sea route
-
చేపల పడవలో దేశాలే దాటారు
ముంబై: పరాయి దేశంలో పడరాని పాట్లు పడి, యజమాని పెట్టే హింసలు భరించలేక స్వదేశం వెళ్లే సాహసం చేశారు ముగ్గురు భారతీయులు. అనుకున్నదే తడవుగా యజమాని పడవనే తమ ప్రణాళికకు ప్రధాన ఆయుధంగా వాడుకున్నారు. ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా కువైట్ నుంచి బయల్దేరి సముద్ర మార్గం గుండా నేరుగా ముంబై తీర ప్రాంతానికి చేరుకున్నారు. పుట్టినగడ్డపై కాలుమోపేలోపే పోలీసులు అరెస్ట్‌చేశారు. ముగ్గురు తమిళనాడు వ్యక్తుల సాహసోపేత అక్రమ అంతర్జాతీయ సముద్ర ప్రయాణ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే తరహాలో అరేబియా సముద్ర జలాల మీదుగా ముంబైలో అడుగుపెట్టిన పాక్ ముష్కరులు మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. దీంతో సముద్రజలాల మీద గస్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. మంగళవారం ఉదయం ముంబై సమీపంలో ఈ ఘటన జరిగింది. సంబంధిత వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు. జనవరి 28న ప్రయాణం షురూ తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల విజయ్ వినయ్ ఆంటోనీ, 29 ఏళ్ల జె.సహాయట్ట అనీశ్, రామనాథపురానికి చెందిన 31 ఏళ్ల నిట్సో డిటోలు రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లారు. వీరి వృత్తి చేపలుపట్టడం. కువైట్‌లోనూ అదే పనిచేసేవారు. కేరళలోని త్రివేండ్రమ్ నుంచి వీరు కువైట్‌కు వెళ్లారు. యజమాని నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. భారత్‌కు రానీయకుండా వారి పాస్‌పోర్టులను దాచేశాడు. ఎలాగైనా కువైట్ నుంచి బయటపడాలని నిర్ణయించుకుని అందుకు ఓనర్ చేపల బోటును ఎంచుకున్నారు. జనవరి 28వ తేదీన ప్రయాణం మొదలెట్టి సౌదీ అరేబియా, ఖతర్, దుబాయ్, మస్కట్, ఒమన్, పాకిస్తాన్ మీదుగా భారత జలాల్లోకి ప్రవేశించారు. రంగంలోకి నేవీ, పోలీసులు మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ముంబైలోని యెల్లో గేట్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ చేపట్టారు. ససూన్ డాక్ ప్రాంతంలో వీరి రాకను గమనించారు. ఈ చేపల పడవ నిర్మాణం భారతీయ పడవలతో పోలిస్తే విభిన్నంగా ఉండటంతో అనుమానమొచ్చి అడ్డుకున్నారు. అందులోని ముగ్గురికీ మరాఠా, హిందీ అస్సలు రాకపోవడం, పొడిపొడిగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతుండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే నేవీ అధికారులతోపాటు పోలీసులు మూడు పడవల్లో హుటాహుటిన చేరుకున్నారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది సైతం రప్పించి తనిఖీలు చేయించారు. పేలుడుపదార్థాలు ఏవీ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించారంటూ పాస్‌పోర్టు సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదుచేసి అరెస్ట్‌చేశారు. ముంబైలోని కోర్టులో హాజరుపరచగా ఫిబ్రవరి 10వ తేదీదాకా పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలిచ్చారు. విదేశీ గడ్డపై వీళ్లు ఏదైనా నేరానికి పాల్పడ్డారో తెల్సుకోండని పోలీసులకు సూచించారు. పడవలో జీపీఎస్ స్వాధీనం చేసుకున్న పడవను బాంబు స్వా్కడ్ క్షుణ్ణంగా తనిఖీచేసింది. ఒక జీపీఎస్‌ను గుర్తించారు. సువిశాల సముద్రంలో దారి తప్పకుండా ఉండేందుకు వారు జీపీఎస్‌ను ఉపయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీళ్లను కువైట్‌కు తీసుకెళ్లిన ఏజెంట్‌ను కెప్టెన్ మదన్‌గా పోలీసులు గుర్తించారు. ‘‘అబ్దుల్లా షర్హీద్ అనే మాస్టర్ దగ్గర పనిచేసేవాళ్లం. జీతాలు సరిగా ఇచ్చేవాడు కాదు. అదేంటని అడిగితే చితకబాదేవాడు. ఇదే విషయమై కువైట్‌లోని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాం. ఇండియన్ ఎంబసీలోనూ మా గోడు వెళ్లబోసుకున్నాం. ఫలితం శూన్యం. అందుకే ఇలా పారిపోయి వచ్చాం’’అని ఈ ముగ్గురు పోలీసులకు చెప్పారు. వీళ్ల కుటుంబీలకు ఇప్పటికే వీరి రాక సమాచారం చేరవేశామని పోలీసులు వెల్లడించారు. -
