Nampally civil court
-
హైదరాబాద్: నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత
-
నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత.. బీజేపీ, ఎంఐఎం కార్యకర్తల పోటాపోటీ నినాదాలు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా కోర్టు వద్దకు చేరుకున్నారు. ఆయనకు మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. మరోవైపు కోర్టు బయట ఎంఐఎం పార్టీ అనుచరులు కూడా ఆందోళన చేపట్టారు. రాజాసింగ్‌కు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు. రాజాసింగ్‌కు అనుకూల, వ్యతిరేక వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ.. కోర్టు ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. చదవండి: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన బీజేపీ హైకమాండ్.. పది రోజుల్లోగా.. ఇదిలా ఉండగా మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తొలగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌పై హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. మంగళవారం ఒక్కరోజే ఈ బీజేపీ ఎమ్మెల్యేపై 12 కేసులు నమోదవడం గమనార్హం. -
ఆర్టీసీని కించపరిచే ప్రకటన తొలగించండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సును కించపరిచేలా సినీ హీరో అల్లు అర్జున్‌తో ఓ యాప్ ఆధారిత బైక్ టాక్సీ అగ్రిగేటర్ రూపొందించిన ప్రచార చిత్రాన్ని ప్రదర్శన నుంచి తొలగించాల్సిందిగా నాంపల్లిలోని సిటీసివిల్ కోర్టు ఆదేశించిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఆ బైక్ టాక్సీ సంస్థ పనితీరు ఉత్తమంగా ఉంటుందని చూపించే క్రమంలో ఆర్టీసీ బస్సులను తక్కువ చేసేలా ప్రచార చిత్రాన్ని రూపొందించి యూట్యూబ్‌లో ప్రసారం చేస్తుండటాన్ని తప్పుపడుతూ ఇటీవల ఆర్టీసీ ఎండీ పరువునష్టం దావా హెచ్చరికలతో ఆ సంస్థకు, నటుడు అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. అయినా ప్రసారాలను నిలిపివేయకపోవటంతో ఆర్టీసీ నాంపల్లి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఆర్టీసీకి అనుకూలంగా కోర్టు ఆదేశాలు జారీ చేసిందని సజ్జనార్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నోటీసుల అనంతరం స్వల్పంగా ప్రచార చిత్రంలో మార్పు చేసినా.. ఆర్టీసీ బస్సును అలాగే చూపించటాన్ని తప్పుపడుతూ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇప్పుడు ఆ ప్రచార చిత్రాన్ని ప్రసారం నుంచి తొలగించాలని, వీడియో అసలు, సవరించిన యాక్సెస్‌ను బ్లాక్ చేయాలని గూగుల్ ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ని కోర్టు ఆదేశించినట్టు వెల్లడించారు. -
పాకిస్తానీ ఇక్రమ్‌కు ఐదేళ్ల జైలు
సాక్షి, హైదరాబాద్: దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్ పొంది, సైబర్ క్రైమ్‌కు పాల్పడి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన పాకిస్తాన్ జాతీయుడు మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్‌ను నాంపల్లి కోర్టు దోషిగా తేల్చింది. ఇతడికి ఐదేళ్ల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. నకిలీ పత్రాలు సమకూర్చడం ద్వారా ఇతడికి సహకరించిన ముంబై వాసి నితీస్ కుమార్ మూలేకూ ఐదేళ్ల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధించింది. ఈ కేసును సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ భద్రంరాజు రమేష్ దర్యాప్తు చేశారు. ‘ఆమె’ కోసం వచ్చి బుక్కయ్యాడు.... పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. సదరు మహిళకు ఇద్దరు కుమార్తెలు. ఆమె 13 ఏళ్ల క్రితం బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్ళారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న ఈ మహిళకు పాకిస్తానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్‌తో పరిచయమైంది. తాను భారతీయుడినే అని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించిన అతగాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ళకు అసలు విషయం తెలిసిన మహిళ హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. 2011లో ఉస్మాన్ సైతం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అప్పట్లో తాను ఆరు నెలల విజిట్ వీసాపై వచ్చానంటూ చెప్పాడు. అయితే వాస్తవానికి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన అతడు దుబాయ్ నుంచి నేపాల్ వరకు విమానంలో వచ్చిన అతగాడు అక్కడ నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ వెళ్ళి అట్నుంచి హైదరాబాద్ వచ్చాడు. వేధింపులకు పాల్పడి చిక్కాడు... ఇక్రమ్ వచి్చన ఆరు నెలలకు ఇతగాడు అక్రమంగా దేశంలోకి వచ్చాడన్న విషయం తెలుసుకున్న సదరు మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించారు. దీంతో కక్షకట్టిన అతగాడు ఆమె మైనర్ కుమార్తె చిత్రాలు చిత్రీకరించడంతో పాటు కొందరికి ఆన్లైన్లో విక్రయించానంటూ బెదిరింపులకు దిగాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే సదరు ఫొటోలను బయటపెడతానంటూ బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్ సందేశం పంపాడు. అతడి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ భద్రంరాజు రమేష్ 2018 జూన్‌లో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణ నేపథ్యంలో అబ్బాస్ పేరుతో అనేక బోగస్ ధ్రువీకరణలు పొందిన ఉస్మాన్ పాస్‌పోర్ట్ సైతం తీసుకున్నట్లు వెల్లడైంది. సరి్టఫికెట్ల ఆధారంగా కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేసినట్లు బయటపడింది. ధ్రువీకరించిన పాక్ ఎంబసీ ఆఫీస్... ఇక్రమ్ పాక్ జాతీయుడని నిర్థారించడం కోసం పోలీసులు విదేశీ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ద్వారా పాక్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆ దేశ రాయబార కార్యాలయం అతడు తమ జాతీయుడే నంటూ ఇచి్చన జవాబు సైతం ఎంఈఏ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు చేరింది. దీన్ని ఆధారంగా చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇక్రమ్‌పై ఐపీసీ, పోక్సో చట్టాలతో పాటు ఫారినర్స్ యాక్ట్, పాస్‌పోర్ట్ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద అభియోగపత్రాలు దాఖలు చేశారు. నితీష్ పైనా సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఇద్దరికీ శుక్రవారం శిక్ష విధించింది. -
నాంపల్లి కోర్టు: లైంగిక వేధింపుల కేసు.. హోంగార్డుకు 30 ఏళ్ల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. లైంగిక దాడి కేసులో నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వివరాలు.. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో హోంగార్డ్ మల్లికార్జున్‌కు నాంపల్లి కోర్టు 30 ఏళ్ల జైలుశిక్ష విధించించింది. దాంతో పాటు బాధితురాలి కుటుంబానికి 40 వేల రూపాయలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కేసేంటంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తుకారాంగేట్ వద్ద మైనర్ బాలికపై హోంగార్డు మల్లికార్జున్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఫిబ్రవరి 19న హోంగార్డు మల్లికార్జున్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం బాలిక గర్భం దాల్చడంతో.. మెడికల్ రిపోర్ట్స్ నుంచి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వరకు.. అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు వాటిని కోర్టులో సమర్పించారు. వీటన్నింటిని పరిశీలించిన కోర్టు నిందితుడు మల్లికార్జున్‌కు 30 ఏళ్ల జైలుశిక్షతోపాటు.. బాధితురాలి కుటుంబానికి రూ.40 వేలు చెల్లించాలని ఆదేశించింది. -
