చిత్తూరు గజినీలు
రూ.8 కోట్ల ఎఫ్‌డీల వివరాలు మాయం
ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసి మరచిన వైనం
బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న అధికారులు
చిత్తూరు కార్పొరేషన్‌లో అధికారుల నిర్వాకం
విచారణకు ఆదేశించిన కమిషనర్
మతిమరుపు ఎంతటి వ్యక్తినైనా పరీక్షిస్తుంది. స్కూటర్ తాళాలు, ఏటీఎం పిన్ నంబర్లు మరికొన్నింటిని సాధారణంగా అందరూ మరిచిపోతుంటారు. కానీ చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయ అధికారులు ఏకంగా డబ్బులు ఎక్కడ డిపాజిట్ చేశారనే విషయం మరచిపోయారు. ఆ మొత్తం తక్కువేం కాదు.. రూ.8 కోట్లకు పైనే.
చిత్తూరు (అర్బన్): మునిసిపాలిటీలకు పథకాల, పనుల అమలు కోసం ప్రతి ఆర్థిక సంవత్సరం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలవుతుంటాయి. కొన్నిసార్లు పనులు పూర్తి కానప్పుడు నిధులను బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) రూపంలో నిల్వ చేస్తారు. చిత్తూరు కార్పొరేషన్‌కు గత ఐదేళ్లలో పలు పథకాల కింద వచ్చిన కోట్ల రూపాయలను ఎఫ్‌డీలు వేసిన అధికారులు ప్రస్తుతం అవి ఎక్కడున్నాయోనని వెతుక్కుంటున్నారు. కార్పొరేషన్ కార్యాలయ గణాంక పరిశీలకులు ఎఫ్‌డీల వివరాలు లేవని గుర్తించి విషయాన్ని కమిషనరు దృష్టికి తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగు చేసింది.
సొంత లాభం కోసమే
2010 నుంచి 2013 ఆర్థిక సంవత్సరాల్లో చిత్తూరు కార్పొరేషన్‌కు భారీ మొత్తంలో నిధులు వచ్చాయి. వీటిలో ప్రధానంగా చిత్తూరులోని చెరువులను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ఆర్థిక నిధుల నుంచి ఒకసారి రూ.1.30 కోట్లు, మరోసారి రూ.2.13 కోట్లు వచ్చాయి. అలాగే నీటి సరఫరాకు 26 సార్లు రూ.5 కోట్ల నిధులు వచ్చాయి. వీటిని అప్పటి అధికారులు సరిగా ఉపయోగించుకోలేదు. దీంతో అధికారుల పలు జాతీయ బ్యాంకులతో పాటు కార్పొరేట్ బ్యాంకుల్లో రూ.8.30 కోట్లను డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసేటప్పుడు కొందరు అధికారులు నిబంధనల్ని కాదని స్వలాభం కోసం కార్పొరేట్ బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో నగదు ఎఫ్‌డీలు వేశారు. ఇలా డిపాజిట్ చేయడం వల్ల అప్పట్లో పనిచేసిన ఉద్యోగులకు కొన్ని బ్యాంకులు ఎలాంటి ష్యూరిటీ లేకుండానే వ్యక్తిగత రుణాలు మంజూరు చేశాయి. అయితే కార్పొరేషన్ నుంచి ఎంత మొత్తంలో నిధులు, ఏయే బ్యాంకుల్లో ఉన్నాయనే వివరాలను ఓ పుస్తకంలో నమోదుచేస్తారు. ఈ చిట్టాల పుస్తకం కొన్ని రోజులకు కనిపించకుండా పోయింది. ఇటీవల డిపాజిట్ల వివరాలను పరిశీలిస్తున్న సదరు అధికారి అసలు విషయం గుర్తించి ఎఫ్‌డీలపై ఆరా తీశారు.
ఉరుకులు పరుగులు..
చిట్టా పుస్తకం కనపడకపోవడంతో ఎంత మొత్తం నిధులు ఎక్కడెక్కడ ఎఫ్‌డీలు వేశారనే వివరాలు అధికారులకు తెలియలేదు. ఎఫ్‌డీలపై నెలకోకసారి బ్యాంకులు వడ్డీ ఇస్తాయి. అలా వద్దకునుంటే ఏడాదికోసారి ఎఫ్‌డీలను విత్‌డ్రా చేసుకునే సమయంలో అసలు, వడ్డీ కలిపి తీసుకోవచ్చు. ఈ విషయాన్ని అధికారులు మరిచిపోవడంతో చాలా బ్యాంకుల్లో ఐదేళ్లుగా వేసిన ఎఫ్‌డీలు వాటంతట అవే ఆటో రెన్యువల్స్ అయిపోతున్నాయి. అధికారుల్లో జవాబుదారీతనం లోపించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.