త్రివర్ణ జెండా రూపకల్పన ఇక్కడే
– నడిగూడెం కోటలో పింగళి రూపకల్పన
నడిగూడెం: జాతీయ త్రివర్ణ పతాకాన్ని నడిగూడెంలోని జమీందారు రాజా బహుద్దూరు నాయిని వెంకటరంగారావు కోటలోనే పింగళి వెంకయ్య రూపొందించారు. పింగళి వెంకయ్య స్వగ్రామం మచిలీపట్నం వద్ద ఓ కుగ్రామం. 1910లో అమెరికాలోని
బావిస్టన్లో పింగళి వెంకయ్య, రాజా నాయిని వెంకటరంగారావు కలిసి చదువుకున్నారు. పింగళి వెంకయ్య వ్యవసాయం, వెంకటరంగారావు ఎల్ఎల్బీలో అక్కడే పట్టభద్రులయ్యారు. నాడు రాజా నాయిని వెంకటరంగారావు అప్పటి క్రిష్ణా జిల్లా నందిగామ తాలూకా మునగాల పరగణాను పాలిస్తున్నారు. పింగళి వెంకయ్యకు వ్యవసాయంలో ప్రావీణ్యం ఉండడంతో ఈ పరగణాలో పత్తి సాగు కోసం, ఆ పంట విస్తరణ కోసం రాజావారు పింగళి వెంకయ్యను తన ఆస్థానంలో వ్యవసాయాధికారిగా నియమించుకున్నారు. 1910లో స్వాతంత్ర పోరాట ఉద్యమం ఉదృతంగా జరుతున్నది. జాతిపిత మహాత్మా గాంధీ అంటే పింగళి వెంకయ్య బాగా ఇష్టం. పింగళి వెంకయ్య రాజావారి వద్ద విధులు నిర్వహిస్తూనే నాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేవాడు. నాడు అనేకసార్లు గాంధీజీని కలిసేవారు. పలుసార్లు గాంధీ మన జాతికి జాతీయ జెండా కావాలని అడగడంతో 1926లో పింగళి వెంకయ్య మూడు రంగుల్లో ఒక జాతీయ జెండాను రూపొందించారు. కశాయం రంగు ఉద్యమ స్పూర్తి కోసమని, తెలుపు శాంతి కోసమని, ఆకుపచ్చని రంగు దేశం నిత్యం పచ్చని పైరులతో ఉండాలనేది దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు. ఈ మూడు రంగులో మధ్యలో గాంధీజీ నూలు వడికంచు రాట్నం పటంతో ఈ జాతీయ జెండాను రూపొందించారు. 1926లోనే తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని గాంధీజికి ప్రదర్శించారు. అప్పటికే దేశ నలుమూలల నుంచి 16 నమూనాలు గాంధీజీకి అందాయి. పింగళి వెంకయ్య రూపొందించిన జెండాలో 1930లో రాట్నంను తొలగించి ఆశోక చక్రంతో రూపొందించి పింగళి వెంకయ్య రూపొందించిన జెండానే గాంధీజీ ఖరారు చేశారు. తర్వాత ఈ స్వాతంత్ర పోరాట ఉద్యమంలో ఈ జాతీయ జెండాను పట్టుకొని ఉద్యమకారులు ఉద్యమాన్ని నిర్వహించారు. నాడు నడిగూడెంలోనే పింగళి వెంకయ్య దేశం గర్వించపడేలా జాతీయ జెండాను రూపొందించడం పట్ల నడిగూడెం మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.