'నాగార్జున వర్సిటీలో కుల రాజ్యం'
విజయవాడ: ఆచార్య నాగార్జున వర్సిటీని కులరాజ్యంగా మార్చిన ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని పాలించడానికి అనర్హుడని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు విమర్శించారు. విజయవాడలో శుక్రవారం కత్తి పద్మారావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ సామ్రాజ్యవాదం, కులాధిపత్యం కొనసాగుతోందని ఆరోపించారు. గతంలో కారంచేడు, చుండూరు జరిగిన దాడుల నేడు విశ్వవిద్యాలయాల్లో చోటు చేసుకుంటున్నాయిన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకునే పరిస్థితులు లేకుండా వారిని అభద్రతకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌గా ఉన్న దళితుడిని తొలగించి... చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఆధిపత్యం ఇచ్చారని గుర్తు చేశారు. లైబ్రేరియన్‌గా ఉన్న వ్యక్తిని కార్యనిర్వాహక కమిటీలో చేర్చి యూనివర్సిటీని కులరాజ్యంగా మార్చారని దుయ్యబట్టారు.
ఏఎన్‌యూలో ఒకే కులానికి చెందిన ఐదుగురు వ్యక్తుల చేతుల్లో పాలన సాగుతోందన్నారు. ఏఎన్‌యూలో కుల, మత భావాలను ఆచరిస్తున్న రెక్టార్ కె.ఆర్.ఎస్.సాంబశివరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ పి.నరసింహారావు, దూరవిద్య కేంద్రం డెరైక్టర్ పి.శంకరపిచ్చయ్య, పాలకమండలి సభ్యుడు కె.వెంకట్రావులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో జరుగుతున్న ఘటనలపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్నారు. వీటపై ఆగస్టు 14న విజయవాడలో సదస్సు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా కత్తి పద్మారావు ప్రకటించారు.