అనాథల ఆకాంక్షలు నెరవేరుస్తాం
- నెటైడ్ టెక్నాలజీస్ ఇండియా సీఎస్ఆర్ కౌన్సిల్ హెడ్ పలాష్రాయ్ చౌదరి
మణికొండ: అనాథ పిల్లల ప్రగతికి, వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషిచేస్తామని యునెటైడ్ టెక్నాలజీ ఇండియా సీఎస్ఆర్ కౌన్సిల్ హెడ్ పలాష్రాయ్ చౌదరి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 9 కేంద్రాలలో 800 మంది అనాథ విద్యార్థుల బాగోగులు చూస్తున్న ఎస్ఓఎస్ స్వచ్ఛంద సంస్థతో యునెటైడ్ టెక్నాలజీస్ సంస్థ బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఇక మీదట విద్యార్థులకు అవసమయ్యే విద్య, వారి నిర్వహణ, పుస్తకాలు, బట్టలు తదితర వస్తువులన్నీ తామే అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం రాజేంద్రనగర్ మండల పరిధిలోని వట్టినాగులపల్లి శివారులోని ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజ్లో నిర్వహించారు.
దీనికి ముఖ్య అతిథిగా హాజరైన చౌదరి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, జీవకళను పెంపొందించే కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే అనాథ పిల్లలకు చేయూత అందించి భావి భారతపౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎస్ఓఎస్తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఎస్ఓఎస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ జిన్సీ మాట్లాడుతూ తమ సంస్థలోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు, యూటీసీ ముందుకు రావటం అభినందనీయమన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు పెయిం టింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఇందులో యూటీసీ ఉద్యోగులతో పాటు ఎస్ఓఎస్ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.