
సాక్షి, న్యూఢిల్లీ : సముద్ర మార్గం ద్వారా దేశంలోకి చొచ్చుకువచ్చి భారత్‌లో విధ్వంసకర దాడులు చేపట్టేందుకు ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం నేడు ప్రపంచ శాంతి సుస్ధిరతలకు పెను సవాల్ విసురుతోందని, ఈ మహమ్మారిని నియంత్రించేందుకు అంతర్జాతీయ సమాజం ఒక్కటై పోరాడాలని ఆయన కోరారు.
గత కొన్నేళ్లుగా ఇండో పసిఫిక్ ప్రాంతం భిన్నరూపాల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఇండో పసిఫిక్ రీజినల్ డైలాగ్‌లో ఆయన మాట్లాడుతూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోందని నేవీ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్‌లో మనం మూడు వారాల కిందట ఉగ్రవాదుల భీకర దాడిని చూశామని పుల్వామా ఘటనను ఆయన ప్రస్తావించారు.
భారత్‌ను అస్థిరపరిచేందుకు పొరుగు దేశం ఉగ్రవాదులను ప్రేరేపిస్తోందని పరోక్షంగా పాకిస్తాన్‌పై విమర్శలు గుప్పించారు. సముద్ర మార్గం ద్వారా దేశంలోకి చొచ్చుకువచ్చి ఉగ్రవాదులు భారత్‌లో అలజడి సృష్టించవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయని చెప్పారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించేందుకు భారత సాయుధ దళాలు సంసిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment