National Weightlifting Championship
-
జాతీయ వెయిట్ లిఫ్టింగ్‌లో ఆంధ్ర జట్లకు చాంపియన్‌షిప్
ఏలూరు రూరల్/సత్తెనపల్లి: జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఆంధ్ర జట్టు లిఫ్టర్లు చాంపియన్‌షిప్ సాధించారని రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి బడేటి వెంకట్రామయ్య గురువారం తెలిపారు. పంజాబ్‌లోని పటియాలలో 3 రోజుల పాటు నిర్వహించిన పోటీల్లో రాష్ట్రానికి చెందిన బాలబాలికలు అద్భుత ఫలితాలు సాధించారని చెప్పారు. జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో 6 బంగారు,8 వెండి పతకాలు సొంతం చేసుకున్నారని వివరించారు. ఫలితంగా సబ్ జూనియర్ బాలుర జట్టు విన్నర్స్ ట్రోఫీ కైవసం చేసుకోగా, బాలికల జట్టు రన్నరప్‌గా నిలిచిందని వెల్లడించారు. పతకం సాధించిన వారిలో విజయనగరం, విశాఖ, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల లిఫ్టర్లు ఉన్నట్లు వివరించారు. జట్టు కోచ్‌గా సీతాభవాని ఉన్నారు. పావని ప్రతిభ.. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఏజీకేఎం కళాశాలలో బీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థిని కేవీ పావని కుమారి జాతీయ సబ్ జూనియర్, జూనియర్ బాలికల వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రతిభ కనబర్చింది. 45 కేజీల విభాగంలో స్నాచ్‌లో 69 కేజీలు, క్లీన్, జెర్క్‌లో 82 కేజీలతో మొత్తం 151 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం కైవసం చేసుకుంది. జూనియర్స్ విభాగంలో 151 కేజీల బరువు ఎత్తి రజత పతకం కైవసం చేసుకుంది. పావనికుమారిని కళాశాల పాలకవర ్గఅధ్యక్షుడు అన్నం సత్యనారాయణ అభినందించారు. -
ప్రియదర్శినికి కాంస్యం
కోల్‌కతా: జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ వెయిట్‌లిఫ్టర్ ప్రియదర్శిని కాంస్య పతకం సాధించింది. మంగళవారం జరిగిన మహిళల 49 కేజీల విభాగంలో ప్రియదర్శిని మొత్తం 168 కేజీల (స్నాచ్‌లో 70+క్లీన్ అండ్ జెర్క్‌లో 98) బరువెత్తి మూడో స్థానంలో నిలిచింది. మీరాబాయి జాతీయ రికార్డు: 49 కేజీల విభాగంలోనే భారత స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మణిపూర్‌కు చెందిన 25 ఏళ్ల మీరాబాయి మొత్తం 203 (స్నాచ్‌లో 88+ క్లీన్ అండ్ జెర్క్‌లో 115) కేజీలు బరువెత్తి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 201 కేజీలతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. రైల్వేస్‌కే చెందిన మరో వెయిట్‌లిఫ్టర్ సంజిత చాను మొత్తం 185 కేజీలు (స్నాచ్‌లో 80+క్లీన్ అండ్ జెర్క్‌లో 105) బరువెత్తి రజత పతకాన్ని దక్కించుకుంది. -
22 నుంచి జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్
విశాఖ స్పోర్ట్స్: జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ లోగోను వాల్తేర్ రైల్వే డివిజనల్ మేనేజర్ ముకుల్ శరణ్ మాథుర్ మంగళవారం ఆవిష్కరించారు. డీఆర్ఎం కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టోర్నీ ప్రారంభ కార్యక్రమం ఈనెల 21న, పోటీలు ఈనెల 22 నుంచి 28వ తేదీ వరకు రైల్వే స్పోర్ట్స్ ఇండోర్ ఎన్‌క్లేవ్‌లో జరగనున్నాయన్నారు. ఈ చాంపియన్‌షిప్‌లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు(ఆర్ఎస్పీబీ)జట్టు