అస్త్రాలన్నీ ప్రయోగిస్తాం
న్యూఢిల్లీ: మరో ఉగ్రదాడి జరిగితే తిప్పికొట్టేందుకు అన్ని అస్త్రాలను సిద్ధంగా ఉంచుకుంటామని భారత్ ప్రకటించింది. పాకిస్తాన్ భూభాగంలో ఆవాసం పొందుతున్న ఉగ్రమూకలపై విరుచుకుపడే సామర్థ్యం ఉందని చాటుకోవడానికే బాలకోట్లో వైమానిక దాడులకు దిగామని స్పష్టతనిచ్చింది. జైషే మహ్మద్ శిక్షణా శిబిరంపై యుద్ధం ముగిసిందని, పాకిస్తాన్ భూభాగం నుంచి ఇంకా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకునేలా ఆ దేశంపై ఒత్తిడి పెంచడమే తమ తదుపరి లక్ష్యమని పేర్కొంది. ‘ఉగ్రవాదుల మౌలిక వసతులపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తాం. ఆ దేశ కొత్త నాయకత్వం మాటలకు పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం’ అని పాకిస్తాన్ నూతన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఫిబ్రవరి 27న భారత్‌పై వైమానిక దాడికి దిగినప్పుడు పాకిస్తాన్ ఎఫ్–16 యుద్ధ విమానాన్ని వినియోగించిన సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా అధికారులకు అందజేశారని భారత్ తెలిపింది. మంగళవారం దోవల్‌తో ఫోన్లో మాట్లాడిన అమెరికా భద్రతా సలహాదారు జాన్ బోల్టన్..జైషే చీఫ్ మసూద్ అజహర్‌ను నిషేధిత జాబితాలో చేర్చేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తామని తెలిపారు. అలాగే, యుద్ధ విమానాలను పాకిస్తాన్ దుర్వినియోగం చేయడంపై అమెరికా దర్యాప్తు చేస్తుందని ఆశిస్తున్నామని భారత్ పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్తాన్ అన్ని దేశాలను అభ్యర్థించిందని, కానీ సమస్య ఇండో–పాక్‌ది కాదని, ఉగ్రవాదానిది అని అంతర్జాతీయ సమాజానికి అర్థమయ్యేలా చెప్పామని తెలిపింది. మసూద్ అజహర్ పాకిస్తాన్లో నివసిస్తున్నందున అతనిపై నిషేధం విధిస్తే ఆ దేశానికి ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాకిస్తాన్ నిర్బంధంలోకి తీసుకున్న తరువాత అన్ని దేశాలు తమకే మద్దతుగా నిలిచాయని, అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో పాకిస్తాన్ అభినందన్‌ను వెంటనే విడుదల చేసిందని తెలిపింది. మరోవైపు, బాలాకోట్ వైమానిక దాడి నేపథ్యంలో నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ తన బలగాలను పెంచుకుంటోంది. అంతర్జాతీయ సరిహద్దు వెంట రాడార్లను క్రియాశీలకం చేసి, ఆయుధాగారాలు ఎల్లవేళలా పనిచేయాలని ఆదేశాలిచ్చింది. భారత జలాంతర్గామిని అడ్డుకున్నాం: పాక్ నేవీ భారత జలాంతర్గామి తమ జలాల్లోకి రాకుండా నిరోధించామని పాకిస్తాన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి మార్చి 4న తీసినట్లుగా భావిస్తున్న ఓ వీడియోను విడుదల చేసింది. పాకిస్తాన్ నేవీ దళం ప్రత్యేక నైపుణ్యాలు ప్రదర్శించి విజయవంతంగా భారత జలాంతర్గామి రాకను నిలువరించిందని పేర్కొంది. శాంతియుత విధానంలో భాగంగా భారత జలాంతర్గామిని తాము లక్ష్యంగా చేసుకోకుండా విడిచిపెట్టామని పాక్ నేవీ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ ఘటన నుంచి భారత్ పాఠాలు నేర్చుకుని శాంతి దిశగా నడవాలని సూచించారు. అయితే పాకిస్తాన్ ఆరోపణల్ని భారత్ ఖండించింది. పాక్ నేవీ తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోమని స్పష్టం చేసింది. జాతీయ తీర ప్రాంత భద్రతకే బలగాల్ని మోహరించామని భారత నేవీ తెలిపింది. సుఖోయ్‌కి ‘స్పైస్’ సుఖోయ్–30ఎంకేఐ యుద్ధ విమానాలకు ఇజ్రాయెల్‌లో తయారైన స్సైస్–2000 రకం బాంబులను అమర్చేందుకు విమానాలకు అవసరమైన మార్పులు చేస్తున్నామని భారత వైమానిక దళ అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మిరేజ్–2000 విమానాలకు స్పైస్–2000 బాంబులను అమర్చే వెసులుబాటు ఉంది. బాలాకోట్ దాడిలో ఈ విమానాలనే వినియోగించారు. స్పైస్–2000 బాంబులకు లేజర్ ద్వారా మార్గనిర్దేశనం చేయవచ్చు. ‘సముద్ర’ దాడుల ముప్పు ఉంది: నేవీ చీఫ్ సముద్ర మార్గం గుండా దేశంలోకి చొరబడి దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని నేవీ చీఫ్ సునీల్ లాంబా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పక్కా సమాచారం తమకు అందిందని తెలిపారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఇండో–పసిఫిక్ రీజినల్ డైలాగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..భారత్‌ను అస్థిరపరచాలనుకుంటున్న ఓ దేశ మద్దతుతోనే పుల్వామా ఉగ్రదాడి జరిగిందని పరోక్షంగా పాకిస్తాన్‌ను దుయ్యబట్టారు. ఉగ్రవాదం అంతర్జాతీయ స్థాయికి చేరడంతో ముప్పు మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ఆసియాలో వేర్వేరు రూపాల్లో ఉగ్రదాడులు జరిగాయని, కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ ముప్పు నుంచి తప్పించుకున్నాయని పేర్కొన్నారు. శత్రు దేశ ప్రభుత్వ మద్దతుతో కూడిన ఉగ్రవాద ముప్పు భారత్‌కు అధికంగా ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ పాక్ వెళ్లి లెక్కించుకోవచ్చు: రాజ్‌నాథ్ ధుబ్రి(అస్సాం): పాక్‌లోని బాలాకోట్‌లో చేపట్టిన వైమానిక దాడిలో ఎందరు ముష్కరులు హతమయ్యారో రేపోమాపో తెలుస్తుందని హోం మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ఈ దాడిపై విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, అవసరమైతే కాంగ్రెస్ అక్కడికి వెళ్లి మృతదేహాల సంఖ్యను లెక్కించుకోవచ్చని చురకలంటించారు. వైమానిక దళం బాంబులు జారవిడవడానికి ముందు ఆ ప్రాంతంలో 300 సెల్ఫోన్లు పనిచేస్తున్నట్లు జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(ఎన్టీఆర్వో) గుర్తించిందని తెలిపారు. ఆ సెల్ఫోన్లను చెట్లు వాడుతున్నాయా? అని ఎద్దేవా చేసిన రాజ్‌నాథ్ ఎన్టీఆర్వోను కూడా నమ్మరా? అని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు రాజకీయాలు చేయొచ్చు కానీ, దేశ నిర్మాణానికి కాదని హితవు పలికారు. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో అధునాత ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను రాజ్‌నాథ్ మంగళవారం ప్రారంభించారు. అది సైనిక చర్య కాదు చెన్నై: బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై జరిపిన వైమానిక దాడులపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా స్పందించారు. వైమానిక దాడులు సైనిక చర్య కాదని.. ఈ దాడిలో బాలాకోట్ సహా పరిసర ప్రాంతాల్లోని సాధారణ ప్రజలెవరికీ నష్టం కలగలేదని స్పష్టం చేశారు. దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు, శిక్షకులు, సీనియర్ కమాండర్లు మరణించారని మాత్రమే విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పారని, ఫలానా సంఖ్య అని వెల్లడించలేదని ఆమె గుర్తు చేశారు. దీనినే ప్రభుత్వ ప్రకటనగా భావించాలని సూచించారు. కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్ గ్రామంలో మంగళవారం మిలిటెంట్లు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ధ్వంసమైన తమ ఇంటి వద్ద రోదిస్తున్న స్థానికులు. సుమారు 12 గంటలు కొనసాగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక పౌరుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. నియంత్రణ రేఖ వెంట మూడు చోట్ల పాకిస్తాన్ మోర్టార్లతో దాడికి పాల్పడటంతో ఒక సైనికుడు గాయపడ్డాడు. -
సముద్ర మార్గం ద్వారా భీకర దాడులకు పాక్ స్కెచ్
సాక్షి, న్యూఢిల్లీ : సముద్ర మార్గం ద్వారా దేశంలోకి చొచ్చుకువచ్చి భారత్‌లో విధ్వంసకర దాడులు చేపట్టేందుకు ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం నేడు ప్రపంచ శాంతి సుస్ధిరతలకు పెను సవాల్ విసురుతోందని, ఈ మహమ్మారిని నియంత్రించేందుకు అంతర్జాతీయ సమాజం ఒక్కటై పోరాడాలని ఆయన కోరారు. గత కొన్నేళ్లుగా ఇండో పసిఫిక్ ప్రాంతం భిన్నరూపాల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఇండో పసిఫిక్ రీజినల్ డైలాగ్‌లో ఆయన మాట్లాడుతూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోందని నేవీ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్లో మనం మూడు వారాల కిందట ఉగ్రవాదుల భీకర దాడిని చూశామని పుల్వామా ఘటనను ఆయన ప్రస్తావించారు. భారత్‌ను అస్థిరపరిచేందుకు పొరుగు దేశం ఉగ్రవాదులను ప్రేరేపిస్తోందని పరోక్షంగా పాకిస్తాన్‌పై విమర్శలు గుప్పించారు. సముద్ర మార్గం ద్వారా దేశంలోకి చొచ్చుకువచ్చి ఉగ్రవాదులు భారత్‌లో అలజడి సృష్టించవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయని చెప్పారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించేందుకు భారత సాయుధ దళాలు సంసిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. -
సముద్ర మార్గంలో హజ్ యాత్రకు సౌదీ అంగీకారం
న్యూఢిల్లీ: హజ్ యాత్రను తక్కువ ఖర్చులో పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది. హజ్ యాత్రికులు జెడ్డాకు చేరుకునేందుకు 23 ఏళ్ల క్రితం మూసివేసిన సముద్ర మార్గాన్ని పునరుద్ధరించాలన్న భారత్ విజ్ఞప్తిని సౌదీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంపై సౌదీ హజ్, ఉమ్రా మంత్రి మహ్మద్ బిన్ ఆదివారం సంతకం చేసినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. అయితే సముద్ర మార్గం ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్న విషయంపై పూర్తి సమాచారం తెలియలేదు. 1995 వరకు హజ్ యాత్రికులు ముంబైలోని మజ్గావ్ (ఎల్లో గేట్) నుంచి సౌదీలోని జెడ్డాకు ఈ మార్గం ద్వారానే ప్రయాణించేవారు. అప్పట్లో ఈ ప్రయాణానికి సుమారు 12 నుంచి 15 రోజుల సమయం పట్టేది. అయితే ప్రస్తుతం అత్యాధునిక ఓడలు అందుబాటులో ఉండటంతో యాత్రకు 4 రోజులు సమయం మాత్రమే పట్టనుంది. మెహ్రం, లాటరీ లేకుండానే హజ్‌కు.. 2018లో దాదాపు 1300 మంది భారతీయ మహిళలు పురుషుల తోడు లేకుండానే హజ్ యాత్రకు వెళ్లనున్నారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ పేర్కొన్నారు. వీరందరినీ లాటరీ విధానం నుంచి తప్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఉగ్రవాదులు చొరబడుతున్నారు!
అచ్యుతాపురం: సముద్రమార్గంలో ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకోవడంపై మాక్‌డ్రిల్ ప్రారంభమయ్యింది. ఈ మేరకు మెరైన్, కోస్టుగార్డు సిబ్బంది ఉగ్రవాదుల మాదిరిగా సముద్రమార్గంలో ప్రయాణించి భూభాగంలోకి ప్రవేశిస్తారు. వారిని తీరప్రాంత పోలీసులు గస్తీ నిర్వహించి పట్టుకోవాలి. చొరబాటును అడ్డుకోకుంటే సదరు ఉగ్రవాదులు సంబంధిత సిబ్బంది దగ్గరలో ఉన్న పోలీసుస్టేషన్‌కు చేరుకుంటారు. ఇలా చొరబాటును అడ్డుకోవడంపై మూడురోజుల మాక్‌డ్రిల్‌ను చేపడుతున్నారు. దీంతో పోలీసులు తీరం నుంచి వచ్చే ప్రతివాహనాన్నీ తనిఖీ చేస్తున్నారు. పూడిమడక, తంతడి వద్ద చెక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. పోలీసులు అడ్డుకోలేకపోతే వారి విధి నిర్వహణలో అలసత్వాన్ని ఉన్నతాధికారులు సమీక్షించి హెచ్చరిస్తారు. అయితే ఈ తతంగమంతా మాక్‌డ్రిల్ అని తెలియక మత్స్యకారులు పోలీసుల తనిఖీలతో భయపడుతున్నారు. తమ గ్రామం నుంచి ఎన్నిసార్లు బయటకు వెళ్లినా పోలీసులకు వివరాలను చెప్పాల్సి వస్తోంది. -
సముద్రమార్గం ద్వారా హజ్‌కు!
న్యూఢిల్లీ: 23 ఏళ్ల విరామం తరువాత సముద్ర మార్గం ద్వారా హజ్ యాత్రికులను సౌదీ అరేబియాకు పంపించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. హజ్ పాలసీ 2018 రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ వచ్చే ఏడాది నుంచి దీన్ని అమలు చేయవచ్చని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. జలమార్గం ద్వారా హజ్ యాత్రికులను ముంబై నుంచి జెడ్డాకు పంపించడం 1995 నుంచి నిలిపి వేశారు. ముంబై నుంచి జెడ్డాకు యాత్రికులను చేరవేసే ఎంవీ అక్బరీ నౌక బాగా పాతదై ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడంతో అప్పట్లో సముద్ర ప్రయాణాన్ని నిలిపేశారు. విమానయానం ద్వారా వెళ్లే హజ్ యాత్రికులకు ఇచ్చే సబ్సిడీని 2022 నాటికి రద్దు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం కోసం చూస్తోంది. -
వారంలో 700 మంది శరణార్థులు గల్లంతు!
రోమ్: యూరప్‌కు సముద్ర మార్గంలో అక్రమంగా పడవల్లో తరలివస్తూ ప్రమాదవశాత్తు మరణించిన వారి సంఖ్య తాజాగా 700కు చేరింది. శుక్రవారం సముద్రంలో శరణార్థులతో ఇటలీ తీరానికి వస్తున్న పడవ మునిగిన ఘటనలో 45 మంది మరణించారు. బుధవారం మరో పడవ మునిగిన ఘటనలో 100 మంది జాడ గల్లంతైందని ఐరాస శరణార్థుల హైకమిషనర్ అధికారప్రతినిధి కార్లొటా సమీ తెలిపారు. బుధవారం లిబియా నుంచి చెరో 500 మంది ప్రయాణికులతో రెండు పడవలు ఇటలీకి బయల్దేరాయి. రెండింటినీ తాడుతో కట్టారు. అయితే, మార్గమధ్యంలో వెనక వైపు పడవ మునగడం ప్రారంభమవడంతో ముందు పడవ కెప్టెన్ తాడును కట్‌చేశాడు. దీంతో కిక్కిరిసిన శరణార్థులతో ఉన్న రెండో పడవ మునిగిపోయింది. -
ఫిబ్రవరిలోనే సీ ప్లేన్ సేవలు
సాక్షి, ముంబై: అంతా సవ్యంగా సాగితే ఫిబ్రవరిలో సముద్రమార్గం మీదుగా విమాన (సీ ప్లేన్) సేవలు ప్రారంభమయ్యే అవకాశముంది. బీపీటీ తప్ప మిగతా అన్ని శాఖల నుంచి అనుమతి వచ్చిందని మెహెర్ కంపెనీ ఎండీ సిద్ధార్థ్ వర్మ చెప్పారు. దీని నుంచి కూడా అనుమతి లభిస్తే తొలి విడతలో జుహూ సముద్ర తీరం నుంచి గిర్గావ్ (చర్నిరోడ్) చౌపాటి వరకు ఫిబ్రవరి నుంచి సీ ప్లేన్ సేవలు ప్రారంభిస్తామని తెలిపారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.750 చార్జీ వసూలు చేయాలని ఆలోచనలో ఉన్నామన్నారు. ‘ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోకుండా సమయానికి తమ గమ్యస్థానం చేరుకోవాలంటే ముంబైకర్లకు ఈ సీ ప్లేన్ సర్వీసులు ఎంతో దోహదపడతాయి. ఈ సేవలకి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుంద’ని వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో బెస్ట్ బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు, చివరకు లోకల్ రైళ్లు కూడా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కిక్కిరిసి ఉంటున్నాయి. వీటి నుంచి ముంబైకర్లకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో సీ ప్లేన్ సేవలు ప్రారంభించాలని కొన్ని సంవత్సరాల క్రితం మెహెర్ కంపెనీ భావించింది. దీనికోసం పర్యావరణ, బాంబే పోర్టు ట్రస్టు (బీపీటీ), నావికా దళం, భద్రత తదితర శాఖల అనుమతి కోరింది. ఇందులో బాంబే పోర్టు ట్రస్టు మినహా మిగతా శాఖల నుంచి ఇటీవలే అనుమతి లభించింది. త్వరలో బీపీటీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలున్నాయి. దీంతో ఫిబ్రవరిలో ఈ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. సాధారణంగా రోడ్డు మార్గం మీదుగా జుహూ నుంచి గిర్గావ్ చేరుకోవాలంటే కనీసం గంటన్నరకుపైగా సమయం పడుతుంది. అదే సీ ప్లేన్‌లో వస్తే కేవలం ఏడు నిమిషాల్లోనే చేరుకోవచ్చు. జుహూ నుంచి ట్యాక్సీలో వస్తే (ట్రాఫిక్ జాంలో) కనీసం రూ.300-450 వరకు చార్జీలు అవుతాయి. దీన్నిబట్టి చూస్తే సీ ప్లేన్‌లో రావడంవల్ల వ్యాపారవేత్తలు, ఇతర రంగాల ప్రముఖుల విలువైన సమయం ఆదా కానుంది. చార్జీల్లో కూడా పెద్దగా తేడా లేదు. దీంతో ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశముందని సిద్ధార్థ్ వర్మ అభిప్రాయపడ్డారు. ఈ సేవలకు వచ్చే స్పందనను బట్టి మిగతా కీలక ప్రాంతాలకు కూడా సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభిస్తామని తెలిపారు. భవిష్యత్‌లో ఇంధనం ధరలు పెరిగితే దాన్నిబట్టి చార్జీలు పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. ‘ప్రారంభ దశలో ఈ సేవలకు ‘సెస్నా-206’ నాలుగు సీట్ల సామర్థ్యమున్న విమానాలను వినియోగిస్తారు. ఫిబ్రవరి ఆఖరు వరకు సెస్నా-8 తొమ్మిది సీట్ల సామర్థ్యమున్న విమానాలను, ఆ తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరిగితే 19 సీట్ల సామర్థ్యమున్న విమానాలను నడిపే యోచనలో ఉన్నామ’ని ఆయన చెప్పారు. జుహూ-గిర్గావ్ తర్వాత నాసిక్, లవాసా, లోనావాలా, అంబివ్యాలీ ప్రాంతాలకు కూడా నడుపుతామని స్పష్టం చేశారు. ఈ విమానాలు నీటిలో, నేలపై ఇలా ఎక్కడైనా ల్యాండింగ్ చేయడానికి వీలుంది. సాంకేతిక లోపంతో క్రాష్ ల్యాండింగ్ అయ్యే ప్రమాదం లేదు. దీంతో ప్రయాణికులకు ఎలాంటి హాని ఉండదని వర్మ ధీమా వ్యక్తం చేశారు.