అమ్మో.. పెద్ద నోటు మాకొద్దు!
- రూ500,1000 నోట్లను తిరస్కరిస్తున్న ప్రజలు
- ఆర్‌బీఐ నిబంధనలతో తంటాలు
చల్లపల్లి, న్యూస్‌లైన్ : ఇటీవల ఆర్‌బీఐ విధించిన నిబంధనలపై సరైన అవగాహన లేకపోవడంతో రూ. 500, 1000 నోట్లను తీసుకోవాలంటే గ్రామీణ ప్రాంత ప్రజలు, వ్యాపారులు భయపడిపోతున్నారు. నకిలీ కరెన్సీని అరికట్టి, నల్లధనాన్ని నిరోధించాలనే ఉద్దేశంతో ఆర్‌బీఐ ఈ నిబంధనలుపెట్టిందనే విషయాన్ని బ్యాంకులుగానీ, ప్రభుత్వం గానీ విస్తృత ప్రచారం చేయకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. నోట్ల మార్పిడిపై జూలై వరకు గడువున్నప్పటికీ ఎందుకొచ్చిన తలనొప్పులనుకుంటున్న గ్రామీణ వ్యాపారులు పెద్ద నోట్లను తీసుకోవడం లేదు. 2005కి ముందు నోట్లతో పోలిస్తే తరువాత ముద్రించిన నోట్లలో 6 నుంచి 8భద్రత ఫీచర్లు ఉన్నాయి. ఈ దృష్ట్యా పాతనోట్లపై ఆర్‌బీఐ పెట్టిన నిబంధనలు గ్రామీణ ప్రాంత ప్రజలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.
ఏటీఎంల ద్వారా వెయ్యినోట్లే ఎక్కువ...
ఏటీఎంల నుంచి రూ.2,000 ఆపై నగదు తీసుకునే వారికి తప్పని సరిగా వెయ్యి నోట్లే వస్తున్నాయి. రూ.500నోట్లు తక్కువగా వస్తున్నాయి. బ్యాంకులు, ఏటీఎంల ద్వారా వచ్చిన వెయ్యిరూపాయల నోట్లను గ్రామాల్లో మార్చాలంటే తంటాలు పడాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్‌బీఐ నిబంధనలివే...
నకిలీ కరె న్సీని నిరోధించేందుకు, నల్ల ధనాన్ని అరికట్టేందుకు ఆర్‌బీఐ రూ.10 నుంచి రూ.1,000 నోట్లపై కొన్ని నిబంధనలు విధించింది.
2005 సంవత్సరం కంటే ముందు ముద్రించిన ఈ నోట్లు మార్చి 31 తరువాత చెల్లవు. మార్చి 31 వరకు ఈ నోట్లను ఏ లావాదేవీకైనా ఉపయోగించవచ్చు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ ఎందుకొచ్చిన చిక్కులు అనుకున్న గ్రామీణ ప్రాంత ప్రజలు, వ్యాపారులు 20 రోజుల నుంచి చాలా చోట్ల పెద్ద నోట్లు తీసుకోవడం లేదు.
పాత నోట్లను ఎలా గుర్తించాలంటే....
2005 తరువాత ముద్రించిన నోట్ల వెనుకవైపున ముద్రణ సంవత్సరం ఉంటుంది.
2005కు ముందు ముద్రించిన నోట్ల వెనుకవైపున ముద్రణ సంవత్సరం ఉండదు.
నోట్ల వెనుక ఎలాంటి ముద్రణ సంవత్సరం లేకపోతే అవి కొత్తగా ఉన్నప్పటికీ... పాత నోట్లగానే భావించాలి.
2005కు ముందు ముద్రించిన నోట్లను ఇలా చేయాలి..
2005కు ముందు ముద్రించిన రూ.10 నుంచి రూ,1,000 నోట్లు ఈ ఏడాది మార్చి 31 తరువాత బ్యాంకుల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో చెల్లుబాటు కావు.
అప్పటివరకు వీటిని ఏ జాతీయ బ్యాంకులోనైనా మార్చు కోవచ్చు. ఎలాంటి షరతులు, చార్జీలుండవు.
ఈ ఏడాది జూలై 1వ తేదీ వరకు ఇలాంటి నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. మార్చుకునేందుకు బ్యాంకులో ఖాతా ఉండాల్సిన అవసరం లేదు.
అయితే జూలై 1వ తేదీ తరువాత ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలంటే బ్యాంకులో ఖాతాలేనివారు రూ.500, రూ.1,000నోట్లను 10కన్నా ఎక్కువ నోట్లను తీసుకొస్తేనే మార్చుకుంటారు. ఈ సమయంలో నోట్లను మార్చుకోవాలనుకునేవారు వారి గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ వివరాలను బ్యాంకులో తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.