ఆరోపణలకు స్పందిచాల్సిన అవసరం తమకు లేదని అన్నారు.
ముఖ్యమంత్రి పదవి తరువాత కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా మూడేళ్లు పదవి అనుభవించిన శ్రీనివాస ప్రసాద్ మంత్రి వర్గ విస్తరణలో పదవి తొలగించగానే రాజీనామా చేయడంపై ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. టిప్పు సుల్తాన్‌పై కొంత మంది అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఆయన జయంతి వేడుకలను నిషేధించాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు. బెంగళూరులో నిర్మించనున్న స్టీల్‌బ్రిడ్జ్ నిర్మాణంపై జూన్‌లో సామాజిక మాధ్యమాలలో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించగా 73 శాతం మంది బ్రిడ్జి నిర్మాణానికి అనుకూలంగా అభిప్రాయాలను సిద్ధరామయ్య వెల్లడించారని తెలిపారు. గోవాలో కన్నడిగులపై దాడులు జరుగడం తనను తీవ్రంగా కలచివేసిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోవా రాష్ట్ర ముఖ్య కార్యదర్శితో మాట్లాడారని గోవాలో కన్నడిగులకు భద్రత కల్పించాలని కోరినట్లు సీఎం తెలిపారు.