Navy Chief Sunil Lanba
-
అస్త్రాలన్నీ ప్రయోగిస్తాం
న్యూఢిల్లీ: మరో ఉగ్రదాడి జరిగితే తిప్పికొట్టేందుకు అన్ని అస్త్రాలను సిద్ధంగా ఉంచుకుంటామని భారత్ ప్రకటించింది. పాకిస్తాన్ భూభాగంలో ఆవాసం పొందుతున్న ఉగ్రమూకలపై విరుచుకుపడే సామర్థ్యం ఉందని చాటుకోవడానికే బాలకోట్లో వైమానిక దాడులకు దిగామని స్పష్టతనిచ్చింది. జైషే మహ్మద్ శిక్షణా శిబిరంపై యుద్ధం ముగిసిందని, పాకిస్తాన్ భూభాగం నుంచి ఇంకా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకునేలా ఆ దేశంపై ఒత్తిడి పెంచడమే తమ తదుపరి లక్ష్యమని పేర్కొంది. ‘ఉగ్రవాదుల మౌలిక వసతులపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తాం. ఆ దేశ కొత్త నాయకత్వం మాటలకు పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం’ అని పాకిస్తాన్ నూతన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఫిబ్రవరి 27న భారత్‌పై వైమానిక దాడికి దిగినప్పుడు పాకిస్తాన్ ఎఫ్–16 యుద్ధ విమానాన్ని వినియోగించిన సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా అధికారులకు అందజేశారని భారత్ తెలిపింది. మంగళవారం దోవల్‌తో ఫోన్లో మాట్లాడిన అమెరికా భద్రతా సలహాదారు జాన్ బోల్టన్..జైషే చీఫ్ మసూద్ అజహర్‌ను నిషేధిత జాబితాలో చేర్చేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తామని తెలిపారు. అలాగే, యుద్ధ విమానాలను పాకిస్తాన్ దుర్వినియోగం చేయడంపై అమెరికా దర్యాప్తు చేస్తుందని ఆశిస్తున్నామని భారత్ పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్తాన్ అన్ని దేశాలను అభ్యర్థించిందని, కానీ సమస్య ఇండో–పాక్‌ది కాదని, ఉగ్రవాదానిది అని అంతర్జాతీయ సమాజానికి అర్థమయ్యేలా చెప్పామని తెలిపింది. మసూద్ అజహర్ పాకిస్తాన్లో నివసిస్తున్నందున అతనిపై నిషేధం విధిస్తే ఆ దేశానికి ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాకిస్తాన్ నిర్బంధంలోకి తీసుకున్న తరువాత అన్ని దేశాలు తమకే మద్దతుగా నిలిచాయని, అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో పాకిస్తాన్ అభినందన్‌ను వెంటనే విడుదల చేసిందని తెలిపింది. మరోవైపు, బాలాకోట్ వైమానిక దాడి నేపథ్యంలో నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ తన బలగాలను పెంచుకుంటోంది. అంతర్జాతీయ సరిహద్దు వెంట రాడార్లను క్రియాశీలకం చేసి, ఆయుధాగారాలు ఎల్లవేళలా పనిచేయాలని ఆదేశాలిచ్చింది. భారత జలాంతర్గామిని అడ్డుకున్నాం: పాక్ నేవీ భారత జలాంతర్గామి తమ జలాల్లోకి రాకుండా నిరోధించామని పాకిస్తాన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి మార్చి 4న తీసినట్లుగా భావిస్తున్న ఓ వీడియోను విడుదల చేసింది. పాకిస్తాన్ నేవీ దళం ప్రత్యేక నైపుణ్యాలు ప్రదర్శించి విజయవంతంగా భారత జలాంతర్గామి రాకను నిలువరించిందని పేర్కొంది. శాంతియుత విధానంలో భాగంగా భారత జలాంతర్గామిని తాము లక్ష్యంగా చేసుకోకుండా విడిచిపెట్టామని పాక్ నేవీ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ ఘటన నుంచి భారత్ పాఠాలు నేర్చుకుని శాంతి దిశగా నడవాలని సూచించారు. అయితే పాకిస్తాన్ ఆరోపణల్ని భారత్ ఖండించింది. పాక్ నేవీ తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోమని స్పష్టం చేసింది. జాతీయ తీర ప్రాంత భద్రతకే బలగాల్ని మోహరించామని భారత నేవీ తెలిపింది. సుఖోయ్‌కి ‘స్పైస్’ సుఖోయ్–30ఎంకేఐ యుద్ధ విమానాలకు ఇజ్రాయెల్‌లో తయారైన స్సైస్–2000 రకం బాంబులను అమర్చేందుకు విమానాలకు అవసరమైన మార్పులు చేస్తున్నామని భారత వైమానిక దళ అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మిరేజ్–2000 విమానాలకు స్పైస్–2000 బాంబులను అమర్చే వెసులుబాటు ఉంది. బాలాకోట్ దాడిలో ఈ విమానాలనే వినియోగించారు. స్పైస్–2000 బాంబులకు లేజర్ ద్వారా మార్గనిర్దేశనం చేయవచ్చు. ‘సముద్ర’ దాడుల ముప్పు ఉంది: నేవీ చీఫ్ సముద్ర మార్గం గుండా దేశంలోకి చొరబడి దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని నేవీ చీఫ్ సునీల్ లాంబా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పక్కా సమాచారం తమకు అందిందని తెలిపారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఇండో–పసిఫిక్ రీజినల్ డైలాగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..భారత్‌ను అస్థిరపరచాలనుకుంటున్న ఓ దేశ మద్దతుతోనే పుల్వామా ఉగ్రదాడి జరిగిందని పరోక్షంగా పాకిస్తాన్‌ను దుయ్యబట్టారు. ఉగ్రవాదం అంతర్జాతీయ స్థాయికి చేరడంతో ముప్పు మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ఆసియాలో వేర్వేరు రూపాల్లో ఉగ్రదాడులు జరిగాయని, కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ ముప్పు నుంచి తప్పించుకున్నాయని పేర్కొన్నారు. శత్రు దేశ ప్రభుత్వ మద్దతుతో కూడిన ఉగ్రవాద ముప్పు భారత్‌కు అధికంగా ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ పాక్ వెళ్లి లెక్కించుకోవచ్చు: రాజ్‌నాథ్ ధుబ్రి(అస్సాం): పాక్‌లోని బాలాకోట్‌లో చేపట్టిన వైమానిక దాడిలో ఎందరు ముష్కరులు హతమయ్యారో రేపోమాపో తెలుస్తుందని హోం మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ఈ దాడిపై విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, అవసరమైతే కాంగ్రెస్ అక్కడికి వెళ్లి మృతదేహాల సంఖ్యను లెక్కించుకోవచ్చని చురకలంటించారు. వైమానిక దళం బాంబులు జారవిడవడానికి ముందు ఆ ప్రాంతంలో 300 సెల్ఫోన్లు పనిచేస్తున్నట్లు జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(ఎన్టీఆర్వో) గుర్తించిందని తెలిపారు. ఆ సెల్ఫోన్లను చెట్లు వాడుతున్నాయా? అని ఎద్దేవా చేసిన రాజ్‌నాథ్ ఎన్టీఆర్వోను కూడా నమ్మరా? అని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు రాజకీయాలు చేయొచ్చు కానీ, దేశ నిర్మాణానికి కాదని హితవు పలికారు. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో అధునాత ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను రాజ్‌నాథ్ మంగళవారం ప్రారంభించారు. అది సైనిక చర్య కాదు చెన్నై: బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై జరిపిన వైమానిక దాడులపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా స్పందించారు. వైమానిక దాడులు సైనిక చర్య కాదని.. ఈ దాడిలో బాలాకోట్ సహా పరిసర ప్రాంతాల్లోని సాధారణ ప్రజలెవరికీ నష్టం కలగలేదని స్పష్టం చేశారు. దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు, శిక్షకులు, సీనియర్ కమాండర్లు మరణించారని మాత్రమే విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పారని, ఫలానా సంఖ్య అని వెల్లడించలేదని ఆమె గుర్తు చేశారు. దీనినే ప్రభుత్వ ప్రకటనగా భావించాలని సూచించారు. కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్ గ్రామంలో మంగళవారం మిలిటెంట్లు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ధ్వంసమైన తమ ఇంటి వద్ద రోదిస్తున్న స్థానికులు. సుమారు 12 గంటలు కొనసాగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక పౌరుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. నియంత్రణ రేఖ వెంట మూడు చోట్ల పాకిస్తాన్ మోర్టార్లతో దాడికి పాల్పడటంతో ఒక సైనికుడు గాయపడ్డాడు. -
సముద్ర మార్గం ద్వారా భీకర దాడులకు పాక్ స్కెచ్
సాక్షి, న్యూఢిల్లీ : సముద్ర మార్గం ద్వారా దేశంలోకి చొచ్చుకువచ్చి భారత్‌లో విధ్వంసకర దాడులు చేపట్టేందుకు ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం నేడు ప్రపంచ శాంతి సుస్ధిరతలకు పెను సవాల్ విసురుతోందని, ఈ మహమ్మారిని నియంత్రించేందుకు అంతర్జాతీయ సమాజం ఒక్కటై పోరాడాలని ఆయన కోరారు. గత కొన్నేళ్లుగా ఇండో పసిఫిక్ ప్రాంతం భిన్నరూపాల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఇండో పసిఫిక్ రీజినల్ డైలాగ్‌లో ఆయన మాట్లాడుతూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోందని నేవీ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్లో మనం మూడు వారాల కిందట ఉగ్రవాదుల భీకర దాడిని చూశామని పుల్వామా ఘటనను ఆయన ప్రస్తావించారు. భారత్‌ను అస్థిరపరిచేందుకు పొరుగు దేశం ఉగ్రవాదులను ప్రేరేపిస్తోందని పరోక్షంగా పాకిస్తాన్‌పై విమర్శలు గుప్పించారు. సముద్ర మార్గం ద్వారా దేశంలోకి చొచ్చుకువచ్చి ఉగ్రవాదులు భారత్‌లో అలజడి సృష్టించవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయని చెప్పారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించేందుకు భారత సాయుధ దళాలు సంసిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. -
నేవీలోకి త్వరలో 56 యుద్ధనౌకలు
న్యూఢిల్లీ: భారత నావికాదళంలోకి త్వరలోనే 56 కొత్త యుద్ధనౌకలు, ఆరు జలాంతర్గాములు చేరనున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా తెలిపారు. సోమవారం నావికాదళ దినోత్సవం(నేవీ డే) సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లాంబా మాట్లాడుతూ.. ‘2050 నాటికి 200 యుద్ధనౌకలు, 500 సొంత యుద్ధ విమానాలతో భారత నేవీ ప్రపంచస్థాయి నౌకాదళంగా తయారవుతుంది’ అని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని వేర్వేరు షిప్‌యార్డుల్లో 32 నౌకలు, జలాంతర్గాములు నిర్మాణంలో ఉన్నాయన్నారు. వీటిని అదనంగా తాజాగా మరో 56 యుద్ధనౌకలు, 6 జలాంతర్గాముల చేరికకు కేంద్రం పచ్చజెండా ఊపిందని వెల్లడించారు. చైనా, పాక్‌తో ద్విముఖ పోరు సంభవిస్తే నేవీ ఎలా ఎదుర్కొంటుందన్న మీడియా ప్రశ్నకు..‘పాక్ నేవీ కంటే మనం చాలాముందున్నాం. ఇక హిందూ మహాసముద్రం పరిధిలో చైనాపై మనదే పైచేయిగా ఉంది’ అని పేర్కొన్నారు. భారత త్రివిధ దళాలకు ఉమ్మడి అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్–సీడీఎస్)ని నియమించాలన్న ప్రతిపాదనకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో అంగీకారం కుదిరిందనీ, త్వరలోనే ఈ విషయాన్ని రక్షణ శాఖకు నివేదిస్తామని లాంబా అన్నారు. రిలయన్స్‌కు షాకిచ్చిన నేవీ.. ఐదు ఆఫ్‌షోర్ పెట్రోలింగ్ నౌకలను నిర్ణీత సమయంలోగా అందించలేకపోయిన రిలయన్స్ నేవల్ ఇంజనీరింగ్ లిమిటెడ్(ఆర్ఎన్ఈఎల్)పై భారత నేవీ కొరడా ఝుళిపించింది. కాంట్రాక్టు సందర్భంగా రిలయన్స్ సమర్పించిన బ్యాంకు గ్యారెంటీని నేవీ స్వాధీనం చేసుకుంది. ఈ విషయమై నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా స్పందిస్తూ..‘రిలయన్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం. కాంట్రాక్టును రద్దుచేయాలా? వద్దా? అనే విషయమై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని తెలిపారు. నౌకల నిర్మాణానికి రూ.3,200కోట్ల కాంట్రాక్టు దక్కించుకున్న పిపవావ్ డిఫెన్స్, ఆఫ్‌షోర్ ఇంజనీరింగ్ సంస్థను 2016లో ఆర్ఎన్ఈఎల్ కొనుగోలు చేయడం తెల్సిందే. -
కేరళ మన జన్మభూమి..
