సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఈ ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. కొత్త సంవత్సరం మొ దటి వారంలోనే ఆ పార్టీ అభ్యర్థులను ఇన్‌చార్జిల పేరుతో ప్రకటిస్తోంది. మొదట ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా గూటూరు కన్నబాబును నియమించినట్టు ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఆదివారం ప్రకటించారు. దీంతో జిల్లాలోని 10 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైనట్టే. ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల ఇన్‌చార్జిల నియామకంపై ఆ పార్టీ అధిష్టానం రెండు మూడు రోజులుగా కసరత్తు చేస్తోంది. ఈ రెండు స్థానాల్లోనూ తన వ్యాపారభాగస్వాములైన కన్నబాబు, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిని ఇన్‌చార్జిలుగా నియమించేలా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చక్రం తిప్పారు.
అయితే ఆత్మకూరు ఇన్‌చార్జిని మాత్రమే మొదటగా ప్రకటించారు. ఈ నియమాకం ద్వారా సోమిరెడ్డిని కొంత చల్లబరిచినట్టే. కోవూరు విషయంలో పట్టువిడుపులకు అవకాశం కోరేందుకే ఆత్మకూరు ఇన్‌చార్జిని ముందుగా ప్రకటించినట్టు ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు పార్టీకి గుడ్‌బై చెప్పిన తర్వాత ఆత్మకూరు నియోజకవర్గంలో ఆ పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు.
దీంతో కన్నబాబు నియామకానికే చంద్రబాబు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. కోవూరు విషయానికి వచ్చే సరికి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరుతోపాటు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పేరు తీవ్రంగా పరిశీలనలో ఉన్నాయి. మొన్నటి వరకు తాను పోటీ చేయనని చెబుతూ వచ్చిన ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డి మళ్లీ సీన్‌లోకి వచ్చారు. దీంతో కోవూరు ఇన్‌చార్జి ఎంపికలో పార్టీ కొంత గందరగోళంలో పడింది. కాగా పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆదివారం తన అనుచరులను రాజధానికి రావాల్సిందిగా కబురు పంపారు. అయితే ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్‌తో పరిస్థితులు ఎటు దారితీస్తాయో తెలియక ఆ ప్రయత్నాన్ని విరమించుకోమని సూచించినట్లు తెలిసింది.
ఫలించిన సోమిరెడ్డి వ్యూహం
Published Mon, Jan 6 2014 5:44 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement