పీడీఎస్ అక్రమాలపై టాస్క్ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో భాగంగా సరఫరా అవుతున్న రేషన్ సరుకులు, సంక్షేమ వసతి గృహాలకు అందించే సన్నబియ్యం సరఫరాలో అక్రమాల నివారణకు రిటైర్డ్ పోలీసు అధికారులతో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టు పౌర సరఫరాల శాఖా మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. సరుకుల పంపిణీ, సరఫరాపై నిత్య పర్యవేక్షణ ద్వారా అక్రమాలను నివారించేలా ఈ టాస్క్ఫోర్స్కు బాధ్యతలు కట్టబెడతామన్నారు. రేషన్లో అక్రమాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, దీనికి బాధ్యులైన వారిపై పీడీ యాక్టు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
వరుసగా కేసులు నమోదైతే డీలర్లు, మిల్లర్లు, కాంట్రాక్టర్లపై జీవితకాల వేటు వేసేలా చట్టాలు తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందన్నారు. మంత్రి ఈటల బుధవారం హైదరాబాద్లోని పలు మండల్ లెవల్ స్టాక్ పాయింట్లలో సరుకుల నిర్వహణ, నిల్వలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిల్వల విషయంలో అధికారులు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. అనంతరం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
పౌర సరఫరాల శాఖలో అక్రమార్కులున్నారని అన్నారు. ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. స్టేజ్-1, స్టేజ్-2 గోదాముల్లో అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ల టెండర్లు రద్దుచేసి కొత్త టెండర్లు పిలిచే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. అక్రమాలను నివారించేందుకు ప్రజలు ముందుకు రావాలని, ఒక్కగ్రాము బియ్యం, చక్కెర తక్కువిచ్చినా శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
టీడీపీది ఎప్పుడూ శిఖండి పాత్రే..
సంక్షేమ హస్టళ్లకు సరఫరా చేస్తున్న సన్నబియ్యంలో అక్రమాలు జరుగుతున్నాయని, దొడ్డుబియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి సరఫరా చేస్తున్నారని విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలపై మంత్రి మండిపడ్డారు. వారివి మతిలేని మాటలన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీడీపీ శిఖండి పాత్ర పోషించిందని, అభివృద్ధిలోనూ అదేపాత్ర పోషిస్తోందని ఎద్దేవా చేశారు.