N.chandra babu naidu
-
నేడు జిల్లాకు సీఎం రాక
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు రంగం సిద్ధమయింది. అధికార యంత్రాంగం మొత్తం ఎమ్మిగనూరు, కోటేకల్‌లో తిష్టవేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మిగనూరు మండలం కోటేకల్ చేరుకోనున్న ముఖ్యమంత్రి.. ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఎమ్మిగనూరులోనే ఉంటారు. హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు కోటేకల్‌లో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో దిగుతారు 3.10 నుంచి 3.25 గంటల వరకు కోటేకల్లోని వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. 3.30 నుంచి 3.45 వరకు రైతులతో ముఖాముఖి. 3.45 నుంచి 3.55 వరకు నీరు-చెట్టుపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలన. 3.55 నుంచి 5.30 వరకు కోటేకల్‌లో నీరు-చెట్టుపై అవగాహన సదస్సు. 5.40 నుంచి 6 గంటల వరకు బనవాసిలోని టెక్స్టైల్స్ పార్కు భూములను పరిశీలన. అక్కడే చేనేతకారులతో ముఖాముఖి. 6.15 గంటలకు రోడ్డు మార్గంలో ఎమ్మిగనూరులోని ఆర్అండ్బి గెస్ట్ హౌస్ చేరుకుంటారు. 6.15 నుంచి 7 గంటల వరకు అధికారులు, అనధికారులతో సమావేశం. 7.15 నుంచి 8.30 గంటల వరకు ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెజెండ్ సినిమా 400 రోజుల విజయోత్సవ సభలో పాల్గొంటారు. రాత్రికి ఎమ్మిగనూరులోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో బస. 3వ తేదీ ఉదయం 8 గంటలకు స్పిన్నింగ్ మిల్ మైదానంలోని హెలిపాడ్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతారు. -
23న జిల్లాకు చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు 23న జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలో జరిగే పార్టీ జిల్లాస్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మంగళవారం కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా టీడీపీకి చెందిన జిల్లా నేతలతో చంద్రబాబు పాల్గొనే కార్యక్రమం నిర్వహించాల్సిన తీరుపై ఆ యన చర్చించినట్లు సమాచారం. ఏర్పాట్లు భారీస్థాయిలో ఉండేట్లు చూడాల్సిందిగా పార్టీ జిల్లా నేతలకు సూచించినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన, సాధారణ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ఇటీవల వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. -
నేడు కర్నూలుకు ముఖ్యమంత్రి రాక
c అగ్రికల్చర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు శుక్రవారం కర్నూలుకు రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పకడ్బందీగా పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏడు మిషన్లలో రెండవదైన సోషల్ ఎంపవర్మెంట్ మిషన్‌ను ముఖ్యమంత్రి కర్నూలులోని ఔట్‌డోర్ స్టేడియంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పొదుపు మహిళలు తదితరులతో అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉదయం 10.45 గంటలకు కర్నూలు ఎస్ఏపీ క్యాంపులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 12.45 గంటల వరకు ఔట్‌డోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. 1.10 గంటలకు కర్నూలు నుంచి హెలిక్యాప్టర్ ద్వారా వైఎస్సార్ జిల్లా గండికోట ప్రాజెక్టుకు వెళతారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు తదితరులు పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణ, జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్ గౌడ్ తదితరులు పర్యవేక్షించారు. బహిరంగ సభకు 8 వేల మంది పొదుపు మహిళలను తరలిస్తున్నారు. -
కుప్పం తమ్ముళ్ల రగడ
తిరుపతి: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్.చంద్రబాబునాయుడుకు సొంత నియోజకవర్గంలో ‘స్థానిక’ గండం పొంచి ఉంది. కుప్పం నియోజకవర్గంలో ఇప్పటి వరకూ దళిత ఓటర్లు, బలహీనవర్గాల వారు టీడీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఇప్పుడు వారి నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు ఆశిస్తున్న వారి నుంచి ఈ ప్రమాదం తలెత్తింది. నియోజకవర్గ కేంద్రమైన కుప్పం జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు టీడీపీ ఓటు బ్యాంకుకు చాపకింద నీరులా గండికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని మిగిలిన మండలాల్లోనూ ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇంకా బహిర్గతం కాలేదని అంటున్నారు. కుప్పం జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మంగళవారం జరిగిన ముఖ్య కార్యకర్తల అభిప్రాయ సేకరణలో తమ్ముళ్ల వైఖరి ఆ పార్టీ నేతలకు ఆందోళన కలిగించింది. కుప్పం జెడ్పీటీసీ ఈ ఎన్నికల్లో ఎస్సీ జనరల్‌కు రిజర్వు చేశారు. ఈ స్థానాన్ని కుప్పం సర్పంచ్ వెంకటేష్ ఆశిస్తున్నారు. కిందటి ఏడాది పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో కుప్పం పంచాయతీని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. దీనికోసం వెంకటేష్‌తో