పాల్వంచ వద్ద జాతీయ రహదారిపై డివైడర్ పనులు నిలిచిన దృశ్యం , లక్ష్మీదేవిపల్లి వద్ద ప్రమాదకరంగా రోడ్డు
పాల్వంచరూరల్: పేరుకు జాతీయ రహదారి నిర్మాణమే అయినప్పటికీ.. పనులు మాత్రం మారుమూల బీటీ రోడ్లకంటే నెమ్మదిగా సాగుతున్నాయి. విజయవాడ నుంచి ఇబ్రహీం పట్టణం వరకు చేపట్టిన 30వ నంబర్ జాతీయ రహదారి జిల్లాలో భద్రాచలం, సారపాక వద్ద ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 161 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల్లో మన జిల్లాల్లోనే నిర్మితమవుతోంది. ఆ తర్వాత ఖమ్మం జిల్లా మీదుగా రోడ్డు ఉంటుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలిపే ప్రతిష్టాత్మక పనుల్లో ప్రస్తుతం కొత్తగూడెం, పాల్వంచ సమీపంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
వాస్తవానికి 2017 జూలై నాటికే అందుబాటులోకి రావాల్సి ఉండగా.. అగ్రిమెంట్‌ను అధికారులు పొడిగించి మార్చి నెలఖారునాటికి గడువునిచ్చారు. అయినా..కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ జాప్యం నెలకొంది. మూడో ప్యాకేజీ కింద రూ.229 కోట్ల వ్యయంతో సారపాక నుంచి రుద్రంపూర్ వరకు 42 కిలోమీటర్ల పనులు సాగుతున్నాయి. 35 కిలోమీటర్ల వరకు పూర్తి చేశారు. ఇంకా 7 కిలోమీటర్ల నిర్మాణం మిగిలి ఉంది. ముర్రేడు, గోదుమ వాగులపైన రెండు వంతెనలు నిర్మించాలి. పెద్దమ్మగుడి సమీపంలో కల్వర్టు పూర్తి చేయాల్సి ఉంది. ఇల్లెందు క్రాస్ రోడ్డు నుంచి సింగరేణి అతిథి గృహం వరకు ఒకవైపు రహదారిని మాత్రం పోశారు. మరో వైపునకు మోక్షం లభించట్లేదు. లక్ష్మీదేవిపల్లి నుంచి రామవరం గోదుమవాగు వరకు రోడ్డు నిర్మాణం పనులు ఇంకా మొదలు కాలేదు. రోడ్డు పక్కన డ్రెయినేజీలు కూడా అస్తవ్యస్తంగానే ఉన్నాయి. 54 కిలోమీటర్లకు గాను కేవలం 24 కిలోమీటర్లే పూర్తయింది. మూడు కల్వర్టులు కట్టాల్సి ఉంది.
పెద్దమ్మ గుడి వద్ద ఎప్పుడో..?
కొత్తగూడెం పట్టణ పరిధి, పెద్దమ్మగుడి ఆలయం ఎదుటి నుంచి ఇంకా నిర్మాణ పనులను ప్రారంభించలేదు. కేవశవాపురం – ఇందిరానగర్ కాలనీ వరకు ఒకవైపు వరస రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ఆరోగ్యమాత చర్చి వద్ద నుంచి సీ–కాలనీ గేటు, బస్టాండ్ సెంటర్ మీదుగా దమ్మపేట సెంటర్ వరకు పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణం చేయలేదు. దీంతో వాహనాలు డైవర్షన్‌పై రాకపోకలు సాగిస్తున్నాయి. ఒకవైపు రోడ్డు ఎత్తుగా, మరోవైపు లోతట్టుగా ఉండడం, దుమ్ము లేస్తుండడంతో ప్రమాదకరంగా మారింది. పెద్దమ్మ గుడి సమీపంలోని జగన్నాథపురంలో ఒకవైపు నిర్మాణం కోసం గుంతలు తవ్వి నిర్లక్ష్యంగా వదిలేశారు.
రహదారికి ఇరువైపులా సైడ్‌కాల్వలు అస్తవ్యస్తంగా వదిలేశారు. హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయనేలేదు. కేవలం ఇసుక బస్తాలను కొన్నిచోట్ల, మరికొన్ని చోట్ల డ్రమ్‌లను ఉంచి..బాధ్యులు చేతులు దులుపుకున్నారు. రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నవభారత్ నుంచి ఇల్లెందు క్రాస్‌రోడ్డు వరకూ పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. అసంపూర్తి పనులతో సమీప కాలనీలకు రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. డివైడర్‌కు సంబంధించి అక్కడక్కడా నాసిరకం పనులతోనే మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఫుట్‌పాత్ నిర్మాణ పనులు ఇంకా దారుణంగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు. పుట్‌పాత్‌లో ఇటుకలు, సిమెంట్ వేసి..ఆ తర్వాత క్యూరింగ్ చేయకపోవడం, పటిష్టంగా నిర్మించని కారణంగా అప్పుడే దెబ్బతింటోంది. పనులు నిలిపిన చోట హెచ్చరిక బోర్డులు, రాత్రి వేళ గుర్తించేలా రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.
గడువును పొడిగించాల్సి ఉంది..
జాతీయ రహదారి నిర్మాణ పనులు ఆపకుండా నిర్వహిస్తున్నాం. ఇంకా 7 కిలోమీటర్ల రహదారి మాత్రం నిర్మించాల్సి ఉంది. కొత్తగూడెం పట్టణ పరిధి, పెద్దమ్మగుడి వద్ద పూర్తి చేస్తాం. మిగిలిన రెండు బ్రిడ్జిలను కట్టిస్తాం. డిసెంబర్ వరకు గడువును నిర్దేశించాం. అయితే..ఇంకా కొంతకాలం పడుతుందని, ఈ గడువు పెంచాలని ప్రతిపాదనలు పంపాం. – వెంకటేశ్వరరావు, ఈఈ, నేషనల్ హైవే
Comments
Please login to add a commentAdd a comment