The National Womens Federation
-
‘టర్కీలో మాదిరిగానే ఉద్యమిద్దాం’
ప్రభుత్వాలు తమ తప్పుల్ని కప్పి పుచ్చుకుంటూ, ఇతరులు చేసిన చిన్నపాటి తప్పుల్ని పెద్దగా చూపిస్తూ ప్రజల మెప్పు పొందుతున్నాయని పలు సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. మద్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోతుంటే అదే మద్యంపై వస్తున్న ఆదాయాన్ని ప్రభుత్వం ఆస్వాదిస్తోందని మండిపడ్డారు. టర్కీలో మాదిరిగా ఏకతాటిపైకి వచ్చి మద్యంపై ఉద్యమం చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు పోటు కళావతి, మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హిమాయత్‌నగర్‌లోని మఖ్థూం భవన్లో భారతజాతీయ మహిళా సమాఖ్య(ఎన్ఎఫ్ఐడబ్ల్యూ), బాలల హక్కుల సంఘం ఆధ్వర్యంలో ‘ప్రాణాంతక మద్యపానం, ప్రభుత్వ చర్యలు-ప్రజల బాధ్యత’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి హైమావతి, ర్యాపిడ్ ప్రజామార్చ్ ఛైర్మన్, ప్రముఖ న్యాయవాది జి.శారదాగౌడ్, బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు, ఎ.ఐ.పి.ఎస్.ఒ. రాష్ట్ర కార్యదర్శి కె.వి.ఎల్ మాట్లాడుతూ మద్యం మహమ్మారి వల్ల ఏటా వంద మందిలో 30మంది మహిళలు భర్తలను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 242 మద్యం దుకాణాలకు ఎవరూ టెండర్లు వేయలేదని ఆ దుకాణాల మద్యాన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లకు ఇచ్చిన దౌర్భాగ్యపు ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వ ప్రొద్బలంతో నేడు పెన్నుల ద్వారా హుక్కాను సేవించి చిన్నారులు మద్యానికి బానిసలవుతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా మద్యాన్ని నిషేధించేలా పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎప్పుడో ఒకసారి కాకుండా నిరంతరం ఉద్యమాలు, ధర్నాలు చేసి ప్రభుత్వం కళ్లు తెరిపించి మద్యం దుకాణాలను మూసివేలా ఉద్యమం చేయాలన్నారు. ఖమ్మం జిల్లా ముత్తగూడెంలో ఏ విధంగా సంపూర్ణంగా మద్యాన్ని నిషేధించారో అలాగ, రాష్ట్రమంతటా చేసేందుకు ఒక్కటై పోరాడాలని తీర్మానించారు. -
ఆ మూడు రాష్ట్రాలే ఆదర్శం
మద్యాన్ని నిషేధించాలంటూ జాతీయ మహిళా సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడింది. వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం హిమాయత్‌నగర్ వై జంక్షన్లో ప్రభుత్వ దిష్టిబ్మొను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్.రాధిక, యాదమ్మ, కె.ధర్మెంద్ర, నెర్లకంటి శ్రీకాంత్, టి.సత్యప్రసాద్‌లు మాట్లాడుతూ మద్యం ద్వారానే రాష్ట్రానికి అత్యధిక ఆదాయం వస్తోందని ప్రభుత్వమే ప్రకటించడం సిగ్గుచేటన్నారు. బిహార్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు విశాల్, సతీష్, చైతన్య యాదవ్, లక్ష్మణ్, సాయినాధ్ తదితరులు పాల్గొన్నారు. -
'హామీలు అమలు చేయనివాడు మగాడే కాదు'
విజయవాడ: కేరళలో ఒక మనిషి హామీ ఇస్తే అమలు చేసి తీరాల్సిందే. లేకపోతే మనిషిగానే కాదు అసలు మగాడిగానే భావించరని ఏపీ సీఎం చంద్రబాబు నుద్దేశించి జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనిరాజా ఘాటుగా విమర్శించారు. ఆదాయం కోసం ప్రజలను తాగుబోతులుగా మారుస్తున్నారని ఆమె మండిపడ్డారు. నగరంలోని హనుమంతరాయ గ్రంథాలయంలో శుక్రవారం మద్యపాన నిషేదంపై జరిగిన సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సుకు దేశంలోని 27 మహిళా సంఘాలు హాజరయ్యాయి. ఈ సదస్సులో పాల్గొన్న సీపీఎం మహిళా నాయకురాలు బృందాకారత్ మాట్లాడుతూ..జన్మభూమిని మద్యం భూమిగా చంద్రబాబు నాయుడు మార్చేశారని విమర్శించారు. ఆదాయం కోసం మద్యాన్ని వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు.