ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
నాతవరం: ఎంతో చరిత్ర కలిగిన ఈరుడుకొండపై శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం నిర్మాణం చేయడం ఆనందాయకమని ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అన్నారు. నాతవరం సమీపంలో ఉన్న ఈరుడికొండపై రూ.3కోట్లతో శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం నిర్మించేందుకు శుక్రవారం కశింకోట శ్రీమారుతీరామానుజచార్యులు అధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రబ్యాంకు చైర్మన్ చింతకాయల అనిత సన్యాసిపాత్రుడు దంపతులు, డీసీసీబీ డైరెక్టరు అంకంరెడ్డి జమీలు పార్వతి దంపతులు, అన్ని వర్గాలకు చెందిన 27 దంపతులతో శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ నియోజకవర్గం నాలుగు మండలాల్లో రూ.10కోట్లతో సుమారుగా 100 ఆలయాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. ఆలయానికి రూ.10 లక్షల వరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రతిపాదనలు పంపించిన ఆలయాలకు గ్రామాల్లో ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారని తెలిపారు.
మరో సింహచలం కానున్న నాతవరం
ఉమ్మడి జిల్లాలో ఉన్న శ్రీనృసింహస్వామి ఆలయం కారణంగా సింహాచలానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని డీసీసీబీ చైర్మన్ చింతకాయల అనిత సన్యాసిపాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లాలో నిర్మించనున్న శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంతో నాతవరం గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. ఆలయాల నిర్మాణంతో ప్రజల్లో భక్తిభావం పెరిగి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారన్నారు. నాతవరం గ్రామానికి సమీపంలో ఎత్తయిన ఈరుడి కొండపై 500 ఏళ్లు పైగా చెట్టు పొదలో ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి రాతి విగ్రహాలకు గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ ప్రాంతంలో పురాతన రాతి విగ్రహాలు బయటపడ్డాయి.
వాటిని పరిశీలించిన డీసీసీబీ డైరెక్టరు అంకంరెడ్డి జమీలు ఈ కొండపై ఆలయం నిర్మాణం చేయాలని గ్రామస్తులతో కలిసి నిర్ణయించారు. ఎత్తయిన కొండపై రూ.15లక్షలతో ఎకరం స్థలాన్ని చదును చేయించారు. కొండ చుట్టూ ఘాట్‌రోడ్డు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో రూ.3 కోట్లతోశ్రీలక్ష్మీనృసింహస్వామి ప్రధాన ఆలయంతో పాటు కొండచుట్టూ తొమ్మిది ఆలయాలు నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, జెడ్పీటీసీ అప్పలనర్స, వైస్ ఎంపీపీ సునీల్, ఎంపీడీవో నాగలక్ష్మి, నాతవరం సర్పంచ్ గొలగాని రాణి, ఎంపీటీసీ రేణుక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment