‘కాంగ్రెస్, ఎన్సీపీ డెరైక్షన్లోనే...’
సాక్షి, ముంబై: కాంగ్రెస్, ఎన్సీపీ డెరైక్షన్లోనే మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే టోల్ నాటకానికి తెర తీశారని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. టోల్ విధానంలో పారదర్శకత తీసుకురావాలన్న డిమాండ్‌తో బుధవారం రాష్ర్టవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన రాజ్‌ఠాక్రే దమ్ముంటే అరెస్టు చేయమని సర్కార్‌కు సవాల్ విసరడం అంతా నాటకమేనని విమర్శించారు. మంగళవారం సామ్నా సంపాదకీయంలో రాజ్‌ఠాక్రే తీరుపై మండిపడ్డారు. ‘కాంగ్రెస్ నేత సలీం, ఎన్సీపీ నేత జావేద్ స్క్రిప్ట్ మేరకే కథనాయకుడు రాజ్ ఆడుతున్నాడు.
దైర్యముంటే అరెస్టు చేయాలని అంటున్నారు. అయితే సంకెళ్లు వెయ్యడానికి ధైర్యం చూపించాల్సిన అవసరం ఏముంద’ని ప్రశ్నించారు. ఈ నాటకంలో రాజ్ చేసిన గర్జన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని, ఇక చివరగా అరెస్టు క్లైమాక్స్ అని ఉద్దవ్ అభివర్ణించారు. ఈ ఆందోళన, రాస్తారోకోలన్నీ ముందు నుంచి ప్లాన్ చేసి చేస్తున్నవేనని, పాత నాటకాన్నే కొత్తగా మళ్లీ ప్రకటించారన్నారు. ‘నన్ను అరెస్టు చేయండి’ అనే ఈ నాటకం విడుదలకు సిద్ధంగా ఉందన్నారు. దీనికి అజిత్ పవార్, ఆర్.ఆర్.పాటిల్, సీఎం పృథ్వీరాజ్ చవాన్లలో ఎవరో ఒకరు గంట కొట్టగానే పరదాలు ఎత్తివేసి నాటకాన్ని ప్రారంభిస్తారని ఎమ్మెన్నెస్‌కు చురకలంటించారు.
టోల్ రద్దు చేయాలని సీఎంను కోరిన ఎన్సీపీ..
రాష్ట్రంలోని రెండు లేన్ల రహదారులతోపాటు ఫ్లై ఓవర్లపై వసూలు చేసే టోల్‌ను పూర్తిగా రద్దు చేయాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు భాస్కర్ జాదవ్ కోరారు.