వెళ్తున్నా..వెళ్తున్నా..
చెమర్చిన కళ్లతో రాజీనామా లేఖపై సంతకం
ఏకవాక్యంతో రాజీనామా లేఖ అధినేతకు ఫ్యాక్స్
అవమానాలు, తన ప్రత్యర్థులకు ప్రాధాన్యమే కారణం
టీఆర్ఎస్లో చేరడం లాంఛనప్రాయమే
ఆయనతో పాటే అగ్రనేతలు, అనుచరులు
జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా..
32 ఏళ్ల అనుబంధానికి చరమగీతం
మారనున్న జిల్లా రాజకీయ ముఖచిత్రం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం...మొదటి ఎన్నికల్లోనే ఓటమి..ఆ తర్వాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం...వెంటనే మంత్రిపదవి...మరో రెండు సార్లూ అమాత్యయోగం..మళ్లీ ఓటమి..ఆ తర్వాత విజయం..ఆపై ఓటమి...పార్టీ, తాను అధికారంలో ఉన్నప్పుడు ఆయనదే జిల్లాలో ఏకఛత్రాధిపత్యం...ఎన్నో ఉత్థానపతనాలు...అయినా మూడు దశాబ్దాలుగా ఒకటే పార్టీ... పార్టీ ఆవిర్భావం నుంచి వైదొలగేంతవరకు క్రియాశీలకమే..ఓటమి ఎదురైనా ప్రజల్లోనే జీవితం...ఇదంతా తుమ్మల నాగేశ్వరరావు 32 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం...జిల్లా రాజకీయ క్షేత్రంలో చెరిగిపోని ముద్ర వేసుకున్న ఆయన దశాబ్దాల పాటు పార్టీని ఒంటి చేత్తో నడిపించారు...టీడీపీ అంటే తుమ్మల... తుమ్మల అంటే టీడీపీ అనేస్థాయిలో వెలుగొందారు...కానీ, తాను నమ్ముకున్న పార్టీలోనే తనకు అవమానాలు...తన మాటకు విలువ లేకుండా పోయిన వైనం..ప్రత్యర్థికి పెద్దపీట వేయడం...పార్టీ అధినాయకుడి చిన్నచూపు...అన్నీ కలగలిపితే జిల్లా రాజకీయ చరిత్రలో అనూహ్య అంకానికి తెరలేచింది. ఎప్పుడూ ఎవరూ ఊహించని విధంగా తుమ్మల నాగేశ్వరరావు టీడీపీని విడిచిపెట్టేశారు. పార్టీతో తనకున్న మూడు దశాబ్దాల అనుబంధాన్ని చెమర్చిన కళ్లతో రాజీనామా లేఖపై చేసిన సంతకంతో తెంచేసుకున్నారు. ఉత్కంఠకు తెర పడింది..జిల్లాలో కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం వాస్తవరూపం దాల్చింది. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.
గత కొంతకాలంగా ఆయన పార్టీని వీడివెళుతున్నారన్న ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఎక్కడా మాట్లాడని తుమ్మల శనివారం తన రాజీనామా లేఖనే అస్త్రంగా ప్రయోగించారు. ‘నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను..దయచేసి ఆమోదించగలరు.’ అని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాసిన ఏకవాక్య రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపి పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. వచ్చే నెల ఐదో తేదీన తెలంగాణ భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో తుమ్మల గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆయనకు త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ స్థానం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే, జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఉద్వేగానికి గురైన తుమ్మల
రాజీనామా సందర్భంగా తుమ్మల భావోద్వేగానికి గురయ్యారు. రాజీనామా లేఖపై ఆయన సంతకం పెడుతున్న సందర్భంలో కళ్లు చెమర్చాయి. దుఃఖాన్ని ఆపుకుంటూ ఆయన సంతకం చేశారు. మూడు దశాబ్దాల అనుబంధం ఉన్న పార్టీని వీడివెళ్లిపోతున్న సమయంలో ఆయన గుంభనంగా కనిపించారు. ఉద్వేగం ఆయన ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. రాజీనామా అనంతరం తన స్వగ్రామం దమ్మపేట మండలం గండుగులపల్లికి పయనమయ్యారు.
