నవయుగ నటులు
‘ఇవేమైనా ఆర్చేవా తీర్చేవా.. ఎందుకొచ్చిన నాటకాలర్రా...’ నాటకరంగం పీక్ స్టేజ్‌లో ఉన్న కాలంలోనే వినిపించిన డైలాగ్ ఇది. నానాటికీ ప్రాభవం కోల్పోతున్న రంగస్థలంపైకి రావడానికి అడుగులు పడటమే భాగ్యం అయిపోయిన ఈ రోజుల్లో.. మేమున్నాం అంటున్నారు కుర్రకారు. ఓ వైపు చదువుకుంటూనే కళలపై దృష్టి సారిస్తున్నారు. తొలిసారి ఓ పౌరాణిక నాటకంతో తమ ప్రతిభ చాటారు భవన్స్ వివేకానంద కాలేజ్ విద్యార్థులు. బుధవారం రవీంద్రభారతిలో ధర్మవీర్ భారతి రాసిన ‘అంధయుగ్’ నాటకాన్ని ప్రదర్శించి అందరి మన్ననలు అందుకున్నారు.
- కోన సుధాకర్‌రెడ్డి
అంధయుగ్ ఓ పౌరాణిక నాటకం. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత చరిత్రను వివరిస్తుంది. ఈ నాటకం వేయాలంటే.. మాటల్లో గాంభీర్యం వినిపించాలి. అభినయంతో అదరగొట్టాలి. స్మార్ట్ ఫోన్లు.. ఫేస్‌బుక్‌లు.. వాట్స్ యాప్‌లతో రోజూ కబుర్లాడే ఈ కాలేజ్ ఫ్రెండ్స్ ఇవన్నీ చేయడం వెనుక పెద్ద పరిశ్రమే ఉంది. పుస్తకాలతో కుస్తీ పడుతూనే.. రాజీ పడకుండా నాటకం స్క్రిప్ట్‌ను ఔపోసనపట్టారు. శిక్షణ తీసుకున్నారు. అరంగేట్రంలోనే తమ ఆంగికవాచకాభినయాలతో అందరి ప్రశంసలు అందుకున్నారు.
అశ్వత్థామ ఆగ్రహ..
కురుక్షేత్ర సంగ్రామం పూర్తి కావడంతో ఈ కథ మొదలవుతుంది. యుద్ధం ముగిశాక పాండువంశ నాశనానికి అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగిస్తాడు. ఈ సమయంలో ధృతరాష్ట్రుడు, శ్రీకృష్ణుడు.. వంటి మహామహులు కూడా అతనిని అడ్డుకోరు. ఇదే ఇతివృత్తంతో నాటకం సాగుతుంది. కురుక్షేత్ర యుద్ధ ప్రభావం, దాని ఫలితాలను ఇందులో ప్రదర్శించారు. హింసాత్మక సంఘటనలు మానవీయ విలువలు తగ్గించేవే అని నాటక సారాంశం. పురాణోక్తమైన ఈ నాటకాన్ని నేటి సమాజానికి అన్వయిస్తూ భవన్స్ వివేకానంద విద్యార్థులు ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
అన్నీ తామై..
అలహాబాద్‌కు చెందిన ప్రఖ్యాత రచ యిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత ధర్మవీర్ భారతి అంధయుగ్ నాటకాన్ని హిందీలో రాశారు. భారత్-పాక్ విభజన సమయంలో ఇది రూపుదిద్దుకుంది. పౌరాణిక నాటకంగా ప్రశస్తి పొందిన అంధయుగ్ దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ఎన్నో వేదికలపై ప్రదర్శితమైంది. భవన్స్ విద్యార్థులు అన్నీ తామై ఈ నాటకాన్ని రక్తి కట్టించారు. డెరైక్టర్‌గా డిగ్రీ విద్యార్థి కృష్ణ చైతన్య, అసిస్టెంట్ డెరైక్టర్‌గా శ్వేత వ్యవహరించారు. లైటింగ్, సౌండింగ్, విజువల్ హెల్ప్, లైవ్ మ్యూజిక్ అన్నీ వారే నిర్వహించారు. కళాశాల లెక్చరర్ల ప్రోత్సాహం వీరికి అదనపు బలమైంది.
గర్వంగా ఉంది..
గాంధారి పాత్రను వేసినందుకు చాలా గర్వంగా ఉంది. భర్త అంధుడని.. తనూ లోకాన్ని చూడకూడదని కళ్లకు గంతలు కట్టుకుంటుంది. ఆమెలోని సద్గుణాలు ఈ తరానికి ఆదర్శం కావాలి.
- పి.ఆకాంక్ష, బీఏ, సెకండియర్
ఎంత కష్టం..
ధృతరాష్ట్రుడిగా నటించడం కత్తి మీద సామే. అంధుడిగా అభినయించడం కష్టంగా అనిపించింది. మొదటిసారైనా మా నటనకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మరువలేను. ముందు ముందు మరింత మెరుగ్గా నటిస్తాను.
- డి.హేమంత్ గోపాల్, బీఏ, థర్డ్ ఇయర్
ఆ గుణాలు నాకు రావాలి..
నేను స్టేజ్ ఎక్కడం ఇదే తొలిసారి. ధర్మరాజు పాత్ర వేయడం గొప్ప అనుభూతినిచ్చింది. 130 రోజులుగా ప్రాక్టీస్ చేశాను. ధర్మరాజులోని సద్గుణాలు కొన్నయినా నాకు అలవడితే అంతే చాలు.
- కిషన్, బీఏ, సెకండియర్.
నాలుగు నెలలుగా
అశ్వత్థామ పాత్ర కోసం నాలుగు నెలలుగా రిహార్సల్స్ చేశాను. నా శక్తి మేరకు నటించాను. డ్రామా చూసిన సహచరులు అభినందించడం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. లెక్చరర్ల ప్రోత్సాహం మరువలేనిది.
- వినయ్ సింగ్, బీబీఏ ఫైనల్ ఇయర్.