వాళ్లకు అది కూడా తెలీదట!
అమెరికన్లు అందరికంటే మేధావులు, వారి జనరల్ నాలెడ్జి, ఐక్యూ గొప్పగా ఉంటాయి, అందుకే ఆ దేశం అగ్రరాజ్యంగా నిలబడుతోంది అన్న అభిప్రాయం చాలామందికి ఉంటుంది. కానీ ఆ దేశస్థుల అమాయకత్వం ఏ స్థాయిలో ఉంటుందో వివరించింది ఒక సర్వే. దాని ప్రకారం... 26 శాతం మంది అమెరికన్లకు కనీసం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందన్న ప్రాథమిక అంశం గురించి కూడా తెలీదని తేలింది!
అమెరికాకే చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ప్రతి రెండేళ్లకోసారి ఇలా జనాల్లోని అమాయకత్వాన్ని వెలికితీసే పని పెట్టుకొంటుంది. అంటే బేసిక్ సైన్స్ గురించి కొన్ని ప్రశ్నలను అడుగుతూ మేధస్సు స్థాయిని నిర్ధారిస్తూ ఉంటుంది. ఈసారి చేసిన సర్వేలో పై విషయాన్ని కనిపెట్టిందన్నమాట!
భూగోళశాస్త్రం గురించి అడిగిన ప్రాథమిక ప్రశ్నలకు చాలామంది అమెరికన్లు సమాధానం చెప్పలేకపోయారని, భూభ్రమణం అంటే కూడా వారికి సరైన అవగాహన లేదని సర్వేయర్లు పేర్కొన్నారు. మన సౌరకుటుంబంలో ఎన్ని గ్రహాలున్నాయి, వాటి పేర్లు ఏమిటి, భూమికి ఇతర గ్రహాలకు గల ప్రధానమైన తేడాలు ఏమిటి, చంద్రుడు గ్రహమా, నక్షత్రమా, ఉపగ్రహమా... ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకు
సమాధానాలు తెలియక అమెరికన్లు నీళ్లు నమిలారట.
‘అందరూ చదువుకున్నవాళ్లనే అడిగాం, వారికి ప్రాథమిక అంశాల గురించి కనీస అవగాహన లేకపోవడం విషాదకరం’ అని సర్వే నిర్వహించిన ఫౌండేషన్ వ్యాఖ్యానించడం గమనార్హం!