తిరువనంతపురం : వరదలతో తల్లడిల్లిన కేరళలో సహాయ పునరావస చర్యలు ముమ్మరవుతున్న క్రమంలో రాష్ట్రాన్ని నావికా సిబ్బంది జన్మభూమిగా నౌకాదళ అధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా అభివర్ణించారు. ‘హిందూ మహాసముద్రం మన కర్మభూమి అయితే..కేరళ మన జన్మభూమి‘ అని నేవీ చీఫ్ పేర్కొన్నారు. ఇక సహాయ పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నవారికి, నిర్వాసితులకు అవసరమైన సరుకులు, నిత్యావసరసామ్రాగితో ఐఎన్ఎస్ దీపక్ నౌక ఆదివారం కొచ్చికి చేరుకుంది. మరోవైపు ఐఎన్ఎస్ మైసూర్ కూడా కేరళకు బయలుదేరింది. మరోవైపు నేవీ సదరన్ నావల్ కమాండ్ రెస్క్యూ టీంలు జెమిని బోట్లు, డైవర్స్, ఇతర సామాగ్రితో గత కొన్ని రోజులుగా వరద నీటిలో చిక్కుకున్న వందలాది మందిని రక్షించిన సంగతి తెలిసిందే. -
నేవీ చీఫ్ లేఖపై కేంద్రంలో కదలిక
సాక్షి,న్యూఢిల్లీ: అమర జవాన్ల పిల్లల విద్యపై వెచ్చించిన మొత్తం రీఎంబర్స్‌మెంట్‌పై పరిమితిని సమీక్షించాలని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం సైనికుల పిల్లల విద్యపై నెలకు రూ 10,000 వరకూ మాత్రమే గరిష్టంగా రీఎంబర్స్మెంట్ కోరేందుకు పరిమితి విధించారు. ఈ ఏడాది జులైలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ప్రభుత్వంపై త్రివిధ దళాల నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏడవ వేతన సంఘ సిఫార్సుల్లో భాగంగా ప్రభుత్వం రీఎంబర్స్‌మెంట్‌పై పరిమితి విధించింది. అంతకుముందు అమర జవాన్లు, వికలాంగులైన సైనికుల పిల్లల ట్యూషన్ ఫీజును స్కూళ్లు, కాలేజీలు సహా వృత్తి విద్యా సంస్ధల్లో పూర్తిగా మాఫీ చేసేవారు. ఈ అంశాన్ని నేవీ చీఫ్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంతో తన నిర్ణయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ సమీక్షించే అవకాశం ఉంది. తమ ప్రభుత్వం సాయుధ బలగాల సంక్షేమం కోసం పనిచేస్తుందని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సమీక్షిస్తుందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
‘ఎలా ఎదుర్కొనేందుకైనా మేం సిద్ధం’
-
‘ఎలా ఎదుర్కొనేందుకైనా మేం సిద్ధం’
న్యూఢిల్లీ: భారత నావికా దళం ఎప్పుడంటే అప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉందని నేవీ చీఫ్ సునీల్ లంబా అన్నారు. ఆదివారం నేవీ డే సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారత తీర ప్రాంతాల రక్షణకు తమ దళం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని, ఎలాంటి శత్రువుల వ్యూహప్రతివ్యూహాలనైనాన సమర్థంగా ఎదుర్కొంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశానికి తాము రక్షణ ఇవ్వగలమని తాము ఈ సందర్భంగా హామీ ఇస్తున్నామని అన్నారు. నేవీ డే సందర్భంగా త్రివిద దళాల చీఫ్‌లు ఒక చోట చేరారు. ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్, నేవీ చీఫ్ సునీల్ లంబా, వైమానిక దళ చీఫ్ అరూప్ రహా ఢిల్లీలో అమర జవానుల జ్యోతికి నివాళులు అర్పించారు. అనంతరం ఢిల్లీలోని పాఠశాల చిన్నారులతో కలిసి ఈ వేడుకను జరుపుకున్నారు. చిన్నారులతో తమ అనుభవాలు సాహసాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సైనిక విన్యాసాలు నిర్వహించనున్నారు.