గిరిజన యువత ఉపాధికి ప్రత్యేక ప్రణాళిక : ఐటీడీఏ పీఓ దివ్య
భద్రాచలం : గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ఐటీడీఏ ద్వారా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని పీఓ దివ్య అన్నారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలపై సంబంధిత అధికారులతో ఐటీడీఏ ప్రాంగణంలోని పీఎంఆర్సీ భవనంలో ఆమె శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎక్స్‌ప్లోజివ్ విజట్‌లో భాగంగా హైదరాబాద్ వెళ్లొచ్చిన గిరిజన యువత ఏయే అంశాలు తెలుసుకున్నారనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకున్నారు.
నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూరల్ టెక్నాలజీ పార్కులో వివిధ చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు, కంప్యూటర్, సోలార్ సిస్టమ్ తయారీ, వర్మీ కంపోస్టు ద్వారా కృత్రిమ ఎరువుల తయారీ, విస్తరాకులు, కలర్ పేపర్లు తయారీ తదితర అంశాలపై నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించే విధంగా పర్యటన సాగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ప్రతి సోమవారం ఐటీడీఏలో నిర్వహించే గిరిజన దర్బార్‌కు ఏజెన్సీ మండలాల నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు.
తమకు ఉపాధి, ఉద్యోగ అకాశాలు కల్పించాలంటూ గిరిజన యువత వస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులో లేని దృష్ట్యా గిరిజన నిరుద్యోగ యువతకు ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు ఉపాధి శిక్షణలను ఇప్పించాల్సిన అవసరం ఉందన్నారు. పీంఆర్డీఎఫ్ ద్వారా దీనికి తగిన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. వారి ఆసక్తి మేరకు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వటం ద్వారా గిరిజన యువత స్వయం ఉపాధిని పొందే అవకాశం ఉంటుందన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో పీఎంఆర్‌డీఎఫ్ చైతన్య, ఏపీఎం జాబ్స్ వెంక య్య తదితరులు పాల్గొన్నారు.