Nathavaram
-
రూ.10 కోట్లతో 100 ఆలయాలు
నాతవరం: ఎంతో చరిత్ర కలిగిన ఈరుడుకొండపై శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం నిర్మాణం చేయడం ఆనందాయకమని ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అన్నారు. నాతవరం సమీపంలో ఉన్న ఈరుడికొండపై రూ.3కోట్లతో శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం నిర్మించేందుకు శుక్రవారం కశింకోట శ్రీమారుతీరామానుజచార్యులు అధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రబ్యాంకు చైర్మన్ చింతకాయల అనిత సన్యాసిపాత్రుడు దంపతులు, డీసీసీబీ డైరెక్టరు అంకంరెడ్డి జమీలు పార్వతి దంపతులు, అన్ని వర్గాలకు చెందిన 27 దంపతులతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ నియోజకవర్గం నాలుగు మండలాల్లో రూ.10కోట్లతో సుమారుగా 100 ఆలయాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. ఆలయానికి రూ.10 లక్షల వరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రతిపాదనలు పంపించిన ఆలయాలకు గ్రామాల్లో ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారని తెలిపారు. మరో సింహచలం కానున్న నాతవరం ఉమ్మడి జిల్లాలో ఉన్న శ్రీనృసింహస్వామి ఆలయం కారణంగా సింహాచలానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని డీసీసీబీ చైర్మన్ చింతకాయల అనిత సన్యాసిపాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లాలో నిర్మించనున్న శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంతో నాతవరం గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. ఆలయాల నిర్మాణంతో ప్రజల్లో భక్తిభావం పెరిగి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారన్నారు. నాతవరం గ్రామానికి సమీపంలో ఎత్తయిన ఈరుడి కొండపై 500 ఏళ్లు పైగా చెట్టు పొదలో ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి రాతి విగ్రహాలకు గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ ప్రాంతంలో పురాతన రాతి విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని పరిశీలించిన డీసీసీబీ డైరెక్టరు అంకంరెడ్డి జమీలు ఈ కొండపై ఆలయం నిర్మాణం చేయాలని గ్రామస్తులతో కలిసి నిర్ణయించారు. ఎత్తయిన కొండపై రూ.15లక్షలతో ఎకరం స్థలాన్ని చదును చేయించారు. కొండ చుట్టూ ఘాట్‌రోడ్డు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో రూ.3 కోట్లతోశ్రీలక్ష్మీనృసింహస్వామి ప్రధాన ఆలయంతో పాటు కొండచుట్టూ తొమ్మిది ఆలయాలు నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, జెడ్పీటీసీ అప్పలనర్స, వైస్ ఎంపీపీ సునీల్, ఎంపీడీవో నాగలక్ష్మి, నాతవరం సర్పంచ్ గొలగాని రాణి, ఎంపీటీసీ రేణుక తదితరులు పాల్గొన్నారు. -
అయ్యో.. ఎంత ఘోరం!
నాతవరం(విశాఖ జిల్లా): కారు నడపాలన్న సరదా వారి ప్రాణం తీసింది. డ్రైవింగ్ నేర్చుకునే ప్రయత్నంలో ఒకేసారి అన్నదమ్ములు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. కారు అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నవ్వుతూ తుళ్లుతూ ఉదయాన్నే వెళ్లిన ఇద్దరు కొడుకులూ విగత జీవులై రావడం తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. ఎస్సై జె.రమేష్ అందించిన వివరాలు.. విశాఖపట్నం జిల్లా నాతవరం గ్రామానికి చెందిన ఆశపు శ్రీనివాస్ (32), ఆశపు హనుమాన్‌సాయి (28) అన్నదమ్ములు. కారు నడపడం నేర్చుకునేందుకు అదే గ్రామానికి చెందిన తమ స్నేహితుడు అంకంరెడ్డి వంశీకుమార్తో గురువారం తెల్లవారుజామున వెళ్లారు. కారులో తాండవ జంక్షన్ వరకు వెళ్లి తిరిగి వస్తుండగా నాతవరం పంచాయతీ శివారు ఏకే అగ్రహారం సమీపంలో ఉన్న మలుపు వద్ద కారు అదుపు తప్పి పక్కనే ఉన్న జీడిచెట్టును బలంగా ఢీకొట్టింది. డ్రైవింగ్ నేర్చుకుంటున్న అన్నదమ్ములిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన వారి స్నేహితుడు వంశీని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. కారు ప్రమాదంలో మృతి చెందిన అన్నదమ్ముల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (పోలీసుల కస్టడీకి మధుప్రియ) తల్లడిల్లిన తల్లిదండ్రులు మృతుల తల్లిదండ్రులు మాణిక్యం, నాగలక్ష్మిలను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. వీరికి నలుగురు సంతానం. గతంలో పెళ్లి ఈడుకు వచ్చిన కూతురు, కొడుకు అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి ఇద్దరు కుమారులను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాస్ విశాఖలో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. చిన్న కుమారుడు హనుమాన్ సాయి ఇంటి వద్ద కిరణా షాపు చూసుకుంటూ తల్లిదండ్రులకు తోడుగా ఉంటున్నాడు. ఇంతలోనే అన్నదమ్ములను కారు రూపంలో మృత్యువు కబళించింది. పేగుబంధం దూరం కావడంతో వృద్ధ దంపతులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
ప్రేమించిన అమ్మాయి మాట్లాడలేదని..
నాతవరం(నర్సీపట్నం): ప్రేమించిన అమ్మాయి మాట్లాడలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ అశోక్‌కుమార్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా నాతవరం గ్రామానికి చెందిన గోల్లి వీరబాబు(18) ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పూర్తి చేశాడు. పది రోజులు కిందట వీరబాబు హైదరాబాద్ వెళ్లాడు. గ్రామంలో జరిగే కోటమ్మతల్లి పండగ కోసం ఈ నెల 19న హైదరాబాదు నుంచి ఇంటికి వచ్చాడు. ఈ నెల 20 వతేదీ సాయంత్రం సైకిల్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి అయినప్పటికీ ఇంటికి చేరలేదు. అతనికి ఫోన్ చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా సెల్ పనిచేయలేదు. గ్రామంలో పండగ కావడంతో స్నేహితులతో కలిసి ఎక్కడో ఉండి ఉంటాడని మొదట కుటుంబ సభ్యులు భావించారు. రాత్రి అంతా ఇంటి రాకపోవడంతో వారు ఆందోళన చెందారు. బుధవారం వీరబాబు తండ్రి రోజూ మాదిరిగానే గ్రామానికి దూరంగా ఉన్న తమ పశువులు పాక దగ్గరకు వెళ్లాడు. పాకలో తన కుమారుడు ఉరివేసుకుని వేలాడి ఉండడంతో తండ్రి నూకరాజు కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వీరబాబు వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను పరిశీలిస్తే ప్రేమించిన అమ్మాయి మాట్లాడకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా వెల్లడైందని పోలీసులు తెలిపారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భోరున విలపించారు. -
38కిలోల గంజాయి పట్టివేత
నాతవరం (విశాఖపట్నం) : అక్రమంగా సంచుల్లో తరలిస్తున్న 38 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన శనివారం విశాఖ జిల్లా నాతవరం మండల కేంద్రంలో జరిగింది. వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలు, అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు పురుషులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. వీరందరూ కలిసి నర్సీపట్నం నుంచి గంజాయిని తరలిస్తుండగా నాతవరం వద్ద పోలీసులు పట్టుకున్నారు. కాగా వీరిలో ఒక వ్యక్తి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తృతీయ శ్రేణి గంజాయి కావడంతో దీని విలువ రూ. 3లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.