national road
-
హైవే..పూర్తికాదే!
పాల్వంచరూరల్: పేరుకు జాతీయ రహదారి నిర్మాణమే అయినప్పటికీ.. పనులు మాత్రం మారుమూల బీటీ రోడ్లకంటే నెమ్మదిగా సాగుతున్నాయి. విజయవాడ నుంచి ఇబ్రహీం పట్టణం వరకు చేపట్టిన 30వ నంబర్ జాతీయ రహదారి జిల్లాలో భద్రాచలం, సారపాక వద్ద ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 161 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల్లో మన జిల్లాల్లోనే నిర్మితమవుతోంది. ఆ తర్వాత ఖమ్మం జిల్లా మీదుగా రోడ్డు ఉంటుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలిపే ప్రతిష్టాత్మక పనుల్లో ప్రస్తుతం కొత్తగూడెం, పాల్వంచ సమీపంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వాస్తవానికి 2017 జూలై నాటికే అందుబాటులోకి రావాల్సి ఉండగా.. అగ్రిమెంట్‌ను అధికారులు పొడిగించి మార్చి నెలఖారునాటికి గడువునిచ్చారు. అయినా..కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ జాప్యం నెలకొంది. మూడో ప్యాకేజీ కింద రూ.229 కోట్ల వ్యయంతో సారపాక నుంచి రుద్రంపూర్ వరకు 42 కిలోమీటర్ల పనులు సాగుతున్నాయి. 35 కిలోమీటర్ల వరకు పూర్తి చేశారు. ఇంకా 7 కిలోమీటర్ల నిర్మాణం మిగిలి ఉంది. ముర్రేడు, గోదుమ వాగులపైన రెండు వంతెనలు నిర్మించాలి. పెద్దమ్మగుడి సమీపంలో కల్వర్టు పూర్తి చేయాల్సి ఉంది. ఇల్లెందు క్రాస్ రోడ్డు నుంచి సింగరేణి అతిథి గృహం వరకు ఒకవైపు రహదారిని మాత్రం పోశారు. మరో వైపునకు మోక్షం లభించట్లేదు. లక్ష్మీదేవిపల్లి నుంచి రామవరం గోదుమవాగు వరకు రోడ్డు నిర్మాణం పనులు ఇంకా మొదలు కాలేదు. రోడ్డు పక్కన డ్రెయినేజీలు కూడా అస్తవ్యస్తంగానే ఉన్నాయి. 54 కిలోమీటర్లకు గాను కేవలం 24 కిలోమీటర్లే పూర్తయింది. మూడు కల్వర్టులు కట్టాల్సి ఉంది. పెద్దమ్మ గుడి వద్ద ఎప్పుడో..? కొత్తగూడెం పట్టణ పరిధి, పెద్దమ్మగుడి ఆలయం ఎదుటి నుంచి ఇంకా నిర్మాణ పనులను ప్రారంభించలేదు. కేవశవాపురం – ఇందిరానగర్ కాలనీ వరకు ఒకవైపు వరస రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ఆరోగ్యమాత చర్చి వద్ద నుంచి సీ–కాలనీ గేటు, బస్టాండ్ సెంటర్ మీదుగా దమ్మపేట సెంటర్ వరకు పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణం చేయలేదు. దీంతో వాహనాలు డైవర్షన్‌పై రాకపోకలు సాగిస్తున్నాయి. ఒకవైపు రోడ్డు ఎత్తుగా, మరోవైపు లోతట్టుగా ఉండడం, దుమ్ము లేస్తుండడంతో ప్రమాదకరంగా మారింది. పెద్దమ్మ గుడి సమీపంలోని జగన్నాథపురంలో ఒకవైపు నిర్మాణం కోసం గుంతలు తవ్వి నిర్లక్ష్యంగా వదిలేశారు. రహదారికి ఇరువైపులా సైడ్‌కాల్వలు అస్తవ్యస్తంగా వదిలేశారు. హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయనేలేదు. కేవలం ఇసుక బస్తాలను కొన్నిచోట్ల, మరికొన్ని చోట్ల డ్రమ్‌లను ఉంచి..బాధ్యులు చేతులు దులుపుకున్నారు. రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నవభారత్ నుంచి ఇల్లెందు క్రాస్‌రోడ్డు వరకూ పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. అసంపూర్తి పనులతో సమీప కాలనీలకు రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. డివైడర్‌కు సంబంధించి అక్కడక్కడా నాసిరకం పనులతోనే మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఫుట్‌పాత్ నిర్మాణ పనులు ఇంకా దారుణంగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు. పుట్‌పాత్‌లో ఇటుకలు, సిమెంట్ వేసి..ఆ తర్వాత క్యూరింగ్ చేయకపోవడం, పటిష్టంగా నిర్మించని కారణంగా అప్పుడే దెబ్బతింటోంది. పనులు నిలిపిన చోట హెచ్చరిక బోర్డులు, రాత్రి వేళ గుర్తించేలా రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. గడువును పొడిగించాల్సి ఉంది.. జాతీయ రహదారి నిర్మాణ పనులు ఆపకుండా నిర్వహిస్తున్నాం. ఇంకా 7 కిలోమీటర్ల రహదారి మాత్రం నిర్మించాల్సి ఉంది. కొత్తగూడెం పట్టణ పరిధి, పెద్దమ్మగుడి వద్ద పూర్తి చేస్తాం. మిగిలిన రెండు బ్రిడ్జిలను కట్టిస్తాం. డిసెంబర్ వరకు గడువును నిర్దేశించాం. అయితే..ఇంకా కొంతకాలం పడుతుందని, ఈ గడువు పెంచాలని ప్రతిపాదనలు పంపాం. – వెంకటేశ్వరరావు, ఈఈ, నేషనల్ హైవే -
మందు మృగాలు చంపేశాయి..
♦ మద్యం మత్తులో మందుబాబుల ఆగడం ♦ సినిమాకు వెళుతున్న ముగ్గురు బాలురపై ప్రతాపం ♦ చేతికి చిక్కిన బాలుడ్ని రోడ్డుపై తిప్పి తిప్పి చితకబాదిన వైనం ♦ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై ఘోరం ♦ చికిత్స పొందుతూ బాలుని మృతి.. ♦ పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు గుంటూరు జిల్లా ,కుంచనపల్లి(తాడేపల్లి రూరల్) : ఫూటుగా మద్యం సేవించిన మందుబాబులు బుధవారం అర్ధరాత్రి ఓ బాలుడి పట్ల అతి క్రూరంగా వ్యవహరించారు. తన అభిమాన సినీహీరో సినిమా బెనిఫిట్ షో చూద్దామని ఇద్దరు స్నేహితులతో కలసి బయల్దేరిన ఆ బాలుడ్ని ఆపి.. విచక్షణారహితంగా కొట్టారు. కసితీరా చితకబాదాక రోడ్డుమీద వదిలేసి వెళ్లారు. తీవ్రగాయాల పాలైన బాలుడ్ని స్థానికులు గమ నించి ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతిచెందాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై తాడేపల్లి బైపాస్ రోడ్డులో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. తాడేపల్లి పట్టణ పరిధిలోని పాత ఒకటోవార్డులో నివాసముండే శ్రీకాంత్(16) ఇళ్లల్లో సీలింగ్ పని చేస్తుంటాడు. మెకానిక్‌గా పనిచేసే ఉం డవల్లికి చెందిన అన్వర్, సెల్‌పాయింట్‌లో పనిచేసే ఎస్కే ఆజూలు అతని స్నేహితులు. బుధవారం పగలంతా తమ పనులకు వెళ్లి వచ్చిన ముగ్గురు బాలురూ తమ అభిమాన నటుడైన జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా బెనిఫిట్ షో చూసేందుకని అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఆజూ ద్విచక్ర వాహనంపై మంగళగిరికి బయల్దేరారు. ఒకటోవార్డు నుంచి బయల్దేరి.. కుంచనపల్లి బకింగ్‌హామ్ కరకట్ట నుంచి అరవింద స్కూల్ మీదుగా బైపాస్ రోడ్డు చేరుకున్నారు. అయితే అప్పటికే ఫుల్లుగా మద్యం తాగి రోడ్డుపక్కనే కూర్చుని ఉన్న నలుగురు యువకులు వారిని ఆపి, ‘‘పిల్ల వెధవల్లారా.. అర్ధరాత్రి రోడ్లపై మీకేంట్రా పని? దొంగల్లాగా కనిపిస్తున్నారు..’’ అంటూ దాడికి దిగారు. వారిని విచక్షణారహితంగా కొట్టారు. భయపడిన ఆజూ, అన్వర్లు శ్రీకాంత్‌ను వదిలేసి పరుగు తీశారు. దీంతో తమ చేతికి చిక్కిన శ్రీకాంత్‌పై మద్యంబాబులు ప్రతాపం చూపారు. అంతేగాక అతడ్ని వెంటపెట్టుకుని ఆ నలుగురు యువకులు మరో ఇద్దరితో కలసి ఓల్డ్ టోల్గేట్ ఎదురుగా ఉన్న రోడ్డులోని వైన్స్ వద్దకు తీసుకెళ్లి అక్కడా చితకబాదారు. వైన్స్‌లో మద్యం తీసుకుని తాగాక మళ్లీ కుంచనపల్లిలోని కీర్తి ఎస్టేట్ వద్దకు బాలుడ్ని తీసుకెళ్లి కొట్టారు. మరలా అక్కడ్నుంచీ అభినందన రోడ్డులోకి తీసుకెళ్లి మరోసారి చితకబాది వదిలేసి పోయారు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్‌ను గమనించిన స్థానికులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులకూ సమాచారమిచ్చారు. అయితే గురువారం మధ్యాహ్నం వరకు బాలుడి వివరాలు పోలీసులకూ తెలియలేదు. ఈలోగా తన కొడుకు కనపడకపోవడంతో ఆందోళన చెందిన శ్రీకాంత్ తల్లి సబిత ఆజూ, అన్వర్‌లను నిలదీయడంతో విషయం తెలిసింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ గురువారం మధ్యాహ్నం మూడుగంటల సమయంలో మృతిచెందాడు. అతని తల్లి విషాదంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన కుంచనపల్లికి చెందిన ఆరుగురు యువకులు గంధం నరేష్, చెన్నంశెట్టి గోపాలకృష్ణ, అమరా వేణు, మిరియాల నవీన్, గుంటముక్కల శేషు, మిరియాల వెంకటేశ్‌లను గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా కుంచనపల్లి గ్రామానికి చెందినవారేనని తెలిపారు. నార్త్‌జోన్ డీఎస్పీ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
