మెట్ట, గిరిసీమల్లో ఫ్యాన్ హోరు
సాక్షి, కాకినాడ :హోరాహోరీగా సాగిన సార్వత్రిక పోరులో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్సార్‌సీపీ ఆశించిన స్థాయిలో కాకపోయినా మెరుగైన ఫలితాలు సాధించి జిల్లాపై పట్టు సాధించింది. ముఖ్యంగా మెట్ట ప్రాంతంలోని తుని, ప్రత్తిపాడు, జగ్గంపేటతో పాటు ఏజెన్సీలోని రంపచోడవరం, కోనసీమలోని కొత్తపేట స్థానాలను దక్కించుకొంది. స్వయంగా తోడల్లుళ్ల్లయిన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు మంచి మెజార్టీలతో గెలుపొందారు. జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ 15,932 ఓట్ల ఆధిక్యతతో టీడీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబుపై విజయం సాధించారు. నెహ్రూకు 88,146 ఓట్లు పోలవగా, చంటిబాబుకు 72,214 ఓట్లు దక్కాయి. ప్రత్తిపాడు నుంచి వరుపుల సుబ్బారావు 3,413 ఓట్ల మెజార్టీతో సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబుపై గెలుపొందారు. సుబ్బారావుకు63,693 ఓట్లు, లభించగా, చిట్టిబాబుకు 60,280 ఓట్లు దక్కాయి. గతంలో ఇక్కడ నుంచి సుబ్బారావుపై పోటీ చేసి గెలుపొందిన ముద్రగడ పద్మనాభం ఈసారి ఇక్కడ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి, మూడో స్థానానికి పరిమితమయ్యారు.
కుప్పకూలిన యనమల కోట
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కంచుకోటను వైఎస్సార్‌సీపీ నుంచి తొలిసారి బరిలోకి దిగిన దాడిశెట్టి రాజా బద్దలుగొట్టారు. పెద్దగా రాజకీయ అనుభవం కూడా లేని రాజా.. మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన యనమల సామ్రాజ్యాన్ని కుప్పకూల్చారు. యనమల సోదరుడు కృష్ణుడిపై 18,575 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. రాజాకు 84,755 ఓట్లు పోలవగా, కృష్ణుడుకి 66,182 ఓట్లు దక్కాయి.ఏజెన్సీలోని రంపచోడవరం నియోజకవర్గంలో కూడా ఫ్యాన్ గాలి హోరెత్తింది. ఇక్కడ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వంతల రాజేశ్వరి.. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావును, తాజా మాజీ ఎమ్మెల్యే కోసూరి కాశీ విశ్వనాథ్‌లపై విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ అనంత ఉదయభాస్కర్‌కు ఈ టికెట్ ఖరారైనప్పటికీ చివరి నిమిషంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన రాజేశ్వరి ఈ సంచలన విజయాన్ని అందుకున్నారు.
ఉదయ భాస్కర్ రాజకీయ చతురత, వ్యూహ రచనలు రాజేశ్వరి విజయానికి బాటలు వేశాయి. ఆమె తన సమీప ప్రత్యర్ధి వెంకటేశ్వరరావుపై 8,221 ఓట్ల ఆధిక్యతతో విజయకేతనం ఎగురవేశారు. ఆమెకు 52,155 ఓట్లు పోలవగా, వెంకటేశ్వరరావుకు 43,934 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన తాజా మాజీ ఎమ్మెల్యే కోసూరి కాశీవిశ్వనాథ్ అతి తక్కువగా 3,782 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ పోగొట్టుకున్నారు.ఇక కోనసీమలో సైకిల్ దూకుడును తట్టుకొని మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సత్తా చాటారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుపై 713 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. జగ్గిరెడ్డికి 88,357, బండారుకు 87,644 ఓట్లు పోలయ్యాయి.
స్వల్ప తేడాతో సునీల్ ఓటమి
జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాల్లో ఐదుచోట్ల విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ స్వల్ప తేడాతో కాకినాడ ఎంపీ స్థానాన్ని కోల్పోయింది. 17వ రౌండ్ వరకూ స్పష్టమైన ఆధిక్యతను కనపర్చిన సునీల్‌పై టీడీపీ అభ్యర్థి తోట నరసింహం కేవలం 3,431 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.