నాతవరం(నర్సీపట్నం): ప్రేమించిన అమ్మాయి మాట్లాడలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ అశోక్‌కుమార్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా నాతవరం గ్రామానికి చెందిన గోల్లి వీరబాబు(18) ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పూర్తి చేశాడు. పది రోజులు కిందట వీరబాబు హైదరాబాద్ వెళ్లాడు. గ్రామంలో జరిగే కోటమ్మతల్లి పండగ కోసం ఈ నెల 19న హైదరాబాదు నుంచి ఇంటికి వచ్చాడు. ఈ నెల 20 వతేదీ సాయంత్రం సైకిల్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి అయినప్పటికీ ఇంటికి చేరలేదు.
అతనికి ఫోన్ చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా సెల్ పనిచేయలేదు. గ్రామంలో పండగ కావడంతో స్నేహితులతో కలిసి ఎక్కడో ఉండి ఉంటాడని మొదట కుటుంబ సభ్యులు భావించారు. రాత్రి అంతా ఇంటి రాకపోవడంతో వారు ఆందోళన చెందారు. బుధవారం వీరబాబు తండ్రి రోజూ మాదిరిగానే గ్రామానికి దూరంగా ఉన్న తమ పశువులు పాక దగ్గరకు వెళ్లాడు. పాకలో తన కుమారుడు ఉరివేసుకుని వేలాడి ఉండడంతో తండ్రి నూకరాజు కుప్పకూలిపోయాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వీరబాబు వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను పరిశీలిస్తే ప్రేమించిన అమ్మాయి మాట్లాడకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా వెల్లడైందని పోలీసులు తెలిపారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భోరున విలపించారు.
ప్రేమించిన అమ్మాయి మాట్లాడలేదని..
Published Thu, Jun 22 2017 11:08 AM | Last Updated on Wed, Aug 1 2018 2:35 PM
Advertisement
Advertisement