మల్లంగుంట సచివాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న మిట్టర్‌సైన్ తదితరులు
తిరుపతి రూరల్: రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ భేషుగ్గా ఉందని, గ్రామాల అభివృద్ధికి ఈ వ్యవస్థ వెన్నెముకగా నిలుస్తోందని జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ మిట్టర్‌సైన్ ప్రశంసించారు. తిరుపతి రూరల్ మండలం మల్లంగుంట పంచాయతీ సచివాలయాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. చిన్న పంచాయతీలో తొమ్మిది మంది సిబ్బంది విధులు నిర్వర్తించడం, నిత్యం ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమన్నారు.
అత్యుత్తమ పరిపాలన వ్యవస్థగా సచివాలయాలను అభివర్ణించారు. ఈ మేరకు ఆయన సచివాలయంలోని సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని రాశారు. ఈ సందర్భంగా మిట్టర్ సైన్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి చేపడుతున్న చర్యలు అత్యుత్తమంగా ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రజలకు సత్వర సేవలను అందించేందుకు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది దోహదపడుతున్నారని తెలిపారు.
తమ ఇంటికే వచ్చి వలంటీర్లు అందిస్తున్న సేవలను లబ్ధిదారులు ఈ సందర్భంగా ఏడీజీకి వివరించారు. అనంతరం సచివాలయం ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి అందిస్తున్న మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని మల్లంగుంట పంచాయతీలో మిట్టర్ సైన్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ జానకమ్మ, డీపీవో రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, డీఎల్‌డీవో సుశీలాదేవి, ఎంపీడీవో వెంకటనారాయణ, ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి మధుసూదనరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment