నేపియర్ వన్డేలో ధోని సేన ఓటమి
నేపియర్: న్యూజిలాండ్ పర్యటనలో ధోని సేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారమిక్కడ జరిగిన తొలి వన్డేలో భారత్ 24 పరుగుల తేడాతో ఓటమిపాలయింది. కివీస్ నిర్దేశించిన 293 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటయింది. కోహ్లి, ధోని మినహా మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో భారత్కు పరాజయం ఎదురైంది.
కోహ్లి ఒక్కడే అద్భుతంగా ఆడి సెంచరీ(123) సాధించాడు. కెప్టెన్ ధోని 40 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. శిఖర్ ధావన్ 32, రైనా 18, అశ్విన్ 12, రహానే 7, ఇషాంత్ శర్మ 5, రోహిత్ శర్మ 3, భువనేశ్వర్ కుమార్ 3 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మెక్ క్లినగన్ 4, ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. సౌతి, మిల్నీ, విలియమ్సన్ తలో వికెట్ తీశారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్ లో కివీస్ 1-0 ఆధిక్యం దక్కించుకుంది.