క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటిన ఆటగాడు ఇషాంత్ శర్మ.. అనతికాలంలోనే ఫియరీ ఫాస్ట్ బౌలర్‌గా పేరొందిన ఇషాంత్.. నిలకడగా తన ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. దీంతో వన్డేలు, టీ20లలో జట్టులో స్థానం కోల్పోయి.. టెస్టులకు మాత్రమే స్పెషలిస్ట్ బౌలర్‌గా ముద్రపడ్డాడు. గత కొన్నాళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కూడా అతనికి పెద్దగా కలిసిరాలేదు. ఖరీదైన ఆటగాడు కావడం.. గత కొన్ని సీజన్లలో రాణించకపోవడంతో ఈసారి ఐపీఎల్ వేలంలో ఇషాంత్ అమ్ముడుపోలేదు. ఈ చేదు అనుభవాల నడుమ అతనికి ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో ఆడే అవకాశం వరించింది. ఈ అవకాశాన్ని అతను బాగానే సద్వినియోగం చేసుకుంటున్నాడు.
స్పేస్‌సేవర్స్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో సస్సెక్స్‌జట్టు తరఫున బరిలోకి దిగిన ఇషాంత్ తొలి మ్యాచ్‌లో చక్కగా రాణించి.. ప్రేక్షకుల మన్ననలు పొందాడు. సస్సెక్స్, వార్‌విక్‌షైర్ జట్ల మధ్య నాలుగురోజులపాటు జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొత్తంగా మ్యాచ్‌లో 29.2 ఓవర్లు వేసిన ఇషాంత్ 69 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అతని అద్భుతమైన బౌలింగ్‌తో ససెక్స్ జట్టు మ్యాచ్‌లో బాగా రాణించి.. మ్యాచ్‌లో పైచేయి సాధించగలిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో వార్‌విక్‌షైర్ జట్టుకు చెందిన విల్ఫ్రెడ్ రోడ్స్, ఆడమ్ హోస్, వికెట్-కీపర్ బ్యాట్స్‌మన్ టిమ్ ఆంబ్రోస్ తదితర మూడు కీలక వికెట్లను ఇషాంత్ పడగొట్టాడు. వార్‌విక్‌షైర్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించే సమయానికి మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశం లేకపోయింది.
డ్రా ఖాయం అనుకున్న దశలోనూ ఇషాంత్ చెలరేగి రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. జోనాథన్ ట్రాట్, ఇయాన్ బెల్ వికెట్లు పడగొట్టి తన జట్టు శిబిరంలో ఆనందం నింపాడు. అయితే, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ డొమినిక్ సిబ్లీ, ఆడమ్ హోస్ మరిన్ని వికెట్లు పడకుండా జాగ్రత్తపడి.. డ్రా చేసుకోగలిగారు. ఈ నెల 20 నుంచి ససెక్స్ జట్టు తన తదుపరి మ్యాచ్‌ను లీసెస్టర్‌షైర్ జట్టుతో ఆడనుంది. త్వరలో భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో కౌంటీలో రాణించడం ఇషాంత్‌కు కలిసి వచ్చే విషయం. కౌంటీ అనుభవంతో ఇంగ్లండ్‌తో జరిగే నాలుగు టెస్టుల్లో అతను రాణిస్తాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో కౌంటీలో సర్రే జట్టు తరఫున ఆడబోతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment