National Rural Development Agency
-
సచివాలయ వ్యవస్థ భేష్.. మిట్టర్‌సైన్ ప్రశంసలు
తిరుపతి రూరల్: రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ భేషుగ్గా ఉందని, గ్రామాల అభివృద్ధికి ఈ వ్యవస్థ వెన్నెముకగా నిలుస్తోందని జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ మిట్టర్‌సైన్ ప్రశంసించారు. తిరుపతి రూరల్ మండలం మల్లంగుంట పంచాయతీ సచివాలయాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. చిన్న పంచాయతీలో తొమ్మిది మంది సిబ్బంది విధులు నిర్వర్తించడం, నిత్యం ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. అత్యుత్తమ పరిపాలన వ్యవస్థగా సచివాలయాలను అభివర్ణించారు. ఈ మేరకు ఆయన సచివాలయంలోని సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని రాశారు. ఈ సందర్భంగా మిట్టర్ సైన్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి చేపడుతున్న చర్యలు అత్యుత్తమంగా ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రజలకు సత్వర సేవలను అందించేందుకు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది దోహదపడుతున్నారని తెలిపారు. తమ ఇంటికే వచ్చి వలంటీర్లు అందిస్తున్న సేవలను లబ్ధిదారులు ఈ సందర్భంగా ఏడీజీకి వివరించారు. అనంతరం సచివాలయం ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి అందిస్తున్న మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని మల్లంగుంట పంచాయతీలో మిట్టర్ సైన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జానకమ్మ, డీపీవో రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, డీఎల్డీవో సుశీలాదేవి, ఎంపీడీవో వెంకటనారాయణ, ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి మధుసూదనరావు పాల్గొన్నారు. -
28న హైదరాబాద్‌లో డా. ఖాదర్ వలి ప్రసంగాలు
‘సిరిధాన్యాలు – అమృతాహారం’ అనే అంశంపై ఈ నెల 28(ఆదివారం) ఉ. 10 గం. నుంచి మ. 1.30 గం. వరకు హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పారామం సంప్రదాయ వేదికలో ప్రగతి రిసార్ట్స్ రజతోత్సవాల సందర్భంగా జరిగే సభలో ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ప్రారంభోపన్యాసం చేస్తారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ డబ్ల్యూ.ఆర్.రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని ప్రగతి గ్రూప్ సీఎండీ డా. జీబీకే రావు తెలిపారు. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 84990 78294. అదేరోజు సా. 4 గం. నుంచి 7 గం. వరకు శిల్పారామం సంప్రదాయ వేదికలోనే డాక్టర్ ఖాదర్‌వలి దేశీ ఆహారంతో వ్యాధుల్లేని జీవనంపై ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 040–23395979. 29న మెహదీపట్నంలో.. వర్షాధారంగా సిరిధాన్యాలు సాగుచేసుకొని, మిక్సీతో శుద్ధి చేసుకొని తినటం ద్వారా ఆధునిక రోగాల నుంచి విముక్తి పొంది సంపూర్ణ ఆరోగ్యం పొందే పద్ధతులపై ఈనెల 29న సా. 5.30 గం. నుంచి 7.30 గం. వరకు హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారు. పిల్లర్ నం. 83 దగ్గర పల్లవి గార్డెన్స్ కొణిజేటి ఎన్‌క్లేవ్‌లో ఉచిత అవగాహన కార్యక్రమం జరుగుతుందని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 9676797777. -
గ్రామీణాభివృద్ధిలో మానవ వనరులే కీలకం
సాక్షి, హైదరాబాద్: గ్రామీణాభివృద్ధిలో మానవ వనరులే కీలకమని కేరళ ప్రభుత్వ అదనపు ప్రధానకార్యదర్శి పి.హెచ్.కురియన్ అన్నారు. శనివారం జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ)లో జరిగిన స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒడిశాలోని కలహందిలో పనిచేసిన సమయంలో తాను ఎదుర్కొన్న అను భవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కోర్సులు పూర్తిచేసిన 52 మందికి పట్టాలు ప్రదా నం చేశారు. కార్యక్రమంలో ఎన్ఐఆర్డీ (పీఆర్) డైరెక్టర్ జనరల్ డబ్లు్య.ఆర్.రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాధికా రస్తోగి, అసోసియేట్ ప్రొఫెసర్లు ఎ.దేవీప్రియ, ఆకాంక్షాశుక్లా పాల్గొన్నారు. -
నేటి నుంచే గ్రామీణ సాంకేతిక మేళా
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ)లో ఆరు రోజుల గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శనకు రూరల్ టెక్నాలజీ పార్కు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఆరు రోజుల పాటు 11వ గ్రామీణ సాంకేతిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఆర్డీ డెరైక్టర్ జనరల్ ఎం.వి.రావు తెలిపారు. గురువారం ఎన్ఐఆర్డీ ప్రధాన కార్యాలయంలో ఎం.వి.రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 13వరకు జరిగే మేళాలో 250 స్టాళ్లను అనుమతించామని.. రాష్ట్రం, దేశంలోని పలు ప్రాంతాల నుంచి హస్తకళలు, శాస్త్రసాంకేతిక ఉత్పత్తులు, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులు మేళాలో ప్రదర్శనకు రానున్నాయని తెలిపారు. 50 కొత్త ప్రయోగాలు సందర్శకులను ఆకట్టుకుంటాయని, సోలార్ గ్రైండర్ మిక్సర్ ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. ప్రతీ రోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గం టల వరకూ మేళా జరుగుతుందని, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు రావడానికి రవాణా సౌకర్యం కల్పించినట్టు రావు తెలిపారు. ఎన్ఐఆర్డీకి 12వ పంచవర్ష ప్రణాళికలో రూ. 500 కోట్లు కేటాయించారని, ఈ నిధులతో మారుమూల గ్రామాల యువతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రావు వివరించారు.