తన రాజీనామా లేఖపై మాజీ శాసనసభ్యులు అని మాత్రమే రాశారు. మంత్రిగా పనిచేసినప్పటికీ మాజీ ఎమ్మెల్యే హోదాలో రాజీనామా చేయడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. అయితే, తనకు తొలుత ఎన్టీఆరే మంత్రిపదవి ఇచ్చినా తనకు మంత్రిగా గుర్తింపు వచ్చింది చంద్రబాబు కేబినెట్లోనేనని, బాబు ఇచ్చిన మంత్రి పదవి పెట్టుకున్న దానికన్నా ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే హోదాలోనే రాజీనామా చేయాలని తుమ్మల భావించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
తుమ్మలతోనే తమ్ముళ్లు
తుమ్మలకు ఆది నుంచి అండగా ఉన్న పార్టీ జిల్లా అగ్రనేతలంతా ఆయనతో నడవాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలో తుమ్మల వర్గం నాయకులుగా గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తొలుత తుమ్మలతోనే ఉండి ఆ తర్వాత నామా శిబిరానికి వెళ్లిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరావు, ఇటీవలే జడ్పీ చైర్‌పర్సన్‌గా గెలిచిన గడిపల్లి కవిత, అవసరమైతే పదవిని వదిలేస్తాను కానీ పార్టీని వీడనని చెప్పిన డీసీసీబీ అధ్యక్షుడు మువ్వా విజయ్‌బాబు, డీసీఎంఎస్ చైర్మన్ ఎగ్గిడి అంజయ్య, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావులు తుమ్మలతోనే ఉన్నారు. వీరంతా ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. తుమ్మల వర్గంలో ముఖ్య నాయకుడిగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాత్రం ఆయనతో కలిసిరావడం లేదు.
కార్యకర్తలతో సమావేశాలు
కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని చెప్పిన తుమ్మల తన వర్గానికి చెందిన నాయకులతో సమావేశం ఏర్పాటు చేయిస్తున్నారు. ముందుగా సత్తుపల్లిలోని లక్ష్మీప్రసన్న ఫంక్షన్హాల్లో ఆదివారం మధ్యాహ్నం ఐదు నియోజకవర్గాల సమావేశం నిర్వహిస్తున్నారు. అశ్వారావుపేట, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, పినపాకలకు చెందిన నేతలు, కార్యకర్తలు హాజరయ్యే ఈ సమావేశంలో తాను పార్టీని వీడేందుకు గల కారణాలను తెలపడంతోపాటు టీఆర్ఎస్లో చేరాల్సిన ఆవశ్యకతను ఆయన వివరిస్తారు. టీఆర్ఎస్లో చేరే అంశంపై అందరి అభిప్రాయాలను కూడా తీసుకుంటారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. కాగా, మరో ఐదు నియోజకవర్గాల సమావేశాన్ని త్వరలోనే ఖమ్మంలో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సమావేశాల అనంతరం ఐదో తేదీన టీఆర్ఎస్లో చేరేందుకు భారీ ఏర్పాట్లు చేయాలని తుమ్మల శిబిరం భావిస్తోంది.
