దేశంలో 'లెక్క'లు లేని నల్లధనం! | What is total estimate of black money? | Sakshi
Sakshi News home page

దేశంలో 'లెక్క'లు లేని నల్లధనం!

Published Sat, Nov 19 2016 4:06 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

దేశంలో 'లెక్క'లు లేని నల్లధనం! - Sakshi

దేశంలో 'లెక్క'లు లేని నల్లధనం!

నల్లధనంపై పోరులో భాగంగానే పెద్దనోట్లు రద్దుచేశామని మోదీ ప్రభుత్వం చెబుతోంది. నిజానికి దేశంలో ఏ మేరకు నల్లధనం ఉందో కచ్చితంగా తెలిపే లెక్కలు ప్రభుత్వం దగ్గరే లేకపోవడం విచిత్రం. 2012లో యూపీఏ ప్రభత్వం నల్లధనంపై 108 పేజీల శ్వేతపత్రాన్ని ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ నాడు ఆర్థికమంత్రి హోదాలో ఈ శ్వేతపత్రాన్ని వెలువరించారు. అయితే ఇందులో వివిధ వర్గాలు, ఆర్థికవేత్తలు, పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం తప్పించి పెద్దగా ప్రభుత్వం తనకై తాను చెప్పిన కొత్త సంగతులేవీ లేవు. 1999 నుంచి 2007 వరకు 162 దేశాలకు సంబంధించిన వివరాలు పొందుపరచిన ప్రపంచబ్యాంకు నివేదికను ఈ శ్వేతపత్రం ప్రస్తావించింది. 2007లో భారత స్థూల జాతీయ ఉత్పత్తిలో నల్లధనం 23.2 శాతంగా ఉందని ప్రపంచబ్యాంకు పేర్కొన్న సంగతిని ఈ శ్వేతపత్రం ఉటంకించింది.  అయితే దేశంలో రూ. 45 లక్షల కోట్ల నల్లధనం ఉండవచ్చునని ఎస్.బి.ఐ ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. 
 
ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోగడ (2015 మే 5) రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ వాషింగ్టన్ కు చెందిన "గ్లోబర్ ఫైనాన్స్ ఇంటిగ్రిటీ" వెల్లడించిన దానిని బట్టి 2012లో రూ.6 లక్షల కోట్ల మేరకు నల్లధనం దేశం దాటిందని చెప్పారు. స్విస్, యూకే, స్పెయిన్ వంటి దేశాలేవీ నల్లధనం దాచుకున్నవారి అకౌంట్ల వివరాలు వెల్లడించడం లేదంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు కూడా. National Institute of Public Finance and Policy (NIPFP), National Council of Applied Economic Research (NCAER), National Institute of Financial Management (NIFM)  వంటి సంస్థలు నల్లధనంపై అందించే సమాచారాన్ని పరిశీలిస్తున్నామని జైట్లీ వెల్లడించారు. అంతే తప్ప నల్లధనంపై ప్రభుత్వం వద్ద ఇతమిత్థమైన సమాచారం ఏదీ లేదని స్పష్టం చేశారు. ఇలాంటి అయోమయంలో ఏకంగా చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని ఎలా రద్దుచేశారో ఎవరికీ తెలియదు. అందుకే ఇది చివరికి నీడతో యుద్ధంలాగా తయారైంది.
 
నకిలీ నోట్ల అంచనాలో లోటుపాట్లు!
అవినీతితో పాటు నకిలీ కరెన్సీని అరికట్టేందుకు కూడా పెద్దనోట్ల రద్దు జరిగిందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.  ఇంతకీ దేశంలో నకిలీ నోట్ల శాతం ఎంత? దీనిపై కూడా ప్రభుత్వం వద్ద సరైన లెక్కలు లేవు.  2015 లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ - కోల్ కతా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థలో రూ.400 కోట్ల నకిలీ కరెన్సీ చలామణిలో ఉంది. ఇది మొత్తం దేశం బడ్జెట్ (రూ.19.78 లక్షల కోట్లు) లో  0.025 శాతం.  ఏటా 70 కోట్ల నకిలీ నోట్లు ఆర్థిక వ్యవస్థలోకి వస్తున్నాయని కూడా ఆ అధ్యయనం పేర్కొంది.  NIA (National Investigation Agency) పర్యవేక్షణలో Indian Statistical Institute (ISI) ఈ అధ్యయనం నిర్వహించింది. ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ రాజ్యసభలో లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2016 ఆగస్టులో ఈ విషయం వెల్లడించారు.
 
2015లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం 1,78,022 నకిలీ 1000 రూపాయల నోట్లను, 2,99,524 500 రూపాయల నోట్ల జప్తుచేశారు. నకిలీనోట్లలో ఎక్కువ భాగం పాకిస్థాన్ లో తయారై బంగ్లాదేశ్ గుండా,  ఇతర హవాలా మార్గాల ద్వారా భారతదేశంలోకి వస్తున్నాయి. మన దేశం పాలిట పెద్ద బెడదగా తయారైన టెర్రరిజానికి ఇవి ఊపిరిపోస్తున్న సంగతి కూడా వాస్తవమే. నిజంగా ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగితే ఈ నకిలీ కరెన్సీని అరికట్టటం కష్టసాధ్యమేమీ కాదు. భారతదేశం ముద్రించే నోట్ల కోసం అమెరికా, యుకే వంటి దేశాలకు చెందిన పంపిణీదారుల నుంచి ఇంకు, పేపర్, సిల్వర్ త్రెడ్ వంటివి  దిగుమతి చేసుకుంటున్నాం. సదరు సప్లయర్లు పాకిస్థాన్‌కి చెందిన నకిలీ కరెన్సీ ముద్రణ దారులకు కూడా ఆ ముడి సరుకులను ఇస్తున్నారు. దీనివల్ల నకిలీనోట్లు పెరుగుతున్నాయి. రూ.2000 ముద్రణ లోనూ ఈ పరిస్థితి ఉండవచ్చు. కాబట్టి నకిలీనోట్ల సమస్యను నివారించడానికి దాని మూలాలను తుదకంటా తుడిచిపెట్టాలి.  ప్రభుత్వం తలుచుకుంటే ఈ సమస్యను పెద్ద నోట్ల రద్దు లేకుండా కూడా పరిష్కరించవచ్చు.  కానీ ప్రభుత్వం కొండనాలికకు మందేస్తే... సామెతను గుర్తుకు తెచ్చేలాగా వ్యవహరించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement