the National Bank
-
చిత్తూరు గజనీలకు గుర్తొచ్చింది !
రూ.6 కోట్ల బ్యాంకు లావాదేవీలు లభ్యం ఇంకా కొనసాగుతున్న విచారణ చిత్తూరు (అర్బన్): చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ల సమాచారాన్ని అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. మతిమరపుతో కొందరు అధికారులు ప్రభుత్వం నుంచి వచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్లను బ్యాంకుల్లో వేసి మరచిపోయిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం ‘సాక్షి’ పత్రికలో చిత్తూరు గజనీలు అదే శీర్షికన వార్త ప్రచురితమైన విషయం విదితమే. ఈ క్రమంలో సోమవారం తొలి రోజు పలు చిట్టా పుస్తకాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం 42 బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు వేసినట్లు అందులో పేర్కొన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.8 కోట్లకుగానూ రూ.6 కోట్లు ఏయే బ్యాంకుల్లో ఎఫ్డీలు వేశారనే విషయాన్ని ప్రాథమికంగా తెలుసుకున్నారు. ఈ వివరాలను అధికారులు బయటకు తీశారు. గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా కార్పొరేట్ బ్యాంకుల్లో భారీ ఎత్తున ఎఫ్డీలు వేసినట్లు కూడా ఆధారాలు లభించాయి. మరో జాతీయ బ్యాంకులో ఏటా జరగాల్సిన లావాదేవీలకన్నా, ఎక్కువ మొత్తంలో ఎఫ్డీలు వేసి, మళ్లీ వాటిని వెనక్కు తీసేశారు. మొత్తం మీద చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో రూ.8 కోట్లకు పైగా ఎఫ్డీలు ఎక్కడో బ్యాంకుల్లో పెట్టేసి, ప్రస్తుతం వెతుకులాట ప్రారంభించిన అధికారులకు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటం కాస్త ఉపశమనాన్ని కలిగించే విషయమే. మరిన్ని వివరాల కోసం అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ వారంలోనే ఎఫ్డీలకు సంబంధించి పూర్తి వివరాలను వెలికితీయనున్నారు. -
ఇక సార్వత్రిక సమరం 12న నోటిఫికేషన్
ప్రశాంత ఎన్నికలకు సహకరించండి రాజకీయ పార్టీలతో సమావేశంలో కలెక్టర్ విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు అధికారులకు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, సలహాలు, సూచనలపై జిల్లాకు చెందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఆయన స్థానిక తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి సంబంధించి అన్ని అనుమతులు సింగిల్‌విండో ద్వారా త్వరితగతిన మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 19తో నామినేషన్ల గడువు పూర్తి... సాధారణ ఎన్నికలకు ఈ నెల 12న నోటిఫికేషన్ జారీచేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ఆ తేదీ నుంచి ఈ నెల 19 వరకు నామినేషన్లకు అవకాశముంటుందని వివరించారు. 19న మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నామినేషన్లు స్వీకరించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సెలవు దినాలైన 13, 14, 18 తేదీలు మినహా మిగిలిన రోజులలో అభ్యర్థుల నుంచి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. పార్లమెంటు అభ్యర్థులు ఫారం-2ఎ, అసెంబ్లీ అభ్యర్థులు ఫామ్-2బి సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు తమ అఫిడవిట్లో దేశంలోనే గాక ఇతర దేశాల్లోని ఆస్తులు, అప్పులు వివరాలను పొందుపరచవలసి ఉంటుందన్నారు. పోటీచేసే అభ్యర్థులు ఏదైనా జాతీయ బ్యాంకులో ఖాతాలను తప్పనిసరిగా తెరవాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల ప్రచారానికి వాహనాల అనుమతి రిటర్నింగ్ అధికారి ద్వారా సభలు, సమావేశాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అన్నారు. కాన్వాయిలో 10 వాహనాలు మించి అనుమతించటం జరగదని, మోటారు సైకిళ్లు, ఆటోరిక్షాలను కూడా వాహనాలుగానే పరిగణిస్తామని చెప్పారు. విద్యాసంస్థలలో రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వటం జరగదని వివరించారు. సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ మతపరమైన వ్యాఖ్యలు, మతపరమైన ప్రదేశాలలో ప్రచారం నిషిద్ధమని తెలిపారు. డబ్బు పంపిణీని అరికట్టాలి... సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రచార అనుమతులను త్వరితగతిన ఇప్పించాలని కోరారు. ఎన్నికలలో కొత్త కొత్త పద్ధతుల ద్వారా డబ్బు పంపిణీని అరికట్టాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె .మురళీ, మున్సిపల్ కమిషనర్ హరికిరణ్, ైవె ఎస్సార్ కాంగ్రెస్ జిల్లా నాయకులు సామినేని ఉదయభాను, జలీల్‌ఖాన్, కాంగ్రెస్ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు, దేవినేని అవినాష్, సీపీఐ తరఫున అక్కినేని వనజ, సీపీఎం తరఫున వై కేశవరావు, బాబూరావు, బీఎస్పీ తరఫున బి.పుష్పరాజు, ఎన్సీపీ తరఫున పి.కరుణాకర్, లోక్‌సత్తా తరఫున కె.శ్రీనివాసరావు, జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున బొర్రా చలమయ్య, పైలా సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
అమ్మో.. పెద్ద నోటు మాకొద్దు!
రూ500,1000 నోట్లను తిరస్కరిస్తున్న ప్రజలు ఆర్బీఐ నిబంధనలతో తంటాలు చల్లపల్లి, న్యూస్‌లైన్ : ఇటీవల ఆర్బీఐ విధించిన నిబంధనలపై సరైన అవగాహన లేకపోవడంతో రూ. 500, 1000 నోట్లను తీసుకోవాలంటే గ్రామీణ ప్రాంత ప్రజలు, వ్యాపారులు భయపడిపోతున్నారు. నకిలీ కరెన్సీని అరికట్టి, నల్లధనాన్ని నిరోధించాలనే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ నిబంధనలుపెట్టిందనే విషయాన్ని బ్యాంకులుగానీ, ప్రభుత్వం గానీ విస్తృత ప్రచారం చేయకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. నోట్ల మార్పిడిపై జూలై వరకు గడువున్నప్పటికీ ఎందుకొచ్చిన తలనొప్పులనుకుంటున్న గ్రామీణ వ్యాపారులు పెద్ద నోట్లను తీసుకోవడం లేదు. 2005కి ముందు నోట్లతో పోలిస్తే తరువాత ముద్రించిన నోట్లలో 6 నుంచి 8భద్రత ఫీచర్లు ఉన్నాయి. ఈ దృష్ట్యా పాతనోట్లపై ఆర్బీఐ పెట్టిన నిబంధనలు గ్రామీణ ప్రాంత ప్రజలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఏటీఎంల ద్వారా వెయ్యినోట్లే ఎక్కువ... ఏటీఎంల నుంచి రూ.2,000 ఆపై నగదు తీసుకునే వారికి తప్పని సరిగా వెయ్యి నోట్లే వస్తున్నాయి. రూ.500నోట్లు తక్కువగా వస్తున్నాయి. బ్యాంకులు, ఏటీఎంల ద్వారా వచ్చిన వెయ్యిరూపాయల నోట్లను గ్రామాల్లో మార్చాలంటే తంటాలు పడాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ నిబంధనలివే... నకిలీ కరె న్సీని నిరోధించేందుకు, నల్ల ధనాన్ని అరికట్టేందుకు ఆర్బీఐ రూ.10 నుంచి రూ.1,000 నోట్లపై కొన్ని నిబంధనలు విధించింది. 2005 సంవత్సరం కంటే ముందు ముద్రించిన ఈ నోట్లు మార్చి 31 తరువాత చెల్లవు. మార్చి 31 వరకు ఈ నోట్లను ఏ లావాదేవీకైనా ఉపయోగించవచ్చు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ ఎందుకొచ్చిన చిక్కులు అనుకున్న గ్రామీణ ప్రాంత ప్రజలు, వ్యాపారులు 20 రోజుల నుంచి చాలా చోట్ల పెద్ద నోట్లు తీసుకోవడం లేదు. పాత నోట్లను ఎలా గుర్తించాలంటే.... 2005 తరువాత ముద్రించిన నోట్ల వెనుకవైపున ముద్రణ సంవత్సరం ఉంటుంది. 2005కు ముందు ముద్రించిన నోట్ల వెనుకవైపున ముద్రణ సంవత్సరం ఉండదు. నోట్ల వెనుక ఎలాంటి ముద్రణ సంవత్సరం లేకపోతే అవి కొత్తగా ఉన్నప్పటికీ... పాత నోట్లగానే భావించాలి. 2005కు ముందు ముద్రించిన నోట్లను ఇలా చేయాలి.. 2005కు ముందు ముద్రించిన రూ.10 నుంచి రూ,1,000 నోట్లు ఈ ఏడాది మార్చి 31 తరువాత బ్యాంకుల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో చెల్లుబాటు కావు. అప్పటివరకు వీటిని ఏ జాతీయ బ్యాంకులోనైనా మార్చు కోవచ్చు. ఎలాంటి షరతులు, చార్జీలుండవు. ఈ ఏడాది జూలై 1వ తేదీ వరకు ఇలాంటి నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. మార్చుకునేందుకు బ్యాంకులో ఖాతా ఉండాల్సిన అవసరం లేదు. అయితే జూలై 1వ తేదీ తరువాత ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలంటే బ్యాంకులో ఖాతాలేనివారు రూ.500, రూ.1,000నోట్లను 10కన్నా ఎక్కువ నోట్లను తీసుకొస్తేనే మార్చుకుంటారు. ఈ సమయంలో నోట్లను మార్చుకోవాలనుకునేవారు వారి గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ వివరాలను బ్యాంకులో తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.