వెంటాడిన మృత్యువు
♦ వంతెన గోడను బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడి మృతి ♦ మరొకరికి తీవ్ర గాయాలు ♦ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకువస్తుండగా ప్రమాదం ♦ విషాదంలో చినకొవ్వాడ లావేరు: బైక్‌పై ప్రయాణిస్తూ వంతెన గోడను ఢీకొట్టిన ఘటనలో రణస్థలం మండలం చినకొవ్వాడ గ్రామానికి చెందిన మైలపల్లి పోలయ్య(22) ప్రాణాలు కోల్పోయాడు. బైకు వెనుక కూర్చున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. లావేరు మండలం తాళ్లవలస సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి లావేరు ఎస్ఐ సీహెచ్ రామారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రణస్థలం మండలంలోని చినకొవ్వాడ గ్రామానికి చెందిన మైలపల్లి పోలయ్య తన బంధువు కారి రాములుతో కలిసి బుధవారం శ్రీకాకుళం పట్టణంలోని ఓ బ్యాంకుకు వెళ్లాడు. రూ.50 డ్రా చేసుకుని తిరిగి గ్రామానికి వస్తుండగా అదుపు తప్పి తాళ్లవలస సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న వంతెన గోడను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో పోలయ్య ఎగిరిపడటంతో తల, కాళ్లు, చేతులకు బలమైన గాయాలయ్యాయి. రాములు సైతం తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే లావేరు ఎస్ఐ రామారావు సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి క్షతగాత్రులిద్దరినీ 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడికి వెళ్లిన కాసేపటికే పోలయ్య మృతి చెందాడు. రాములు చికిత్స పొందుతున్నాడు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వెంటనే బాధిత కుటుంబ సభ్యులు రిమ్స్ ఆస్పత్రికి పరుగులు తీశారు. పోలయ్య మృతి వార్త తెలుసుకుని బోరున విలపించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే.. హెల్మెట్ ధరించకపోవడం వల్లే యువకుడి తలకు బలమైన గాయాలయ్యాయని పోలీసులు చెబుతున్నారు. వంతెనను ఢీకొట్టిన వెంటనే పోలయ్య రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయాలు తగిలి తీవ్ర రక్తస్రావం జరిగిందని, అదే హెల్మెట్ ధరించి ఉంటే అంతగా గాయాలు కావని అంటున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, సీఐలు తాళ్లవలస హైవేపై ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే శ్రీకాకుళం డీఎస్పీ భార్గవనాయుడు, జేఆర్‌పురం సీఐ రామకృష్ణలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును లావేరు ఎస్ఐ రామారావును అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అన్నారు. -
జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలి
హన్మకొండ: వరంగల్ ఖమ్మం రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ది చేయాలని మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి కోరారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఖమ్మం నుంచి కోదాడ, అదిలాబాద్ జిల్లాలో చెన్నూరు నుంచి గోదావరిఖని మీదుగా కాళేశ్వరం, చిట్యాల, పరకాల మీదుగా రేగొండ, కొడవటంచ, బాగిర్థిపేట వరకు జాతీయ రహదారిగా అభివృద్ది చేయాలని కోరారు. వారి వెంట పార్టీ నాయకుడు వి.పాపయ్య ఉన్నారు.