సీమాంధ్రలో వైఎస్సార్ సీపీ హవా
105 నుంచి 112 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయం..
‘ఆరా’ సర్వేలో వెల్లడి
15 నుంచి 18 ఎంపీ స్థానాలు వైఎస్సార్ సీపీవేనని స్పష్టీకరణ
హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని అగస్త్య రీసెర్స్ అండ్ అనాలసిస్ ఏజెన్సీ (ఆరా) జరిపిన సర్వేలో తేలింది. హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు మూడింట రెండొంతులు వైఎస్సార్ సీపీ వశమవుతాయని తెలిపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 49 శాతం ఓట్లతో 105 నుంచి 112 అసెంబ్లీ స్థానాలు సాధిస్తుందని వెల్లడించింది. ఇక్కడి 25 లోక్‌సభ స్థానాల్లో 15 నుంచి 18 నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని తెలిపింది.
తెలుగుదేశం - బీజేపీల కూటమి 55 నుంచి 65 అసెంబ్లీ స్థానాలు, 7 నుంచి 10 లోక్‌సభ స్థానాలు సాధించవచ్చని అంచనా వేసింది. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్‌కు, టీడీపీ-బీజేపీ కూటములకు వచ్చే ఓట్ల మధ్య 8 శాతం వ్యత్యాసముందని తెలిపింది. స్వతంత్ర అభ్యర్థులు, ఇతరులు 10 నుంచి 15 స్థానాలు, 1 లోక్‌సభ స్థానం పొందవచ్చని తెలిపింది.
తెలంగాణలో హంగ్: తెలంగాణ ప్రాంతంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాదని, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కువ స్థానాలు పొందుతుందని, కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంటుందని సర్వే వెల్లడించింది. ఇక్కడ టీడీపీ, బీజేపీల కూటమిది మూడో స్థానమేనని తెలిపింది. తెలంగాణ ప్రాంతంలో 119 అసెంబ్లీ స్థానాలకుగాను 40 శాతం ఓట్లతో టీఆర్‌ఎస్ 52 నుంచి 57 స్థానాలు పొందుతుందని వెల్లడించింది. కాంగ్రెస్, సీపీఐల కూటమి 31 శాతం ఓట్లతో 43 నుంచి 45 స్థానాలు పొందవచ్చని తెలిపింది. టీడీపీ, బీజేపీల కూటమికి దక్కేది 12 నుంచి 15 అసెంబ్లీ స్థానాలేనని సర్వేలో స్పష్టమైంది.
ఇక్కడ వైఎస్సార్‌సీపీకి 3 నుంచి 6 అసెంబ్లీ సీట్లు, ఎంఐఎంకు 6 నుంచి 7 స్థానాలు వస్తాయని తెలిపింది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు 7 నుంచి 9, కాంగ్రెస్-సీపీఐ కూటమికి 4 నుంచి 6, టీడీపీ-బీజేపీ కూటమికి 2 నుంచి 3, ఇతరులకు 1 లేదా 2 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఎంఐఎం భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని తెలిపింది. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక లోక్‌సభ స్థానం దక్కవచ్చని పేర్కొంది.