నత్త కన్నా చెత్తగా...
మందగమనంలో మంచినీటి పథకాలు
* పూర్తి అయ్యింది ఒక్కటే
* పనులు జరుగుతున్నవి ఎనిమిది
* ప్రారంభం కానివి నాలుగు
* రూ.131.8 కోట్లకు ఖర్చు చేసింది రూ.14.50 కోట్లే
* ఇదీ ఎన్ఆర్డీడబ్ల్యూపీ పనితీరు
ఏలూరు : జిల్లాలో ఏటా ఎన్ని మంచినీటి పథకాలకు కార్యాచరణ ప్రణాళికలు రచిస్తున్నా...ఆచరణలో మాత్రం సురక్షిత తాగునీరు అందరికీ అందని ద్రాక్షగానే మారుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం... స్థలాల కొరత... కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం...నిధుల లేమి వెరసి గుక్కెడు మంచినీటి కోసం పల్లెలు వెంపర్లాడాల్సిన దుస్థితే రాజ్యమేలుతోంది. ఎన్ని ప్రాజెక్టులున్నా పచ్చని పశ్చిమలో తాగునీటి కోసం ప్రజలు నోళ్లు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఉంటోంది. ఈ కోవలోకే జాతీయ గ్రామీణ తాగునీటి అభివృద్ధి కార్యక్రమం (ఎన్ఆర్డీడబ్ల్యూపీ) చేరింది. జిల్లాలో 256 గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీరందించేందుకు రూ.131.8 కోట్లతో చేపట్టిన మంచినీటి పథకాలు మందగమనంలోనే ఉంటున్నాయి.
ఇప్పటి వరకు కేవలం 10 శాతం లోపు నిధులే ఖర్చు అవ్వడంతో రానున్న వేసవి నాటికి పథకాలు ప్రజలకు అక్కరకొచ్చే అవకాశం తక్కువే. ఈ ఏడాదిలో రూ.14.49 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతంలో చేపట్టి ఇంకా పూర్తి కాని పనులను కూడా ఇందులో చూపిస్తున్నప్పటికీ అవి కూడా సంవత్సరాలు పట్టే వీలున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ, సమన్వయంతో నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో పనులన్నీ నత్తతో పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది సాధారణ ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు కొలువుతీరి పనులపై దృష్టి పెట్టేటప్పటికి దాదాపుగా కాలం ఇట్టే కరిగిపోయింది.
ఒక్కటే పూర్తి.... పురోగతి అంతంత మాత్రమే
జిల్లాలో ఎన్ఆర్డీడబ్ల్యూపీ కింద రూ.20 కోట్లతో చేపట్టిన ఉంగుటూరు మంచినీటి ప్రాజెక్టు ఒక్కటే పూర్తి అయినట్టు అధికారులు చెబుతున్నారు. ఉంగుటూరు మండలం నాచుగుంటలో నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ధర్మ చెరువు వద్ద రిజార్వాయర్ నిర్మాణం మందకొడిగా సాగుతోంది. దీని ద్వారా బాదంపూడి, వెల్లమిల్లి, నాచుగుంట, నీలాద్రిపురం గ్రామాలకు పైపులైన్ ద్వారా సురక్షిత మంచినీరు సరఫరా చేయాల్సి ఉంది. ఈ పథకానికి సుమారు రూ.6 కోట్లు మంజూరయ్యాయి. చింతలపూడి నియోజకవర్గంలోని కామవరపుకోట మండలంలో రూ.6.50 కోట్లతో ఐదు నివాసిత ప్రాంతాలకు నీరందించే ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.62 లక్షలే ఖర్చు చేశారు.
చింతలపూడి మండలంలో రూ.10 కోట్లతో చేపట్టి 10 ఊళ్లకు నీరివ్వాల్సిన ప్రాజెక్టుకు రూ.45 లక్షలు, తాడేపల్లిగూడెం మండలంలో రూ.17.50 కోట్లతో చేపట్టి 10 ఊళ్లకు నీరిచ్చే ప్రాజెక్టుకు రూ.3.51లక్షలు కేటారుుంచారు. తాళ్లపూడి మండలంలో రూ.6కోట్లతో 17 ఊళ్లకు నీరిచ్చే ప్రాజెక్టు పునాది దశలోనే ఉంది. నర్సాపురం, మొగల్తూరు మండలాల్లోని 39 ఊళ్లకు రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించాల్సిన నీటి పథకం పనులు రూ.1.13 కోట్ల మేర జరిగాయి. 2013 నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి కావాల్సిన పాలకొల్లు మండలంలోని లంకలకోడేరు మంచినీటి పథకం పనులు 10 శాతం కూడా పూర్తి కాలేదు. రూ.3 కోట్ల వ్యయంతో 45 గ్రామాలకు నీరందించాల్సిన ఈ ప్రాజెక్టు పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తణుకు మండలం మండపాకతో పాటు మరో 14 ఊళ్లకు నీరందించే రూ.19 కోట్ల ప్రాజెక్టులో ఇప్పటి వరకు రూ.50 వేలే ఖర్చు చేశారు. అత్తిలి గ్రామంలో 30 ఊళ్లకు నీరిందించే రూ.10 కోట్ల ప్రాజెక్టుకు కేవలం రూ.42వేలు ఖర్చు చేశారు.
ప్రారంభించాల్సిన నాలుగు ప్రాజెక్టులివే
నర్సాపురం మండలంలోని కొప్పర్రు, వేములదీవి గ్రామాల మీదుగా 27 ఊళ్లకు తాగునీటిని అందించే ప్రాజెక్టుకు రూ.20 కోట్లతో, తాళ్లపూడి మండలంలోని 16 ఊళ్లకు నీరందించేందుకు చేపట్టే ప్రాజెక్టుకు రూ.20 కోట్లతో అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. వీటికి టెండరు పిలవాల్సి ఉంది. ఉప్పునీటి సమస్య నివారణకుగాను భీమవరం మండలంలోని 13 హేబిటేషన్లకు రూ.9 కోట్లతో నీరందించే ప్రాజెక్టుకు భూసేకరణ పూర్తికావాల్సి ఉంది. ఇక్కడే తీర ప్రాంతంలో రూ.4 కోట్లతో నాలుగు ఊళ్లకు నీరిచ్చే ప్రాజెక్టు భూసేరణ పూర్తి అయింది. పనులు చేపట్టడానికి టెండర్లు పిలిచారు. వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది.