అలా కొట్టడం సహజ ప్రతిచర్యట!
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం నేపథ్యంలో ఢిల్లీలోని పటియాల కోర్టు ఆవరణలో విద్యార్థులు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులపై దాడి జరిగింది. ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ సైతం ఓ వ్యక్తిని కొడుతూ మీడియా కంట పడ్డారు. ఈ ఘటన గురించి ఆయన బుధవారం వివరణ ఇస్తూ అది సహజమైన ప్రతిచర్య అని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఆయన ఏమన్నారంటే..
'కోర్టు బయట ఓ వ్యక్తి పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తుండటం నాకు వినిపించింది. అంతేకాకుండా నా నెత్తిమీద ఎవరో బలంగా కొట్టారు. దాంతో నేను కూడా చేయి చేసుకున్నాను. ఎవరైనా నన్ను కొట్టినా, తలమీద బాదినా నేను చూస్తూ ఊరుకుండాలా? తిరిగి కొట్టకొడదా' అని పేర్కొన్నారు. వామపక్ష కార్యకర్తపై తాను చేసిన దాడి సహజమైన ప్రతి చర్య మాత్రేనని ఆయన పేర్కొన్నారు. 'నన్ను కొట్టిపారిపోతున్న వ్యక్తిని వెంటాడి పట్టుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో మీరందరికీ తెలిసిందే' అని ఆయన చెప్పారు.
ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా కార్యక్రమం నిర్వహించిన వివాదంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్‌ను దేశద్రోహం కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతన్ని కోర్టులో ప్రవేశపెట్టే సందర్భంగా మంగళవారం పటియాల కోర్టు ఎదుట ఘర్షణలు, దాడులు చోటుచేసుకున్నాయి.