పాటు మరో నాయకుడు రాజ్‌కుమార్ పోటీపడ్డారు. నియోజకవర్గ నాయకులు సమన్వయం కుదిర్చి రాజ్‌కుమార్‌కు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తామని సర్దిచెప్పారు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎస్సీ జనరల్‌కు కేటాయించడంతో సర్పంచ్‌గా ఎన్నికైన వెంకటేష్ కూడా ఆ పదవిని తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తాను గతంలో ఎంపీపీగా పనిచేశానని సర్పంచ్‌గా పనిచేయడం తనవల్ల కాదని కొత్త పల్లవి అందుకున్నారు. దీంతో కొందరు ముఖ్యనేతలు వెంకటేష్ వైపు మొగ్గు చూపారు. అప్పట్లో తనకు హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చడం ఎంతవరకు సబబంటూ రాజ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్‌కు జెడ్పీటీసీ సీటు ఇస్తే పార్టీ అభ్యర్థిని ఓడించడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ తడాఖా చూపిస్తామని రాజ్‌కుమార్ వర్గం హెచ్చరికలు చేస్తున్నట్టు సమాచారం. కాగా కుప్పం ఎంపీపీ విషయంలోనూ పెద్ద ఎత్తున విభేదాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఎంపీపీ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుప్పం ఎంపీపీ, జెడ్పీటీసీగా వ్యవహరించిన సాంబశివం, చౌడప్ప ఇప్పుడు పోటీ పడుతున్నారు. అయితే ఈ పదవిని కుప్పం అర్బన్ అధ్యక్షులు సాగర్, కుప్పం ఉప సర్పంచ్ సుధాకర్ ఆశిస్తున్నారు. వీరిద్దరూ యువకులు. ఎంపీపీ స్థానాన్ని యువకులకు ఇవ్వాలన్న డిమాండ్‌ను వారు తెరపైకి తెచ్చారు. అన్ని పదవులు మాజీలకే ఇస్తూ పోతే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. మొత్తం మీద కుప్పం నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలు పూర్తయ్యేలోగా కొన్ని వర్గాల నుంచి చంద్రబాబు వ్యతిరేకత ఎదుర్కోక తప్పదనే భావన వ్యక్తమవుతోంది. -
ఫలించిన సోమిరెడ్డి వ్యూహం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఈ ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. కొత్త సంవత్సరం మొ దటి వారంలోనే ఆ పార్టీ అభ్యర్థులను ఇన్చార్జిల పేరుతో ప్రకటిస్తోంది. మొదట ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా గూటూరు కన్నబాబును నియమించినట్టు ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఆదివారం ప్రకటించారు. దీంతో జిల్లాలోని 10 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైనట్టే. ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల ఇన్చార్జిల నియామకంపై ఆ పార్టీ అధిష్టానం రెండు మూడు రోజులుగా కసరత్తు చేస్తోంది. ఈ రెండు స్థానాల్లోనూ తన వ్యాపారభాగస్వాములైన కన్నబాబు, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిని ఇన్చార్జిలుగా నియమించేలా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చక్రం తిప్పారు. అయితే ఆత్మకూరు ఇన్చార్జిని మాత్రమే మొదటగా ప్రకటించారు. ఈ నియమాకం ద్వారా సోమిరెడ్డిని కొంత చల్లబరిచినట్టే. కోవూరు విషయంలో పట్టువిడుపులకు అవకాశం కోరేందుకే ఆత్మకూరు ఇన్చార్జిని ముందుగా ప్రకటించినట్టు ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు పార్టీకి గుడ్‌బై చెప్పిన తర్వాత ఆత్మకూరు నియోజకవర్గంలో ఆ పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో కన్నబాబు నియామకానికే చంద్రబాబు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. కోవూరు విషయానికి వచ్చే సరికి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరుతోపాటు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పేరు తీవ్రంగా పరిశీలనలో ఉన్నాయి. మొన్నటి వరకు తాను పోటీ చేయనని చెబుతూ వచ్చిన ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డి మళ్లీ సీన్లోకి వచ్చారు. దీంతో కోవూరు ఇన్చార్జి ఎంపికలో పార్టీ కొంత గందరగోళంలో పడింది. కాగా పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆదివారం తన అనుచరులను రాజధానికి రావాల్సిందిగా కబురు పంపారు. అయితే ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్‌తో పరిస్థితులు ఎటు దారితీస్తాయో తెలియక ఆ ప్రయత్నాన్ని విరమించుకోమని సూచించినట్లు తెలిసింది. -
చంద్రబాబు ఢిల్లీ దీక్షకు అనుమతి లేదు
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకోకుండానే ఏపీ భవన్లో దీక్ష చేపట్టారు. ఈ విషయాన్ని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ స్పష్టం చేశారు. చంద్రబాబు దీక్షకు అనుమతి లేదని ఆయన చెప్పారు. సోమవారం మధ్యాహ్నం చంద్రబాబు డిమాండ్ ఏంటో చెప్పకుండానే దీక్ష మొదలు పెట్టారు. హైదరాబాద్‌లో ఉదయం ఆయన ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి ఢిల్లీ బయలుదేరి వచ్చారు. ఇక్కడ బాపు ఘాట్ వద్ద కూడా నివాళులర్పించి దీక్షకు కూర్చున్నారు. ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ ఆశయాలకు నిలువునా తూట్లు పొడిచిన చంద్రబాబుకు ఎన్టీఆర్ఘాట్ వద్ద నివాళులర్పించే నైతిక హక్కు లేదని ఎన్టీఆర్ అభిమానులు విమర్శించారు.