సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్రంలో కీలక ఘట్టమైన ప్రచార పర్వానికి నేటితో తెరపడనుంది. సోమవారం సాయంత్రం 6 గంటలతో ప్రచార గడువు ముగియనుంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్రంలో కీలక ఘట్టమైన ప్రచార పర్వానికి నేటితో తెరపడనుంది. సోమవారం సాయంత్రం 6 గంటలతో ప్రచార గడువు ముగియనుంది. అంతిమ పోరైన పోలింగ్‌కు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో విజయం కోసం పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. కీలకమైన ఈ కొన్ని గంటలను సాధ్యమైనంత మేర సద్వినియోగం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. చివరి క్షణాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నాయి.
ప్రచారానికి చివరి రోజైన సోమవారం అన్ని పార్టీల కీలక నేతలు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నామినేషన్లు దాఖలుచేసిన నాటి నుంచి అభ్యర్థులందరూ క్షణంతీరిక లేకుండా ప్రచారం నిర్వహించి నియోజకవర్గంలోని గడపగడపా తిరిగారు. ఎండలను సైతం లెక్కచేయక ప్రతి క్షణం ఓటర్లను ప్రసన్నం చేసేందుకు కృషి చేశారు. ప్రత్యర్థులను కలవరపెట్టేలా ఒకరినిమించి ఒకరు ప్రచారంలో దూకుడు ప్రదర్శించారు. పార్టీ అధినేతలను, జనాకర్షక నాయకులను తమ నియోజకవర్గాలకు రప్పించి ప్రచారం చేయించుకున్నారు. ప్రత్యర్థుల ప్రచార సరళిపై వేగులను నియమించి ఎప్పడికప్పుడు సమాచారం పొందుతూ వారి కంటే ఒక అడుగు ముందుండేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.
చివరి రోజుల్లో పెరిగిన ప్రచార జోరు
ప్రచార ఘట్టంలో చివరి రెండు రోజులు జిల్లాలో పలు పార్టీల కీలక నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం జిల్లాలోని ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆదివారం కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన అగ్రనేతలు జిల్లాలోని సభలు, రోడ్‌షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాలోని తాండూరు, ఉప్పల్ తదితర నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లిలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.
ప్రలోభాల వల..
ఎన్నికల చివరి గంటల్లో పట్టుసడలిపోకుండా అభ్యర్థులందరూ ఓటర్లపై ప్రలోభాల ఎరవేస్తున్నారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. మహిళలను ఆకట్టుకునేందుకు కానుకలు పంచుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు రూ.1000 నుంచి రూ.రెండు వేల వరకు పంచుతున్నట్టు సమాచారం. పోటీ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉందని అంచనా. ఈ రెండు రోజులపాటు డబ్బు పంపిణీ విచ్చలవిడిగా సాగనుండడంతో ఎన్నికల కమిషన్, పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. నిఘాను పటిష్టం చేశారు. ఏ చిన్న వాహనాన్నీ వదలకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు.