‘రంగాపూర్’ కేసు హైకోర్టులో పెండింగ్
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా రంగాపూర్ భూముల కేసు హైకోర్టు లో పెండింగ్‌లో ఉందని, సుప్రీంకోర్టు, సివిల్ కోర్టు కూడా తమకు అనుకూలంగానే ఉత్తర్వులు ఇచ్చాయని, ఈ భూముల విషయంలో తాము ఎలాంటి తప్పులకు పాల్పడలేదని రిటైర్డ్ మిలటరీ అధికారి కల్నల్ నార్నె రంగారావు వివరణ ఇచ్చారు. ‘భూదాన్ దొంగలు దొరికేనా’ శీర్షికన ఈ నెల 25న ‘సాక్షి’ప్రచురించిన కథనంలో తన ప్రస్తావన తీసుకురావడంపై ఆయన స్పందించారు.
నార్నె ఎస్టేట్స్, ఈస్ట్‌సిటీ భూములపై కొందరు 1996లో కావాలనే కోర్టులో కేసు వేశారని, అయితే, ప్లాట్ల యజమానులను ఖాళీ చేయించవద్దని కోర్టు తీర్పు చెప్పిందని, అయినా కలెక్టర్‌పై పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి రాత్రికి రాత్రే భూములు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లగా భూములను ఈస్ట్సిటీకి అప్పగించిందని, భూదాన్ బోర్డును రిసీవర్‌గా నియమించిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత సుప్రీం కోర్టు, సివిల్‌కోర్టులూ ఈ కేసులో తమకనుకూలంగా తీర్పులిచ్చాయని, దీన్ని కూడా కొందరు హైకోర్టులో సవాల్ చేయగా, ఆ కేసు పెండింగ్‌లో ఉందన్నారు.