ఇప్పటి వరకూ 3 ఎంపీ స్థానాలకు 26, 19
అసెంబ్లీ స్థానాలకు 154 నామినేషన్లు
21న పరిశీలన, 23 వరకు ఉపసంహరణకు గడువు
సాక్షి, కాకినాడ, సార్వత్రిక ఎన్నికల్లో ఈ నెల 12న ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారంతో ముగియనుంది. ఇప్పటి వరకు జిల్లాలోని మూడు పార్లమెంటు స్థానాలకు 26, 19 అసెంబ్లీ స్థానాలకు 154 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు పార్లమెంటు స్థానాలతో పాటు పి.గన్నవరం మినహా అన్ని అసెంబ్లీ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
నామినేషన్ల స్వీకరణ ముగియవచ్చినా తెలుగుదేశం సహా ఇతర ప్రధాన పార్టీలకు సంబంధించి చాలా నియోజక వర్గాల్లో నామినేషన్లు దాఖలు కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బీజేపీతో పొత్తు తేలక సతమతమవుతున్న తెలుగుదేశం పిఠాపురం, పెద్దాపురం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలకు, కాంగ్రెస్ పార్టీ పెద్దాపురానికి ప్రకటించాల్సి ఉంది.
నరాలు తెగే ఉత్కంఠకు లోనవుతున్న తెలుగుదేశం ఆశావహులు అధినేత చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి ప్రచారంలో దూసుకుపోతుంటే తాము మాత్రం ఇంకా టిక్కెట్ల కోసం ఎదురు చూడాల్సిన దౌర్భాగ్యం దాపురించిందని వాపోతున్నారు. ముఖ్యంగా పిఠాపురం, పెద్దాపురం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఆశావహులు తీవ్ర ఆందోళనకు గురవుతు న్నారు.
జై సమైక్యాంధ్ర పార్టీ కూడా నాలుగు నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. కాంగ్రెస్ టిక్కెట్లు ఖరారైన సిట్టింగ్ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరీదేవి, కోసూరి కాశీ విశ్వనాథ్‌లతో పాటు ఆ పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీల అభ్యర్థులు పలువురు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది.
పెద్దాపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి తోట సుబ్బారావు నాయుడు నామినేషన్ వేసి ప్రచారంలో దూసుకుపోతుండగా తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీల అభ్యర్థులే ఖరారు కాలేదు.
రాజమండ్రి సిటీ బరిలో 13 మంది ఇప్పటి వరకు కాకినాడ ఎంపీ స్థానానికి 11 మంది, అమలాపురం ఎంపీ స్థానానికి 9 మంది, రాజమండ్రి ఎంపీ స్థానానికి ఆరుగురు నామినేషన్లు వేశారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీ చూస్తే ఇప్పటి వరకు అత్యధికంగా రాజమండ్రి సిటీ నుంచి 13 మంది నామినేషన్లు వేయగా, అత్యల్పంగా ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, రాజానగరం నియోజకవర్గాలకు ఐదేసి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.
తుని, పెద్దాపురం, మండపేటల నుంచి ఏడేసి, ప్రత్తిపాడు నుంచి పది, పిఠాపురం నుంచి ఆరు, కాకినాడ రూరల్, అనపర్తి, రామచంద్రపురంల నుంచి పదేసి, కాకినాడ సిటీ, అమలాపురం, జగ్గంపేటల నుంచి ఎనిమిదేసి, కొత్తపేట, రంపచోడవరంల నుంచి తొమ్మిదేసి, రాజమండ్రి రూరల్ నుంచి 12 చొప్పున నామినేషన్లు పడ్డాయి.
చివరిరోజైన శనివారం భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. నామినేషన్లను ఈ నెల 21న పరిశీలించనున్నారు. ఉప సంహరణకు 23 వరకు గడువుంది. అదేరోజు బరిలో నిలిచే వారి జాబితాను ప్రకటిస్తారు.