పట్టణ జీవితానికి పాతిక సూత్రాలు
కేంద్రం ప్రతిపాదనలు, నేషనల్ డిక్లరేషన్‌కు రాష్ట్రాల ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆనందమయ పట్టణ జీవితానికి 25రకాల కార్యక్రమాలతో కేంద్రం ప్రతిపాదించిన ‘పట్టణ సుపరిపాలన-అందరికీ ఇళ్లు’ అన్న నేషనల్ డిక్లరేషన్‌ను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆమోదించాయి. ‘పట్టణ పాలన, అందరికీ ఇళ్లు-అవకాశాలు, సవాళ్లు’ అన్న అంశంపై ఢిల్లీలో జరిగిన సదస్సులో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఈ సూత్రాలను ప్రతిపాదించారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలు, అల్పాదాయ వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, వితంతువులు.. ఇలా, అందరికీ 2022 నాటికి ఇళ్ల నిర్మాణంకోసం నడుంబిగించాలని భేటీలో నిర్ణయిం చారు. సదస్సులో వెంకయ్యనాయుడు ప్రారంభోపన్యాసం చేస్తూ, పట్టణాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పనిచేయాలన్నారు. పట్టణా ల్లో ఇళ్ల కొరత పరిష్కారం లక్ష్యంగా ‘అందరికీ ఇళ్లు’ అన్న పథకానికి కేంద్రం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రజలనుంచి పన్నుల ద్వారా వసూలయ్యే మొత్తాన్ని ప్రజలకు గుణాత్మక సేవలకోసం వినియోగించేలా పట్టణాల స్థానిక స్వపరిపాలనా సంస్థలను పటిష్టంగా రూపొందించాలని, ప్రజలకు ఉన్నత ప్రమాణాలతో సేవలందించినపుడు మరిన్ని పన్నులు చెల్లించేందుకు ప్రజలు కూడా వెనుకాడరని ఆయన చెప్పారు.
నిర్మాణ ప్రక్రియలో నిర్లక్ష్యం కారణంగా భవనాలు కుప్ప కూలిన సంఘటనలు జరిగినపుడు, అందుకు సంబంధిత అధికారులను బాధ్యులను చేసేలా తగిన నిబంధనలను చట్టంలో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. గృహనిర్మాణానికి అవసరమయ్యే సరుకుల ద్వారా వచ్చే పన్నులను ఒక ఎస్క్రో ఖాతాలోకి చేర్చి ఆ మొత్తంతో ‘అందరికీ ఇళ్లు’ కార్యక్రమం అమలుచేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అనీ, ప్రయివేటు భాగస్వామ్యంతో కూడా పనులు చేపడతామని చెప్పారు. త్వరలోనే రియల్ ఎస్టేట్ నియంత్రణ బిల్లు, ఆటోమేటేడ్ సింగిల్ విండో ఆమోద వ్యవస్థ బిల్లు తెస్తామన్నారు. పట్టణ మౌలిక సదుపాయాలకోసం ‘అందరం కలిసి కట్టుగా టీం ఇండియా స్ఫూర్తిగా పనిచేయాలి’ అని కేంద్ర మంత్రి అన్నారు.