రూ.6 కోట్ల బ్యాంకు లావాదేవీలు లభ్యం
ఇంకా కొనసాగుతున్న విచారణ
చిత్తూరు (అర్బన్): చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల సమాచారాన్ని అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. మతిమరపుతో కొందరు అధికారులు ప్రభుత్వం నుంచి వచ్చిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను బ్యాంకుల్లో వేసి మరచిపోయిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం ‘సాక్షి’ పత్రికలో చిత్తూరు గజనీలు అదే శీర్షికన వార్త ప్రచురితమైన విషయం విదితమే. ఈ క్రమంలో సోమవారం తొలి రోజు పలు చిట్టా పుస్తకాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం 42 బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు వేసినట్లు అందులో పేర్కొన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.8 కోట్లకుగానూ రూ.6 కోట్లు ఏయే బ్యాంకుల్లో ఎఫ్‌డీలు వేశారనే విషయాన్ని ప్రాథమికంగా తెలుసుకున్నారు.
ఈ వివరాలను అధికారులు బయటకు తీశారు. గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా కార్పొరేట్ బ్యాంకుల్లో భారీ ఎత్తున ఎఫ్‌డీలు వేసినట్లు కూడా ఆధారాలు లభించాయి. మరో జాతీయ బ్యాంకులో ఏటా జరగాల్సిన లావాదేవీలకన్నా, ఎక్కువ మొత్తంలో ఎఫ్‌డీలు వేసి, మళ్లీ వాటిని వెనక్కు తీసేశారు. మొత్తం మీద చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో రూ.8 కోట్లకు పైగా ఎఫ్‌డీలు ఎక్కడో బ్యాంకుల్లో పెట్టేసి, ప్రస్తుతం వెతుకులాట ప్రారంభించిన అధికారులకు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటం కాస్త ఉపశమనాన్ని కలిగించే విషయమే. మరిన్ని వివరాల కోసం అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ వారంలోనే ఎఫ్‌డీలకు సంబంధించి పూర్తి వివరాలను వెలికితీయనున్నారు.