Napier ODI
-
నేపియర్ వన్డేలో ధోని సేన ఓటమి
-
నేపియర్ వన్డేలో ధోని సేన ఓటమి
నేపియర్: న్యూజిలాండ్ పర్యటనలో ధోని సేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారమిక్కడ జరిగిన తొలి వన్డేలో భారత్ 24 పరుగుల తేడాతో ఓటమిపాలయింది. కివీస్ నిర్దేశించిన 293 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటయింది. కోహ్లి, ధోని మినహా మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో భారత్‌కు పరాజయం ఎదురైంది. కోహ్లి ఒక్కడే అద్భుతంగా ఆడి సెంచరీ(123) సాధించాడు. కెప్టెన్ ధోని 40 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. శిఖర్ ధావన్ 32, రైనా 18, అశ్విన్ 12, రహానే 7, ఇషాంత్ శర్మ 5, రోహిత్ శర్మ 3, భువనేశ్వర్ కుమార్ 3 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మెక్ క్లినగన్ 4, ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. సౌతి, మిల్నీ, విలియమ్సన్ తలో వికెట్ తీశారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్ లో కివీస్ 1-0 ఆధిక్యం దక్కించుకుంది. -
వన్డేల్లో విరాట్ కోహ్లి 18వ సెంచరీ
నేపియర్: విరాట్ కోహ్లి వీర విహారం ఇప్పట్లో ఆగేట్టు కనబడడం లేదు. సెంచరీలు మీద సెంచరీలు కొడుతూ దూసుకుపోతున్నాడీ భారత బ్యాట్స్‌మన్. శతకం సాధించడం ఇంత సులవా అన్నట్టుగా చెలరేగిపోతున్నాడు. సెంచరీ కొట్టడం తనకు అలవాటు అన్నట్టుగా బాదేస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో నేపియర్‌లో జరుగుతున్న తొలి వన్డేలో సెంచరీ కొట్టాడు. 93 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో శతకం పూర్తిచేశాడు. 111 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 123 పరుగులు చేసి అవుటయ్యాడు. వన్డేల్లో కోహ్లికిది 18వ సెంచరీ కావడం విశేషం. 126 వన్డేల్లోనే అతడీ ఘనత సాధించడం మరో విశేషం. కోహ్లి ఇదే దూకుడు కొనసాగిస్తే బ్యాటింగ్‌లో అతడు రికార్డులు సృష్టించడం ఖాయమని క్రికెట్ అభిమానులు అంటున్నారు. -
23 బంతుల్లో 3 పరుగులు
నేపియర్: భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. న్యూజిలాండ్ ఆదివారమిక్కడ జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం 3 పరుగులు చేసి అవుటయ్యాడు. నెమ్మెదిగా బ్యాటింగ్ చేసిన అతడు మైదానంలో ఇబ్బందిగా కదిలాడు. కివీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు కష్టపడ్డాడు. అత్యధిక సిక్స్‌ల రికార్డును తన పేర లిఖించుకున్న ఈ 'సిక్స్'ర పిడుగు 24 నిమిషాల పాటు క్రీజ్‌లో ఉండి 23 బంతులను ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేశాడు. చివరకు ఐదో ఓవర్ రెండో బంతికి మెక్ క్లినగన్ బౌలింగ్‌లో సౌతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అప్పటికి భారత్ స్కోరు 15 కాగా అందులో 11 పరుగులు శిఖర్ ధావన్ చేసినవే కావడం విశేషం. గతేడాది బ్యాటింగ్‌లో సత్తా చాటిన రోహిత్ కొద్ది రోజులుగా వరుస విఫలమవుతుండడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.