టీడీపీకి కోలుకోలేని దెబ్బ
తుమ్మల నిష్ర్కమణ జిల్లా తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బ తీయనుందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఆయనకు బలమైన అనుచర గణం ఉంది. వారంతా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. తుమ్మలతో పాటు జిల్లా కేంద్రం ఖమ్మం నుంచి తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు బీరెడ్డి నాగచంద్రారెడ్డి, రైతు అధ్యక్షుడు మందడపు సుధాకర్, తెలుగు విద్యార్థి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతనిప్పు కృష్ణచైతన్య, సీనియర్ నేతలు మదార్‌సాహెబ్, కాసర్ల వీరభ ద్రం, గాజుల ఉమామహేశ్వరరావు, అజ్మీరా వీరూనాయక్, మాలోతు శాంతి, మద్దినేని వెంకటరమణ, కొత్తగూడెం నుంచి జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ బరపాటి వాసు, బిక్కసాని నాగేశ్వరరావు, ఇల్లెందు నుంచి బోడేపూడి రమేశ్‌బాబు, కనగాల పేరయ్య, గౌరిశెట్టి సత్యనారాయణ, నలమాస రాజన్న, వైరా నియోజకవర్గం నుంచి ఆకుల ప్రసాద్, కృష్ణార్జునరావు, వీరేందర్, దావ్లానాయక్, మాధవి, చిట్టిబాబు, పోట్ల శ్రీను, పినపాక నుంచి కోలేటి భవానీ శంకర్, ఎండీ.అతహర్, పాలేరు నియోజకవర్గం నుంచి మద్ది మల్లారెడ్డి, ధరావత్ రామ్మూర్తి, వీరవెళ్లి నాగేశ్వరరావు, రామచంద్రునాయక్, వెన్నపూసల సీతారాములు, ఆలదాసు ఆంజనేయులు, మధిర నియోజకవర్గం నుంచి పార్టీ నేతలు పంబి సాంబశివరావు, పొనుగోటి రత్నాకర్, సామినేని రమేశ్, చావా రామకృష్ణ, చీదిరాల వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట నుంచి బండి పుల్లారావు, పైడి వెంకటేశ్వరరావు, ఆలపాటి రామచంద్రప్రసాద్, పానుగంటి సత్యం, బోయినపల్లి సుధాకర్, భద్రాచలం నుంచి యశోద రాంబాబు, తోటకూర రవిశంకర్, సత్తుపల్లి నుంచి గాదె సత్యం, చల్లగుళ్ల నర్సింహారావు, తాళ్లూరి ప్రసాద్, బండి గుర్నాథరెడ్డి, పల్లా నర్సారెడ్డి, అత్తునూరి రంగారెడ్డి, చీకటి రామారావు తదితరులు పార్టీని వీడి వెళ్లిపోతారనే చర్చ జరుగుతోంది. వీరితో పాటు పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ మండల, గ్రామ స్థాయి నాయకులు కూడా తుమ్మల బాటలోనే పయనిస్తామని చెపుతున్నారు.
తుమ్మల ప్రస్థానం ఇదీ....
జిల్లా రాజకీయాల్లో తుమ్మలది విశిష్ట స్థానమనే చెప్పాలి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీని ఒంటిచేత్తో మూడు దశాబ్దాల పాటు ఆయన నడిపించారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. తన అనుచరులను ఎందరినో నాయకులుగా తీర్చిదిద్దారు. 1982 సెప్టెంబర్‌లో చర్ల మండలం ఏటుపాక గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది సత్తుపల్లి నియోజకవర్గం. పూర్వ సత్తుపల్లి నియోజకవర్గంలోని దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామానికి చెందిన ఆయన తన రాజకీయాలను అక్కడి నుంచే ప్రారంభించారు. తెలుగుదేశం స్థాపించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఓటమి చవిచూశారు. మళ్లీ ఏడాదిన్నరకే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పుడే ఆయనకు ఎన్టీఆర్ కే బినెట్ ర్యాంకు ఇచ్చారు.
చిన్నతరహా నీటిపారుదల శాఖామంత్రిగా ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తర్వాత 1994, 1999 ఎన్నికల్లో గెలిచిన తుమ్మల చంద్రబాబు కేబినెట్లో కీలకమైన ఎక్సైజ్, భారీనీటిపారుదల, ఆర్అండ్బీ శాఖలు నిర్వహించారు. మంత్రిగా ఉన్న కాలంలో జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్న పేరు సంపాదించుకున్నారు. 2004 ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. మళ్లీ తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా ఖమ్మం నుంచే పోటీచేసి ఓడిపోయారు.