పాల్గొంటుందన్నారు. వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య మెన్, వుమెన్ కేటగిరిల్లో నిర్వహించే చాంపియన్‌షిప్ బాధ్యతను ఈస్ట్ కోస్ట్ రైల్వే.. వాల్తేర్‌కు అప్పగించిందన్నారు. ఆర్ఎస్పీబీ తరపున మూడు వేలకు పైగా అథ్లెట్లు 29 క్రీడాంశాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పాల్గొంటున్నారన్నారు. సర్వీసెస్, రైల్వేస్, పోలీస్ తదితర బోర్డులతోపాటు 29 రాష్ట్రాలకు చెందిన మెన్, వుమెన్ వెయిట్‌లిఫ్టర్లు ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొనున్నారన్నారు. ఈ సమావేశంలో ఈకోర్సా వాల్తేర్ క్రీడాధికారి సాకీర్హుస్సేన్, ఆర్ఎస్పీబీ ప్రతినిధులు రవీందర్ కుమార్, ప్రవీణ్‌కుమార్, ఆనందకుమార్ తదితరులు పాల్గొన్నారు. హాజరుకానున్న అంతర్జాతీయ మెడలిస్ట్లు రైల్వేస్టేడియంలో జరగనున్న నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత మిరాబాయ్ చానుతోపాటు పలువురు కామన్వెల్త్ పాల్గొన్న క్రీడాకారులు పూనమ్ యాదవ్, గురురాజ, రాహుల్, గురుదీప్‌సింగ్, ప్రదీప్ సింగ్,విశ్వాస్ ఠాకూర్, స్వాతిసింగ్, ఎం.సంతోషి పాల్గొనున్నారు. గతేడాది వరకు ఎనిమిది వెయిట్ కేటగిరిల్లోనే జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు నిర్వహించగా ఈసారి పది వెయిట్ కేటగిరిల్లో మెన్, వుమెన్‌కు పోటీలు జరగనున్నాయి. గతంలో మహిళా పోటీలు 48 కేజీల వెయిట్ నుంచి జరగ్గా ఈసారి 45 కేజీల వెయిట్ నుంచే ప్రారంభం కానున్నాయి. మెన్లో 55 కేజీల వెయిట్ నుంచి ప్రారంభమై 109+ కేజీల వరకు పది వెయిట్స్‌లో... మహిళలకు 45 కేజీల వెయిట్ నుంచి 87+ కేజీల వెయిట్ వరకు పది వెయిట్స్‌లో పోటీలు నిర్వహించనున్నారు. మెన్ 81 కేజీల వెయిట్లో అత్యధికంగా 19 మంది పోటీపడనుండగా వుమెన్ 49 కేజీల వెయిట్లో అత్యధికంగా 19 మంది విజేతగా నిలిచేందుకు పోటీపడనున్నారు. -
అలీమాకు 3 స్వర్ణాలు
జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పట్నా: జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. ఇక్కడ జరుగుతున్న ఈ పోటీల జూనియర్ మహిళల విభాగంలో ఎస్కే అలీమా బేగం 3 స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. 69 కేజీల కేటగిరీలో స్నాచ్‌లో 83 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 100 కిలోలు ఎత్తిన అలీమా... ఓవరాల్‌గా 183 కేజీల బరువుతో మూడో స్వర్ణాన్ని గెలుచుకుంది. ఇదే విభాగం 58 కేజీల కేటగిరీలో ఇ.దీక్షితకు 3 రజత పతకాలు లభించాయి. దీక్షిత స్నాచ్‌లో 74 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 92 కిలోలు, ఓవరాల్‌గా 166 కిలోల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. జూనియర్ మహిళల కేటగిరీలోనే 75 కేజీలో విభాగంలో ఎన్.లలితకు 3 కాంస్యాలు దక్కాయి. స్నాచ్‌లో 66 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 78 కిలోలతో ఓవరాల్‌గా 144 కిలోల బరువు ఎత్తి లలిత మూడు పతకాలు తన ఖాతాలో వేసుకుంది. మరో వైపు యూత్ బాలికల (63 కేజీలు) విభాగంలో జి. లలితకు 2 రజతాలు, 1 కాంస్యం దక్కాయి. స్నాచ్ లో 68 కిలోలు ఎత్తి మూడో స్థానంలో నిలిచిన లలిత... క్లీన్ అండ్ జర్క్ (87 కిలోలు), ఓవరాల్ (155 కిలోలు)లో మూడో స్థానం సాధించింది.