ముక్కలు.. చెక్కలు..!
ఇదీ ‘సైకిల్’ దుస్థితి...
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్లో ఉరకలేస్తున్న ఉత్సాహం
- అన్ని నియోజకవర్గాల్లో డీలా పడిన తెలుగు తమ్ముళ్లు
- ఫలితమివ్వని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ప్రచారం
- ఓటింగ్ సరళితో కంగుతిన్న టీడీపీ అభ్యర్థులు, నేతలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బరిలోకి దిగిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపు ధీమాతో ఉన్నారు. ఓటింగ్ సరళిని గమనించిన అనంతరం వారిలో ఉత్సాహం ఉరకలేస్తుండగా తెలుగు తమ్ముళ్లు డీలాపడ్డారు. తెలుగుదేశం పార్టీ పుంజుకుందని, ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే సీట్లు సాధించడం ఖాయమని ఇంతకాలం ప్రచారం చేసుకున్న తెలుగు తమ్ముళ్లకు ఓటర్లు ‘చుక్క’ మాత్రమే చూపించి ఓటు వైఎస్సార్ సీపీ ఖాతాలో వేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బడిముబ్బడిగా పార్టీలో చేర్చుకుని టికెట్లు కూడా వారికే కేటాయించడం తమకు అనుకూలిస్తుందని భావించగా అది తీవ్ర నష్టాన్ని మిగిల్చడాన్ని వారు జీర్ణించుకులేకపోతున్నారు.
జిల్లాలో ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పార్టీలో చేర్చుకోవడం వల్ల టీడీపీకి బలం పెరుగుతుందని ఆ పార్టీ పెద్దలు భావించి పప్పులో కాలేసి తీవ్రంగా నష్టపోయారని పోలింగ్ సరళి చూసిన తర్వాత తెలియడంతో కంగుతిన్నారు. ఏళ్ల తరబడి జెండాలు మోసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను కాదని కొత్తగా వచ్చిన నాయకుడిని అందలం ఎక్కించడంతో వారిలో అసంతృప్తి జ్వాలలు రగిలాయి. గిద్దలూరులో అన్నా రాంబాబును రాత్రికి రాత్రే పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడాన్ని స్థానిక ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోయారు.
ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పిడతల సాయికల్పనారెడ్డికి టికెట్ నిరాకరించారు. ఆమెను కాదని మరో నాయకుడికి టికెట్ ఇవ్వడాన్ని ఆమె అవమానంగా భావించారు. అనంతరం ఆమె తన అనుయాయులతో వైఎస్సార్ సీపీలో చేరారు. ఆమెతో పాటు ఆమె ఓటు బ్యాంకు మొత్తం వైఎస్సార్ సీపీ ఖాతాలో పడింది. కాంగ్రెస్ నాయకులను దగ్గరకు తీయడం వల్ల బలం పెరిగిందని టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం చేసుకున్నారు. అది తమకు అనుకూలిస్తుందని భ్రమించి బొక్కబోర్లా పడ్డారు. ఇదే క్రమంలో ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నమ్మకం కుదిరింది.
జిల్లాలో 83.60 శాతం ఓట్లు పోలయ్యాయి. వీటిలో ఎక్కువ మంది యువకులు, మహిళలు ఉన్నారు. వీరంద రూ వైఎస్సార్ సీపీకి ఆకర్షితులైనట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వైఎస్సార్ సీపీకి ఎక్కువ ఓట్లు పోలవుతుండటాన్ని గమనించిన తెలుగుదేశం తమ్ముళ్లు ఎన్నికల రోజు ఉదయం 11 గంటల నుంచే హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి రిగ్గింగ్‌కు విఫలయత్నం చేశారు.
దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. తెలుగుదేశం పార్టీ ఎంతగా అడ్డుకున్నా జన ప్రభంజనం ఆగలేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్‌ల్లో వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. ఇంతటి ధీమాను తెలుగుదేశం నేతలు వ్యక్తం చేయలేకపోతున్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ప్రచారం వల్ల ఒరిగిందేమీలేదని తేల్చుకున్నారు.