నాంపల్లి హైకోర్టుకు హాజరైన విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అణిచివేయలని చూస్తున్నాడని నటి, బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. ఈ మేరకు గురువారం రాములమ్మ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై అక్రమ కేసులు పెట్టి, భయాందోళనకు గురి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నాడని మండిపడ్డారు. 2012 మహబూబ్ నగర్లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు అనుమతి లేదని తనకు నాలుగు రోజుల క్రితం నాంపల్లి కోర్టు నుంచి నోటీసులు వచ్చాయన్నారు. ఆ సభను నిర్వహించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని, కేసు పెడితే పార్టీ అధ్యక్షుడుగా ఉన్న ఆయన పైననే పెట్టాలని డిమాండ్ చేశారు. 2012లో జరిగిన ఘటనకు తొమ్మిదేళ్ల తరువాత కేసు పెట్టించడంలో ముఖ్యమంత్రి భయం అర్థం అవుతుందన్నారు. న్యాయ వ్యవస్థ పట్ల తనకు నమ్మకం ఉందని, ఆ దిశగా పోరాడుతానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎన్ని కేసులు పెట్టించినా తాను బయపడనని స్పష్టం చేశారు. చదవండి: ప్రముఖ సీనియర్ నటికి బ్లడ్ క్యాన్సర్.. -
మద్యం మత్తు.. నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం మత్తులో వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో చిక్కి కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న ‘నిషా’చరుడు సయ్యద్ అమీరుద్దీన్‌కి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేసి అరెస్టు చేయించింది. చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు ఆ నిందితుడిని శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు.. అమీరుద్దీన్‌కు 5 రోజుల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. ఓ మందుబాబుపై ఎన్బీడబ్ల్యూ జారీ కావడంతో ట్రాఫిక్ పోలీసుల చరిత్రలో తొలిసారని చార్మినార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 31 రాత్రిని జీరో యాక్సిడెంట్ నైట్‌గా చేయడానికి సిటీ ట్రాఫిక్ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. అంబర్‌పేటకు చెందిన ప్లంబర్ సయ్యద్ అమీరుద్దీన్ మద్యం తాగి యాక్టివా వాహనంపై వస్తూ చార్మినార్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. బ్రీత్ అనలైజర్ యంత్రంతో పరీక్షించిన నేపథ్యంలో బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) 141గా తేలింది. ఈ కౌంట్ 30 దాటితే వారిపై చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. దీంతో చార్మినార్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, వివరాలు నమోదు చేసుకుని, వాహనం స్వాధీనం చేసుకుని పంపారు. ఇలా చిక్కిన మందుబాబులు నిర్ణీత తేదీల్లో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. ఆపై కోర్టుకు వెళ్లి న్యాయమూర్తి విధించిన శిక్ష పూర్తి చేయడం లేదా జరిమానా కట్టడం చేసిన తర్వాత తమ వాహనం తీసుకువెళ్లాలి. అయితే అమీరుద్దీన్ మాత్రం కౌన్సెలింగ్‌కు, కోర్టుకు రాకుండా తప్పించుకుంటున్నాడు. దీంతో చార్మినార్ పోలీసులు అతడిపై న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. దీని ఆధారంగా కోర్టు అమీరుద్దీన్‌కు రెండుసార్లు సమన్లు జారీ చేసినా అతను బేఖాతరు చేశాడు. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన కోర్టు అతడిపై ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది. -
కాచిగూడ కార్పొరేటర్ చైతన్యకు ఊరట
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల చైతన్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు సంతానం కలిగి ఉన్నారంటూ ఆమెను అనర్హురాలుగా నాంపల్లి కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టు తీర్పుపై కార్పొరేటర్ చైతన్య హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బుధవారం నాంపల్లి కోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. కాగా ఎక్కాల చైతన్య ముగ్గురు సంతానం ఉన్నారని, ఆ విషయాన్ని దాచిపెట్టారంటూ బీజేపీ మాజీ కార్పొరేటర్ ఉమాదేవీ భర్త రమేష్‌యాదవ్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు విచారణలో కన్నాచైతన్య తనకు ముగ్గురు సంతానం ఉన్నారన్న విషయాన్ని దాచిపెట్టినట్టు తేలింది. దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ.. రెండోస్థానంలో ఉన్న ఉమాదేవీ రమేశ్‌యాదవ్‌ను కార్పొరేటర్‌గా కొనసాగించాలని కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దాన్ని సవాల్‌చేస్తూ కార్పొరేటర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. -
కాచిగూడ కార్పొరేటర్‌పై అనర్హత వేటు
సాక్షి, హైదరాబాద్ : అధికారంలో కొనసాగాలని నిజాన్ని దాచిపెట్టిన టీఆర్ఎస్కు చెందిన ఓ కార్పొరేటర్‌పై వేటుపడింది. కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల కన్నాచైతన్య ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు సంతానం కలిగి ఉన్నారని బీజేపీ మాజీ కార్పొరేటర్ ఉమాదేవీ భర్త రమేష్‌యాదవ్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు విచారణలో కన్నాచైతన్య తనకు ముగ్గురు సంతానం ఉన్నారన్న విషయాన్ని దాచిపెట్టినట్టు తేలింది. దీంతో ఆమెపై అనర్హత వేటువేస్తూ నాంపల్లి కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. రెండోస్థానంలో ఉన్న ఉమాదేవీ రమేశ్‌యాదవ్‌ను కార్పొరేటర్‌గా కొనసాగించాలని కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో ఉమా రమేశ్ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరిన రమేశ్‌యాదవ్.. ఎన్నికల అనంతరం ఆయన తిరిగి బీజేపీలో చేరడం గమనార్హం. -
జయరాం హత్య కేసు; కస్టడీకి రాకేష్, శ్రీనివాస్
-
మానవత్వాన్ని చాటుకున్న న్యాయమూర్తి
► గుండెనొప్పితో కిందపడిన నిందితుడు ► జైలుకు కాకుండా ఆస్పత్రికి తరలించాలని ఆదేశం హైదరాబాద్: కోర్టులో ముద్దాయిలకు శిక్ష వేసే న్యాయమూర్తులకు గుండె కటువుగా ఉంటుందంటారు. వారు న్యాయన్యాయల గురించి మాత్రమే ఆలోచిస్తారని చాలా మంది నమ్మకం. కానీ వారిలో కూడా సున్నిత మనస్తత్వం ఉంటుంది. ఎదుటి వారికి ఏదైనా జరిగితే చలించే గుణం ఉంటుంది. సరిగ్గా అలాంటి సంఘటన హైదరాబాద్నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో జరిగింది. కేసు విచారణలో ఉన్న సమయంలో గుండెనొప్పితో కిందపడిపోయిన ఓ నిందితుడిని ఆస్పత్రికి తరలించాలని ఆదేశించి ప్రాణాలు నిలిపారు. వివరాల్లోకి వెళ్తే నాంపల్లి ప్రాంతానికి చెందిన మహ్మద్ అష్రఫ్(70)కు మోజంజాహీ మార్కెట్లో షాలిమార్ వీడియో క్యాసెట్ దుకాణం ఉంది. ఈ దుకాణంలో వాటాల కోసం అతని తమ్ముడి భార్య షమీనా భాను ఈ ఏడాది ఫిబ్రవరి 24న బేగంబజార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అష్రఫ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి శుక్రవారం 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బి. శ్రీనివాస్‌రావు ఎదుట హాజరుపరిచారు. దీంతో అతడిని రిమాండ్‌కు తరలించాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో అకస్మాత్తుగా నిందితుడు గుండెపోటుకు గురై కిందపడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించాలని మేజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితుడిని కేర్ ఆసుపత్రికి తరలించారు. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలు పోయేవని వైద్యులు చెప్పారు. సకాలంలో స్పందించిన న్యాయమూర్తికి అష్రఫ్ కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మానవతా దృక్పథంతో స్పందించిన న్యాయమూర్తి సమయస్ఫూర్తికి అక్కడున్న వారంతా చలించిపోయారు.