ప్రచారం ప్రారంభం
అడుగడుగునా జనం నీరాజనం
కోటనందూరు నుంచి సునీల్,
దాడిశెట్టి రాజా ప్రచారం
తుని, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు చలమలశెట్టి సునీల్, దాడిశెట్టి రాజా శుక్రవారం ప్రారంభించిన ప్రచారానికి అడుగడుగునా జన నీరాజనం లభించింది. తూర్పు సెంటిమెంట్‌తో వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారాన్ని కాకినాడ పార్లమెంటు అభ్యర్థి చలమలశెట్టి సునీల్, తుని అసెంబ్లీ అభ్యర్థి దాడిశెట్టి రాజా కోటనందూరు మండలం, బొద్దవరంలో శ్రీకారం చుట్టారు.
తాండవ నది తీరాన ఉన్న శివాలయంలో వారు పూజలు చేసి ప్రచారానికి బయలుదేరారు. అడుగడుగునా మహిళలు మంగళహారతులతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ స్వచ్ఛందంగా భారీగాజనం తరలివచ్చారు. బొద్దవరం, తాటిపాక, ఇండుగపల్లి, బిళ్లనందూరు, బంగారయ్యపేట, ఎస్‌ఆర్‌పేట, అప్పలరాజుపేట, భీమవరపుకోట, జగన్నాథపురం, కోటనందూరు, కేఏ మల్లవరం, పాతకొట్టాం, కేఎస్ కొత్తూరు, తిమ్మరాజుపేట, కేఈ చిన్నాయిపాలెంలలో ప్రచారాన్ని నిర్వహించారు.
తుని నియోజకవర్గంలో ప్రజలు వైఎస్సార్ సీపీ పక్షాన నిలవడం ఆనందంగా ఉందని చలమలశెట్టి సునీల్ అన్నారు. చంద్రబాబును నమ్మితే నట్టేట ముంచడం ఖాయమన్నారు. మహానేత రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణపాలన జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. రైతులకు సాగునీరు, మహిళలకు రుణమాఫీ, పిల్లలకు అమ్మఒడి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్జప్తి చేశారు.
మండుటెండను సైతం లెక్క చేయకుండా అభిమానంతో వేచిఉన్న అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు, అవ్వలు, తాతలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని దాడిశెట్టి రాజా అన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీగా సునీల్‌కు, ఎమ్మెల్యేగా తనకు ఓట్లను వేసి గెలిపించాలని కోరారు.
మహిళా విభాగం కన్వీనర్ రొంగలి లక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కుసుమంచి శోభారాణి, లోవ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు లాలం బాబ్జి, మాకినీడి గంగారావు, నాగం దొరబాబు, మాజీ ఎంపీపీలు గొర్లి అచ్చియ్యనాయుడు, అంకంరెడ్డి నానబ్బాయి, నల్లమిల్లి గోవింద్, పెదపాటి అమ్మాజీ, ఆర్. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.