ఖమ్మం సిటీ : ఖమ్మం నగరపాలక సంస్థలో డివిజన్లను మళ్లీ పునర్విభజించాలని ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. నగరంలో 57 డివిజన్లు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ప్రక్రియను 31 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. కార్పొరేషన్ ఏర్పడి సుమారు రెండేళ్లవుతోంది. గత ఏడాది 50 డివిజన్లుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో 2001 జనాభా లెక్కల ప్రకారం నగరాన్ని రైల్వే, రోడ్డు మార్గాలు, చేరువులను పరిగణనలోకి తీసుకుని డివిజన్లను ఏర్పాటు చేశారు. ఆతర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. అయితే.. అప్పటికే 2011 జనాభా లెక్కలు విడుదల కావడంతో టీడీపీకి చెందిన చిరుమామిళ్ల నాగేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డివిజన్లు రద్దు చేయాలని, తిరిగి 2011 జనాభా లెక్కల ప్రకారం డివిజన్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న డివిజన్లు ఐదు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నయని, దీని వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని, నిధులు సైతం సరిగా ఖర్చు చేయలేమని పిటిషన్‌లో తెలిపారు. దీనిపై వాదనలు విన్న కోర్టు డివిజన్లను రద్దు చేస్తూ గత ఏడాది ఆక్టోబర్‌లో ఆదేశాలు జారీ చేసింది.
2011 జనాభా లెక్కల ప్రకారం తిరిగి డివిజన్లను ఏర్పాటు చేయాలని సీడీఎంఏను ఆదేశించింది. ఈ క్రమంలో కొన్ని పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈక్రమంలోనే సార్వత్రిక ఎన్నికల ముందు స్థానిక సంస్థలకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలు వచ్చాయి. అయితే.. ఖమ్మం కార్పొరేషన్‌కు డివిజన్లు పునర్విభజన జరగకపోవడంతో దీని ఎన్నికలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే వాయిదా పడిన ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి డివిజన్లతోపాటు మేయర్, వార్డుల రిజర్వేష్లు కూడా మారనున్నాయి.
పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్
Published Fri, Jul 11 2014 2:07 AM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
Advertisement