బాలుడిపై థర్డ్‌డిగ్రీ!
యాకుత్‌పురా: దాడి కేసులో అరెస్టైన ఓ బాలుడిపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు రావడంతో పాతబస్తీలో కలకలం రేగింది. థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన భవానీనగర్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎంబీటీ నాయకులతో పాటు బాలల హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. అయితే అలాంటిదేమీ జరగలేదని పోలీసులు అంటున్నారు. భవానీనగర్ ఎస్సై నార్ల శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా చాచా గ్యారేజీకి చెందిన మహ్మద్ చాంద్ (24), అబ్దుల్ బిన్ మెహఫేజ్ (15) అన్నదమ్ములు.
సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు రెయిన్బజార్కి చెందిన మహ్మద్ ముజఫర్ (24)పై మహ్మద్ చాంద్, మెహఫేజ్ (15) కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ముజఫర్ వెంటనే భవానీనగర్ పోలీసులను ఆశ్రయించాడు. అతనిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. దాడికి పాల్పడిన వారిలో ఒకడైన మెహఫేజ్ను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా బెయిల్‌పై విడుదలయ్యాడు. మహ్మద్ చాంద్ పరారీలో ఉన్నాడు.
కాగా, తలాబ్కట్టాకి చెందిన బాలుడు అబ్దుల్ బిన్ మెహఫేజ్ (15)పై భవానీనగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చితకబాదారని ఆజంపురా కార్పొరేటర్, ఎంబీటీ నాయకుడు అంజదుల్లాఖాన్ ఆరోపించారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారన్నారు.
బాలల హక్కుల సంఘం ఖండన
మెహఫేజ్పై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించడాన్ని బాలల హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. అక్కడి స్టేషన్ హౌజ్ఆఫీసర్ను వెంటనే తొలగించి విచారణ జరిపించాలని సంఘం అధ్యక్షురాలు అనురాధ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.