ఇక సార్వత్రిక సమరం 12న నోటిఫికేషన్ | The notification of the general meeting, on 12 | Sakshi
Sakshi News home page

ఇక సార్వత్రిక సమరం 12న నోటిఫికేషన్

Published Thu, Apr 10 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM

The notification of the general meeting, on 12

  •  ప్రశాంత ఎన్నికలకు సహకరించండి
  •  రాజకీయ పార్టీలతో సమావేశంలో కలెక్టర్
  •  విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు అధికారులకు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, సలహాలు, సూచనలపై జిల్లాకు చెందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఆయన స్థానిక తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి సంబంధించి అన్ని అనుమతులు సింగిల్‌విండో ద్వారా త్వరితగతిన మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
     
    19తో నామినేషన్ల గడువు పూర్తి...
     
    సాధారణ ఎన్నికలకు ఈ నెల 12న నోటిఫికేషన్ జారీచేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ఆ తేదీ నుంచి ఈ నెల 19 వరకు నామినేషన్లకు అవకాశముంటుందని వివరించారు. 19న మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నామినేషన్లు స్వీకరించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సెలవు దినాలైన 13, 14, 18 తేదీలు మినహా మిగిలిన రోజులలో అభ్యర్థుల నుంచి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు.

    పార్లమెంటు అభ్యర్థులు ఫారం-2ఎ, అసెంబ్లీ అభ్యర్థులు ఫామ్-2బి సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు తమ అఫిడవిట్‌లో దేశంలోనే గాక ఇతర దేశాల్లోని ఆస్తులు, అప్పులు వివరాలను పొందుపరచవలసి ఉంటుందన్నారు. పోటీచేసే అభ్యర్థులు ఏదైనా జాతీయ బ్యాంకులో ఖాతాలను తప్పనిసరిగా తెరవాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల ప్రచారానికి వాహనాల అనుమతి రిటర్నింగ్ అధికారి ద్వారా సభలు, సమావేశాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అన్నారు.

    కాన్వాయిలో 10 వాహనాలు మించి అనుమతించటం జరగదని, మోటారు సైకిళ్లు, ఆటోరిక్షాలను కూడా వాహనాలుగానే పరిగణిస్తామని చెప్పారు. విద్యాసంస్థలలో రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వటం జరగదని వివరించారు. సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ మతపరమైన వ్యాఖ్యలు, మతపరమైన ప్రదేశాలలో ప్రచారం నిషిద్ధమని తెలిపారు.
     
    డబ్బు పంపిణీని అరికట్టాలి...

    సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రచార అనుమతులను త్వరితగతిన ఇప్పించాలని కోరారు. ఎన్నికలలో కొత్త కొత్త పద్ధతుల ద్వారా డబ్బు పంపిణీని అరికట్టాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె .మురళీ, మున్సిపల్ కమిషనర్ హరికిరణ్, ైవె ఎస్సార్ కాంగ్రెస్ జిల్లా నాయకులు సామినేని ఉదయభాను, జలీల్‌ఖాన్, కాంగ్రెస్ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు, దేవినేని అవినాష్, సీపీఐ తరఫున అక్కినేని వనజ, సీపీఎం తరఫున వై కేశవరావు, బాబూరావు, బీఎస్‌పీ తరఫున బి.పుష్పరాజు, ఎన్‌సీపీ తరఫున పి.కరుణాకర్, లోక్‌సత్తా తరఫున కె.శ్రీనివాసరావు, జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున బొర్రా చలమయ్య, పైలా సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement