ముగ్గు్గరు భారత జాలర్లు కువైట్ నుంచి 10 రోజులు ప్రయాణించి ముంబై చేరిన పడవ
ముంబై: పరాయి దేశంలో పడరాని పాట్లు పడి, యజమాని పెట్టే హింసలు భరించలేక స్వదేశం వెళ్లే సాహసం చేశారు ముగ్గురు భారతీయులు. అనుకున్నదే తడవుగా యజమాని పడవనే తమ ప్రణాళికకు ప్రధాన ఆయుధంగా వాడుకున్నారు. ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా కువైట్ నుంచి బయల్దేరి సముద్ర మార్గం గుండా నేరుగా ముంబై తీర ప్రాంతానికి చేరుకున్నారు. పుట్టినగడ్డపై కాలుమోపేలోపే పోలీసులు అరెస్ట్‌చేశారు.
ముగ్గురు తమిళనాడు వ్యక్తుల సాహసోపేత అక్రమ అంతర్జాతీయ సముద్ర ప్రయాణ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే తరహాలో అరేబియా సముద్ర జలాల మీదుగా ముంబైలో అడుగుపెట్టిన పాక్ ముష్కరులు మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. దీంతో సముద్రజలాల మీద గస్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. మంగళవారం ఉదయం ముంబై సమీపంలో ఈ ఘటన జరిగింది. సంబంధిత వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు.
జనవరి 28న ప్రయాణం షురూ
తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల విజయ్ వినయ్ ఆంటోనీ, 29 ఏళ్ల జె.సహాయట్ట అనీశ్, రామనాథపురానికి చెందిన 31 ఏళ్ల నిట్సో డిటోలు రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లారు. వీరి వృత్తి చేపలుపట్టడం. కువైట్‌లోనూ అదే పనిచేసేవారు. కేరళలోని త్రివేండ్రమ్ నుంచి వీరు కువైట్‌కు వెళ్లారు. యజమాని నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. భారత్‌కు రానీయకుండా వారి పాస్‌పోర్టులను దాచేశాడు. ఎలాగైనా కువైట్ నుంచి బయటపడాలని నిర్ణయించుకుని అందుకు ఓనర్ చేపల బోటును ఎంచుకున్నారు. జనవరి 28వ తేదీన ప్రయాణం మొదలెట్టి సౌదీ అరేబియా, ఖతర్, దుబాయ్, మస్కట్, ఒమన్, పాకిస్తాన్ మీదుగా భారత జలాల్లోకి ప్రవేశించారు.
రంగంలోకి నేవీ, పోలీసులు
మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ముంబైలోని యెల్లో గేట్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ చేపట్టారు. ససూన్ డాక్ ప్రాంతంలో వీరి రాకను గమనించారు. ఈ చేపల పడవ నిర్మాణం భారతీయ పడవలతో పోలిస్తే విభిన్నంగా ఉండటంతో అనుమానమొచ్చి అడ్డుకున్నారు. అందులోని ముగ్గురికీ మరాఠా, హిందీ అస్సలు రాకపోవడం, పొడిపొడిగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతుండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే నేవీ అధికారులతోపాటు పోలీసులు మూడు పడవల్లో హుటాహుటిన చేరుకున్నారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది సైతం రప్పించి తనిఖీలు చేయించారు. పేలుడుపదార్థాలు ఏవీ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించారంటూ పాస్‌పోర్టు సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదుచేసి అరెస్ట్‌చేశారు. ముంబైలోని కోర్టులో హాజరుపరచగా ఫిబ్రవరి 10వ తేదీదాకా పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలిచ్చారు. విదేశీ గడ్డపై వీళ్లు ఏదైనా నేరానికి పాల్పడ్డారో తెల్సుకోండని పోలీసులకు సూచించారు.
పడవలో జీపీఎస్
స్వాధీనం చేసుకున్న పడవను బాంబు స్వా్కడ్ క్షుణ్ణంగా తనిఖీచేసింది. ఒక జీపీఎస్‌ను గుర్తించారు. సువిశాల సముద్రంలో దారి తప్పకుండా ఉండేందుకు వారు జీపీఎస్‌ను ఉపయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీళ్లను కువైట్‌కు తీసుకెళ్లిన ఏజెంట్‌ను కెప్టెన్ మదన్‌గా పోలీసులు గుర్తించారు. ‘‘అబ్దుల్లా షర్‌హీద్ అనే మాస్టర్ దగ్గర పనిచేసేవాళ్లం. జీతాలు సరిగా ఇచ్చేవాడు కాదు. అదేంటని అడిగితే చితకబాదేవాడు. ఇదే విషయమై కువైట్‌లోని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాం. ఇండియన్ ఎంబసీలోనూ మా గోడు వెళ్లబోసుకున్నాం. ఫలితం శూన్యం. అందుకే ఇలా పారిపోయి వచ్చాం’’అని ఈ ముగ్గురు పోలీసులకు చెప్పారు. వీళ్ల కుటుంబీలకు ఇప్పటికే వీరి రాక సమాచారం చేరవేశామని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment