సారీ..‘నో రూమ్’
=ఖాళీ లేని రైళ్లు ముంచుకొస్తున్న సెలవులు
=సంక్రాంతి ప్రయాణంపై ప్రయాణికుల బెంబేలు
=చలనం లేని రైల్వే
సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి పండుగ ప్రయాణం ఇప్పటి నుంచే ఉస్సూరుమనిపిస్తోంది. జనవరి 9 నాటికే రైళ్లలో ‘నో రూమ్’ వెక్కిరిస్తోంది. గోదావరి, విశాఖ, గరీబ్థ్,్ర ఫలక్నుమా, గౌతమి, మచిలీపట్నం, నర్సాపూర్, సింహపురి, నారాయణాద్రి, వెంకటాద్రి, పద్మావతి, రాయలసీమ వంటి ప్రధాన రైళ్లలో జనవరి 1 నుంచి 8 వరకు వెయిటింగ్ లిస్టు 200-250, కొన్నింటిలో 270కి చేరుకుంది. దీంతో ప్రయాణికులు సొంతూళ్లకు ఎలా వెళ్లాలనే దానిపై ఆందోళన చెందుతున్నారు.
యథా ప్రకారం దక్షిణమధ్య రైల్వేలో చలనం లేదు. ఇప్పటి వరకు సంక్రాంతి ప్రత్యేక రైళ్లు ప్రకటించకపోవడం ప్రయాణికుల్ని మరింత బెంబేలెత్తిస్తోంది. ఇప్పటి నుంచే పండుగ ప్రయాణానికి ప్రణాళికలు రూపొందించుకొంటున్న వారిని రెగ్యులర్ రైళ్లలోని రద్దీ వెక్కిరిస్తోంది. ప్రత్యేక రైళ్లు వేస్తే తప్ప ఊరికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉద్యమాలు, సమ్మెలు వంటి ప్రతికూల పరిస్థితులు లేవు. దీంతో పండుగ రద్దీ సాధారణంగా కంటే రెట్టింపు ఉండే అవకాశం ఉంది. పైగా పాలెంలో జరిగిన బస్సు దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణానికి చాలామంది వెనుకాడుతున్నారు. దీంతో రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక రైళ్లు వేయవలసిన దక్షిణమధ్య రైల్వే ఇప్పటి వరకు ఆ దిశగా చర్య లు తీసుకున్నది లేదు. విశాఖ, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ చాంతాడంత వెయిటింగ్ లిస్టుతో దర్శనమిస్తున్నాయి. చాలా రైళ్లలో ‘నో రూమ్’ బోర్డు వేలాడుతోంది.
ఏటేటా తగ్గుతున్న ప్రత్యేక రైళ్లు
ఏటా సంక్రాంతికి రద్దీ పెరుగుతుండగా, రైళ్ల సంఖ్య తగ్గుతోంది. సాధారణ రోజుల్లో జంట నగరాల నుంచి సుమారు 2 లక్షల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. ఒక్క సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచే లక్షన్న ర మంది ప్రయాణిస్తారు. పండుగ రోజు ల్లో ఈ సంఖ్య రెట్టింపవుతుంది. సెలవు రోజు ల్లో లక్ష నుంచి 2 లక్షల మంది అదనంగా ప్రయాణిస్తారు. 2010లో సంక్రాంతికి 52 ప్రత్యేక రైళ్లు నడిపారు.
2011లో ఇవి 40కి, 2012లో 31కి తగ్గాయి. ఈ ఏడాది అసలు ప్రత్యేక రైళ్లు ఉంటాయా? అనే దానిపై సంది గ్ధత నెల కొంది. ప్రత్యేక రైళ్ల ప్రకటనను బట్టే నగరవాసులు కుటుంబాలతో కలిసి ఊరెళ్లేం దుకు ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారు. పం డుగ సమీపించాక ప్రకటించినా అటు రైల్వేకు, ఇటు ప్రయాణికులకు ప్రయోజనం ఉండదు. మరోవైపు ఆదరాబాదరా ప్రత్యేక రైళ్లు వేయడం వల్ల ఎక్కువ శాతం సీట్లు దళారులే కొల్లగొట్టుకుపోయే అవకాశం ఉంది. ఇటీవల శబరి రైళ్లలో అయ్యప్ప భక్తులకు అదే అనుభవం ఎదురైంది. శబరిమలై వెళ్లేందుకు 138 ప్రత్యేక రైళ్లను ప్రకటించినప్పటికీ దళారుల చేతివాటంతో క్షణాల్లో బుకింగ్ ముగిసింది.