మాజీ ఎమ్మెల్సీ నారాయణప్ప మృతి
కంబదూరు (కళ్యాణదుర్గం) : దివంగత మాజీ మంత్రి లక్ష్మీదేవమ్మ భర్త, మాజీ ఎమ్మెల్సీ కె.బి.నారాయణప్ప (81) మృతి చెందారు. ఈయన కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని జాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు. 2010 నుంచి 2011 వరకు ఏడాదిన్నరపాటు నారాయణప్ప ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈయనకు కుమారులు శ్రీధర్, శివాజీతోపాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
రాజకీయ నేపథ్యం..
నారాయణప్ప కుటుంబానికి మొదటి నుంచి రాజకీయ నేపథ్యం ఉంది. నారాయణప్ప తండ్రి కె.బి.శాంతప్ప కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మృతితో మామ వారసురాలిగా నారాయణప్ప భార్య లక్ష్మీదేవమ్మ రాజకీయ రంగప్రవేశం చేసి 1972 –78, 1989–94 రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా పనిచేశారు. 1982–2007లో ఎమ్మెల్సీగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్గా పనిచేశారు. ఆమె 2010లో మృతి చెందడంతో.. ఆమె స్థానంలో నారాయణప్ప ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు
నారాయణప్ప స్వగ్రామైన కంబదూరులో శనివారం ఉదయం అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పార్థివదేహానికి రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు నివాళులర్పించారు.